త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC | దంప‌తుల‌ కోసం ఎల్ఐసీ కొత్త సేవింగ్స్ ప్లాన్స్.. ఒకే పాలసీలో డబుల్ భద్రత..

LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దంప‌తుల‌ కోసం రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది. ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేర్లతో వచ్చిన ఈ పథకాలు, ఒకే పాలసీ కింద ఆర్థిక భద్రతతోపాటు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాలను అందించేందుకు అనువుగా ఉంటాయి.

S

Business | Published On Jun 2, 2026, 3.12 pm IST

LIC | దంప‌తుల‌ కోసం ఎల్ఐసీ కొత్త సేవింగ్స్ ప్లాన్స్.. ఒకే పాలసీలో డబుల్ భద్రత..
Advertisement

LIC | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దంప‌తుల‌ కోసం రెండు కొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది. ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేర్లతో వచ్చిన ఈ పథకాలు, ఒకే పాలసీ కింద ఆర్థిక భద్రతతోపాటు దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాలను అందించేందుకు అనువుగా ఉంటాయి. ఈ రెండు పథకాలు నాన్-పార్, నాన్-లింక్డ్ కేటగిరీకి చెందుతాయి. అంటే స్టాక్ మార్కెట్‌ల‌తో ఎలాంటి సంబంధం ఉండదు. పాలసీ ద్వారా లభించే రాబడులు, ప్రయోజనాలు ముందుగానే నిర్ణయం అవుతాయి.

న్యూ జీవ‌న్ సాథీ (సింగిల్ ప్రీమియం)..

ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ (సింగిల్ ప్రీమియం) పాల‌సీ ఒక వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. పాలసీ తీసుకునే సమయంలో ఒక్కసారే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. భర్త, భార్య ఇద్దరికీ ఒకే పాలసీలో జాయింట్ లైఫ్ కవర్ లభిస్తుంది. పాలసీ కాలవ్యవధి మొత్తం బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్రతి రూ.1వేయి రూ.70 చొప్పున గ్యారంటీడ్ అడిషన్ ల‌భిస్తుంది. డెత్ బెనిఫిట్ కోసం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ ప్రీమియం మొత్తానికి 1.25 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో ఏది ఎక్కువైతే అది ల‌భిస్తుంది. లేదా సింగిల్ ప్రీమియం మొత్తానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్ష‌న్ ను వినియోగ‌దారులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ సదుపాయం, మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్‌ను విడతల రూపంలో పొందే అవకాశం ఉంటుంది. అధిక సమ్ అష్యూర్డ్‌పై రిబేట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

న్యూ జీవ‌న్ సాథీ (లిమిటెడ్ ప్రీమియం)

ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ (లిమిటెడ్ ప్రీమియం) ప్లాన్‌లో పాలసీ కాలవ్యవధి మొత్తం కాకుండా కేవలం నిర్ణీత సంవత్సరాల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 5, 10 లేదా 15 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు కాలాన్ని ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే, భవిష్యత్తులో చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ అవుతాయి. ప్రతి సంవత్సరం చెల్లించే ప్రీమియంలో 7 శాతం గ్యారంటీడ్ అడిషన్ రూపంలో పాలసీకి జత చేస్తారు. ప్రీమియం చెల్లింపు కాలం, పాలసీ కాలవ్యవధిని అవసరానికి అనుగుణంగా ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఇందులోనూ డెత్ బెనిఫిట్ కోసం రెండు ఆప్షన్ల‌ను ఇస్తున్నారు. వార్షిక ప్రీమియం మొత్తానికి 7 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. లేదా సింగిల్ ప్రీమియం మొత్తానికి 10 రెట్లు ఇస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

కామ‌న్ రూల్స్ ఇవే..

ఇక ఈ రెండు ప్లాన్ల‌కు ప‌లు నిబంధ‌న‌ల‌ను కామ‌న్‌గా వ‌ర్తింప‌జేస్తున్నారు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. పాలసీ కాలవ్యవధి 10, 15, 20 లేదా 25 సంవత్సరాలుగా ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం ప్లాన్‌లో ప్రీమియం చెల్లింపు కాలం 5, 10 లేదా 15 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ వయస్సు కనీసం 28 సంవత్సరాలు కాగా, ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి గరిష్ఠంగా 60 నుంచి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్‌ను నెలవారీ (కనీసం రూ.5వేలు), త్రైమాసిక (రూ.15వేలు), అర్ధవార్షిక (రూ.25వేలు) లేదా వార్షిక (రూ.50వేలు) విడతల రూపంలో పొందే అవకాశం ఉంటుంది. స్థిరమైన, భద్రమైన రాబడులను కోరుకునే వారికి ఈ కొత్త ఎల్ఐసీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా బోనస్‌లపై ఆధారపడకుండా ముందే నిర్ణయించిన ప్రయోజనాలను అందిస్తాయి. అదనపు ప్రీమియంతో రైడర్లు, లోన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండటం వల్ల కవరేజ్‌తోపాటు లిక్విడిటీ ప్రయోజనం కూడా లభిస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement