త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lifestyle Inflation | వేత‌నం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?

Lifestyle Inflation | ఉద్యోగంలో జీతం పెరిగినప్పటికీ బ్యాంకు ఖాతాలో పొదుపు పెరగకపోవడానికి ప్రధాన కారణం జీవనశైలి ద్రవ్యోల్బణం (లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్). ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులను కూడా పెంచుకోవడం, ఖరీదైన వస్తువులు కొనడం, రెస్టారెంట్లకు వెళ్లడం, విదేశీ పర్యటనలు చేయడం వంటి అలవాట్లు అదనపు ఆదాయాన్ని హరించేస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులు, సహోద్యోగులతో పోల్చుకుని ఖర్చులు పెంచుకోవడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం చూపుతోంది.

S

Business | Published On Nov 9, 2026, 3.04 pm IST

Lifestyle Inflation | వేత‌నం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?
Advertisement

Lifestyle Inflation | ఉద్యోగంలో జీతం పెరిగినప్పటికీ బ్యాంకు ఖాతాలో పొదుపు పెరగకపోవడానికి ప్రధాన కారణం జీవనశైలి ద్రవ్యోల్బణం (లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్). ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులను కూడా పెంచుకోవడం, ఖరీదైన వస్తువులు కొనడం, రెస్టారెంట్లకు వెళ్లడం, విదేశీ పర్యటనలు చేయడం వంటి అలవాట్లు అదనపు ఆదాయాన్ని హరించేస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులు, సహోద్యోగులతో పోల్చుకుని ఖర్చులు పెంచుకోవడం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం చూపుతోంది.

కార‌ణాలు ఏమిటి..?

సాధారణంగా జీతం పెరిగితే ఎక్కువ మొత్తంలో పొదుపు చేయవచ్చని, పెట్టుబడులు పెంచుకోవచ్చని ఉద్యోగులు భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఆదాయం పెరిగిన వెంటనే ఖర్చులు కూడా పెరగడం వల్ల అదనంగా వచ్చిన డబ్బు పొదుపు కాకుండా ఖర్చులకే సరిపోతోంది. దీనినే లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ లేదా లైఫ్‌స్టైల్ క్రీప్ అంటారు. మొదట ప్రీమియం ఉత్పత్తులు కొనడం, తరచూ రెస్టారెంట్లకు వెళ్లడం, ప్రయాణాలు, వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయడం వంటి చిన్న మార్పులతో ఈ అలవాటు మొదలవుతుంది. ఆ తర్వాత అవే రోజువారీ జీవితంలో భాగమవుతాయి. గతంలో బస్సు లేదా మెట్రోలో ప్రయాణించినవారు క్యాబ్‌లను ఆశ్రయించడం, పెద్ద ఇళ్లకు మారడం, ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, కొత్త కార్లు కొనడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఖరీదైన కార్లు కొనడం, పెద్ద ఇళ్లలో నివసించడం, విదేశీ పర్యటనలు చేయడం చూసి తాము కూడా అదే స్థాయిలో జీవించాలని భావించడం ఈ ధోరణిని మరింత పెంచుతోంది. సామాజిక మాధ్యమాల్లో కనిపించే విలాసవంతమైన జీవనశైలి కూడా దీనికి కారణమవుతోంది.

జీతం పెరిగినా పొదుపు అంతే..

ఈ అలవాటు వల్ల దీర్ఘకాలంలో సంపద సృష్టించే అవకాశాలు తగ్గిపోతాయి. జీతం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగితే పెట్టుబడులకు కేటాయించే మొత్తం మారదు. అత్యవసర నిధి ఏర్పాటు, సొంత ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పదవీ విరమణ కోసం నిధి సమకూర్చుకోవడం వంటి ఆర్థిక లక్ష్యాలు ఆలస్యమవుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలవారీ టేక్‌హోమ్ జీతం రూ.60వేల నుంచి రూ.80వేల‌కు పెరిగిందనుకుందాం. అదే సమయంలో నెలవారీ ఖర్చులు రూ.45వేల నుంచి రూ.65వేలకు పెరిగితే, అదనంగా వచ్చిన రూ.20వేలు మొత్తం ఖర్చులకే సరిపోతుంది. దీంతో జీతం పెరిగినా నెలవారీ పొదుపు మాత్రం రూ.15వేలుగానే ఉంటుంది.

నిజ‌మైన అవ‌స‌రాలు ఉంటేనే..

లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌ను నియంత్రించాలంటే జీతం పెరిగిన వెంటనే జీవనశైలిని మార్చుకోవాలనే ఆలోచనకు దూరంగా ఉండాలి. అదనంగా వచ్చిన ఆదాయంలో ఎంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులు, వ్యక్తిగత ఖర్చులకు కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. నిజమైన అవసరాలకు, కేవలం జీవనశైలి మెరుగుదల కోసం చేసే ఖర్చులకు మధ్య తేడాను గుర్తించాలి. ప్రతి కొనుగోలును పూర్తిగా నివారించాల్సిన అవసరం లేకపోయినా, నెలనెలా కొనసాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపదను నిర్మించుకోవడానికి ఎక్కువ సంపాదించడం ఒక్కటే సరిపోదు. పెరిగిన ఆదాయంలో ఎంత మొత్తాన్ని మిగిల్చి పెట్టుబడుల రూపంలో వినియోగిస్తున్నామన్నదే కీలకం. జీతంతోపాటు పొదుపు కూడా పెరిగినప్పుడే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది.

Advertisement
Advertisement