త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Tax | తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొనుగోలు.. రూ.60 లక్షల పన్ను నోటీసు..

Gold Tax | తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మల నుంచి బహుమతిగా లేదా వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించి ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.60.08 లక్షల పన్ను వివాదం ఎదురైంది. బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని నిరూపించే సరైన పత్రాలు లేకపోవడంతో రూ.34.39 లక్షల పన్ను మినహాయింపును అధికారులు తిరస్కరించారు. ఈ కేసును మరోసారి పరిశీలించాలని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది.

S

Business | Published On Nov 27, 2026, 4.58 pm IST

Gold Tax | తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొనుగోలు.. రూ.60 లక్షల పన్ను నోటీసు..
Advertisement

Gold Tax | తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మల నుంచి బహుమతిగా లేదా వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించి ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.60.08 లక్షల పన్ను వివాదం ఎదురైంది. బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని నిరూపించే సరైన పత్రాలు లేకపోవడంతో రూ.34.39 లక్షల పన్ను మినహాయింపును అధికారులు తిరస్కరించారు. ఈ కేసును మరోసారి పరిశీలించాలని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది.

అస‌లు వివాదం ఎలా మొదలైంది..?

కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన బంగారాన్ని విక్రయించి ఇల్లు కొనుగోలు చేయడం సాధారణంగా కనిపించినప్పటికీ, ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం సరైన ఆధారాలు సమర్పించకపోతే భారీ పన్ను భారం ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజాగా వెలుగులోకి వచ్చిన కేసు స్పష్టం చేస్తోంది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి నుంచి 968 గ్రాములు, తల్లి నుంచి 310 గ్రాముల బంగారాన్ని పొందినట్లు తెలిపాడు. తన నానమ్మ నుంచి వీలునామా ద్వారా కూడా బంగారం వారసత్వంగా వచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన మొత్తంతో నివాస గృహాన్ని కొనుగోలు చేశానని, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద రూ.34.39 లక్షల మూలధన లాభాల పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాడు. అయితే కుటుంబ సభ్యుల నుంచి బంగారం వచ్చినట్లు నిరూపించే తగిన పత్రాలు సమర్పించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆ మినహాయింపును తిరస్కరించింది.

ఆదాయ‌పు ప‌న్ను అప్పీలేట్ ఏం చెప్పింది..?

దీంతోపాటు అతని బ్యాంకు ఖాతాల్లో రూ.25,68,850 నగదు డిపాజిట్లను కూడా అధికారులు ప్రశ్నించారు. ఇందులో అతని సొంత ఖాతాల్లో రూ.9,36,200, భార్య ఖాతాలో రూ.16,32,650 జమయ్యాయి. ఈ మొత్తం వెల్లడించిన ఆదాయం, గతంలో కూడబెట్టిన పొదుపు, ఇతర చట్టబద్ధమైన ఆదాయ వనరుల నుంచి వచ్చిందని అతను వివరించాడు. భార్య ఖాతాలో జమ చేసిన డబ్బు ఆమె సొంత ఆదాయం, పొదుపునకు సంబంధించినదని వాదించాడు. అయితే ఈ వివరణలను తొలి అప్పీలేట్ అధికారి అంగీకరించలేదు. దీంతో మొత్తం రూ.60.08 లక్షల మేర పన్ను వివాదం ఏర్పడింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అతను ముంబై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)ని ఆశ్రయించాడు. అప్పీల్‌ను పరిశీలించిన ట్రిబ్యునల్, నేషనల్ ఫేస్‌లెస్ అప్పీల్ సెంటర్ తాజా వివరాలు కోరుతూ నోటీసు ఇవ్వకుండానే అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకుందని పేర్కొంది. కేసును మరోసారి సమగ్రంగా పరిశీలించాలని అసెసింగ్ అధికారికి తిరిగి పంపించింది. అయితే ఇది కేవలం మరో అవకాశం మాత్రమేనని, రూ.34.39 లక్షల పన్ను మినహాయింపు మంజూరైనట్లు లేదా నగదు డిపాజిట్లకు ఆమోదం లభించినట్లు కాదని స్పష్టం చేసింది.

ప‌న్ను ఎలా లెక్కిస్తారు..?

గియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే బంగారం విక్రయం ద్వారా వచ్చిన నికర మొత్తంలో ఎంత భాగాన్ని అర్హత కలిగిన నివాస గృహంలో పెట్టుబడి పెట్టారనే అంశం కీలకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి బంగారాన్ని రూ.40 లక్షలకు విక్రయించి, రూ.15 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభం పొందాడనుకుందాం. అతను ఇంటి కొనుగోలుకు రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అర్హత కలిగిన పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా రూ.11.25 లక్షల మేర మాత్రమే మినహాయింపు లభిస్తుంది. మిగిలిన రూ.3.75 లక్షలపై పన్ను విధిస్తారు. అదే రూ.40 లక్షల మొత్తాన్ని అర్హత కలిగిన ఇంటి కొనుగోలులో పెట్టుబడి పెడితే, ఇతర నిబంధనలు నెరవేరిన పక్షంలో మొత్తం రూ.15 లక్షల మూలధన లాభానికి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

విక్ర‌యిస్తే ప‌న్ను వ‌ర్తిస్తుందా..?

తల్లిదండ్రుల నుంచి బహుమతిగా లేదా తాతయ్యలు, నానమ్మల నుంచి వారసత్వంగా వచ్చిన బంగారం స్వీకరించే సమయంలో సాధారణంగా పన్ను ఉండదని, అయితే దానిని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను వర్తిస్తుంద‌ని ఆయన వివరించారు. అందువల్ల బంగారం కొనుగోలు చేసిన అసలు యజమాని వివరాలు, కొనుగోలు ధర, యాజమాన్య కాలం కూడా పన్ను లెక్కింపులో కీలకమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి బంగారం పొందినట్లు తెలిపే గిఫ్ట్ డిక్లరేషన్లు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, వీలునామాలు, ఆభరణాల విలువ నిర్ధారణ నివేదికలు, విక్రయ రశీదులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, నగదు లావాదేవీల వివరాలను భద్రపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement