త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప మార్పులతో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం, ముడి చమురు ధరలు ఎగసిపడటం వల్ల ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. అయితే ఐటీ, బ్యాంకింగ్ రంగాల హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో చివరికి మార్కెట్లు నష్టాల నుంచి కోలుకుని దాదాపు స్థిరంగా ముగిశాయి.

S

Business | Published On Jul 13, 2026, 4.06 pm IST

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప మార్పులతో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం, ముడి చమురు ధరలు ఎగసిపడటం వల్ల ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. అయితే ఐటీ, బ్యాంకింగ్ రంగాల హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో చివరికి మార్కెట్లు నష్టాల నుంచి కోలుకుని దాదాపు స్థిరంగా ముగిశాయి. అమెరికా తన దాడులను మ‌రింత పెంచిన‌ తర్వాత ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతమంతా దాడులను తీవ్రతరం చేసింది. దీంతో హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన రవాణాపై ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 3 శాతం పెరిగాయి. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే చివరికి అన్ని నష్టాలను భ‌ర్తీ చేసి 47 పాయింట్లు (0.06 శాతం) స్వ‌ల్ప‌ లాభంతో 77,616.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా కేవలం 4 పాయింట్లు (0.02 శాతం) స్వ‌ల్పంగా పెరిగి 24,211 వద్ద స్థిరపడింది.

ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో..

సెన్సెక్స్‌కు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధాన మద్దతు అందించాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు సూచీపై అత్యధిక ప్రతికూల ప్రభావం చూపించాయి. విస్తృత మార్కెట్లు కూడా ప్రధాన సూచీల ధోరణినే అనుసరించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా దాదాపు మార్పులేకుండా ముగిశాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని రూ.481.75 లక్షల కోట్ల నుంచి పెరిగి రూ.482 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. నిఫ్టీ 50లోని 50 షేర్లలో 29 షేర్లు నష్టాల్లో ముగియగా, మిగిలిన షేర్లు లాభాలను నమోదు చేశాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లుగా నిలిచాయి. మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో అత్యధిక లాభాలు నమోదు చేసిన షేర్లుగా నిలిచాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, రూపాయి విలువ ప‌త‌నం..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ 3.59 శాతం ఎగిసింది. ఈ సూచీలోని అన్ని షేర్లు 1 నుంచి 5 శాతం మధ్య లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మీడియా సూచీ 2.09 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీ 1.15 శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా స్వల్ప సానుకూలత కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ 0.15 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.11 శాతం, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 0.25 శాతం పెరిగాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ రంగం ఒత్తిడిలో కొనసాగింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీ 1 శాతం పడిపోయింది. మెటల్ సూచీ కూడా 0.69 శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్ పరంగా అత్యధిక వాల్యూమ్ నమోదైన షేర్లలో పీసీ జ్యువెలర్, వొడాఫోన్ ఐడియా, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా, వేదాంత ఐరన్ అండ్ స్టీల్, మోటిసన్స్ జ్యువెలర్స్, కుపిడ్ ఉన్నాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ లో చ‌మురు ధ‌ర‌లు సోమ‌వారం ఒక్క రోజే భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 3.13 శాతం పెరిగి బ్యారెల్‌కు 78 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.99 శాతం ఎగ‌సి బ్యారెల్‌కు 74 డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.61 వ‌ద్ద ఉన్న రూపాయి ఒక్క సెష‌న్‌లోనే 25 పైస‌లు న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement