త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!

Commercial Tax | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వాణిజ్య పన్నుల ( Commercial Tax ) శాఖ భారీ ఆదాయాన్ని సమకూర్చింది. జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది.

S

Telangana | Published On Nov 9, 2026, 3.02 pm IST

Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!
Advertisement

వాణిజ్య పన్నుల శాఖ వసూళ్లలో సరికొత్త రికార్డు
గత ఏడాదితో పోలిస్తే 22.16 శాతం వృద్ధి
ఏడు నెలల్లో రూ.52,110 కోట్ల ఆదాయం

Commercial Tax | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వాణిజ్య పన్నుల ( Commercial Tax ) శాఖ భారీ ఆదాయాన్ని సమకూర్చింది. జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2026 అక్టోబర్ నెలలోనే మొత్తం రూ.7,735 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.6,332 కోట్లతో పోలిస్తే 22.16 శాతం వృద్ధి నమోదైంది.

జీఎస్టీ, వ్యాట్‌తో భారీ ఆదాయం

అక్టోబర్ నెలలో వచ్చిన మొత్తం ఆదాయంలో జీఎస్టీ ద్వారా రూ.4,590 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.3,065 కోట్లు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా రూ.80 కోట్లు సమకూరాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 17.27 శాతం, వ్యాట్ వసూళ్లు 30.87 శాతం పెరిగాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయం 5.26 శాతం వృద్ధి సాధించింది.

ఏడు నెలల్లో రూ.52,110 కోట్లు

2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రానికి జీఎస్టీ, వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో మొత్తం రూ.52,110 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.44,598 కోట్లు మాత్రమే సమకూరాయి. ఈసారి అదనంగా రూ.7,512 కోట్ల ఆదాయం రావడంతో 16.85 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడు నెలల కాలంలో జీఎస్టీ ద్వారా రూ.29,627 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.24,974 కోట్లతో పోలిస్తే 18.63 శాతం పెరుగుదల నమోదైంది. వ్యాట్ ఆదాయం రూ.19,049 కోట్ల నుంచి రూ.21,893 కోట్లకు చేరి 14.93 శాతం వృద్ధిని సాధించింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆదాయం రూ.590 కోట్లకు చేరింది.

బడ్జెట్ లక్ష్యాల దిశగా అడుగులు

2026–27 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.52,490 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ నాటికి రూ.29,627 కోట్లు వసూలయ్యాయి. అంటే వార్షిక లక్ష్యంలో 56.44 శాతం సాధించినట్లయింది. అదేవిధంగా వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ.38,106 కోట్ల వార్షిక లక్ష్యానికి గానూ ఏడు నెలల్లో రూ.21,893 కోట్లు సమకూరాయి. దీంతో 57.45 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.

మిగిలిన ఐదు నెలలూ కీలకం

వాణిజ్య పన్నుల శాఖలో నమోదవుతున్న ఆదాయ వృద్ధి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఊతమిస్తోంది. ఇదే స్థాయిలో పన్నుల వసూళ్లు కొనసాగితే 2026–27 వార్షిక బడ్జెట్ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న ఐదు నెలల వసూళ్లు ప్రభుత్వానికి కీలకం కానున్నాయి.

Advertisement
Advertisement