త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ అమ్మ‌కాల ఒత్తిడిలో ఐటీ షేర్లు.. లాభాల్లోనే కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Markets | భారత‌ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ 50, బుధ‌వారం ఉదయం 9.18 గంటల సమయానికి 91.30 పాయింట్లు (0.38 శాతం) పెరిగి 24,143.35 వద్ద ట్రేడయింది.

S

Business | Published On Jul 15, 2026, 10.26 am IST

Stock Markets | భారీ అమ్మ‌కాల ఒత్తిడిలో ఐటీ షేర్లు.. లాభాల్లోనే కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | భారత‌ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ 50, బుధ‌వారం ఉదయం 9.18 గంటల సమయానికి 91.30 పాయింట్లు (0.38 శాతం) పెరిగి 24,143.35 వద్ద ట్రేడయింది. మరోవైపు సెన్సెక్స్ మంగళవారం 77,054.94 వద్ద ముగియగా, బుధవారం 77,192.76 వద్ద ప్రారంభమై 318.60 పాయింట్లు (0.41 శాతం) లాభంతో 77,373.54 వద్ద ట్రేడయింది. అయితే ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్ లాభాలు పరిమితమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్‌గా టీసీఎస్ నిలిచింది. టీసీఎస్ షేర్ రూ.50.60 (1.76 శాతం) పడిపోయి రూ.2,150 వద్ద ట్రేడైంది. ఇన్ఫోసిస్ 1.49 శాతం క్షీణించి రూ.1,076.60కు చేరగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.26 శాతం తగ్గి రూ.1,152 వద్ద ట్రేడైంది. విప్రో 1.16 శాతం పడిపోయి రూ.175.08కు చేరగా, టెక్ మహీంద్రా 1.13 శాతం క్షీణించి రూ.1,467.50 వద్ద కొనసాగింది. దీంతో ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యంత బలహీన రంగంగా ఐటీ సెక్టార్ నిలిచింది.

ఫైనాన్షియ‌ల్ షేర్ల‌కు మ‌ద్ద‌తు..

మరోవైపు లాభాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ ముందంజలో నిలిచి 1.92 శాతం పెరిగి రూ.1,033.40కు చేరింది. బజాజ్ ఫైనాన్స్ 1.68 శాతం లాభంతో రూ.1,023.50 వద్ద ట్రేడైంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 1.31 శాతం పెరిగి రూ.562.50కు చేరగా, ఇండిగో 1.02 శాతం లాభంతో రూ.5,160 వద్ద ట్రేడైంది. ఏషియన్ పెయింట్స్ 1.01 శాతం పెరిగి రూ.2,667.70కు చేరింది. దీంతో ఫైనాన్షియల్, ఏవియేషన్, కన్జ్యూమర్ రంగాల షేర్లు మార్కెట్‌కు మద్దతు అందించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనట్లు చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ గుప్తా తెలిపారు. వాల్ స్ట్రీట్, యూరప్ మార్కెట్లు బలంగా ముగియడంతోపాటు ఆసియా మార్కెట్లైన నిక్కీ, హాంగ్ సెంగ్ కూడా సానుకూల ధోరణి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ ప్రారంభానికి ముందు గిఫ్ట్ నిఫ్టీ కూడా 30 పాయింట్లు పెరిగి 24,045 వద్ద ట్రేడైంది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల పాజిటివిటీకి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.06 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 84 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.24 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 80 డాల‌ర్లకు దిగి వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లోనూ భార‌త రూపాయికి సానుకూల సంకేతాలు క‌నిపించాయి. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.04 శాతం బ‌లప‌డ్డ రూపాయి 96.15 వ‌ద్ద ఉంది. అయితే మార్కెట్‌కు కొన్ని ప్రతికూల అంశాలు ఇంకా కొనసాగుతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ద కొనసాగుతుండటం సమీప కాలంలో మార్కెట్‌ను మరింత ఎగువకు తీసుకెళ్లే అనుకూల అంశాలు కనిపించడం లేదన్నారు. అమెరికా నుంచి వస్తున్న అనిశ్చిత విధాన సంకేతాల కారణంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మరింత క్లిష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement