త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల దెబ్బ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, బలహీనమైన స్థూల ఆర్థిక సూచీలు, తొలి త్రైమాసిక ఫలితాలపై అనిశ్చితి వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.

S

Business | Published On Jul 14, 2026, 10.33 am IST

Stock Markets | ప‌శ్చిమ ఆసియా ఉద్రిక్తతల దెబ్బ.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, బలహీనమైన స్థూల ఆర్థిక సూచీలు, తొలి త్రైమాసిక ఫలితాలపై అనిశ్చితి వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 500కు పాయింట్ల‌కు పైగా పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 77,063ను తాకింది. నిఫ్టీ 50 కూడా 24,050 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, రియాల్టీ సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. ప‌శ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్‌పై దాడులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ వాణిజ్యంపై కొత్త దిగ్బంధాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు ముగింపు పలుకుతూ హౌతి తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి దాడులు చేశారు. తమ ఆధీనంలోని విమానాశ్రయంపై సౌదీ దాడి చేసిందని ఆరోపిస్తూ ఈ దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ముడి చమురు ధరలు భారీగా పెరగడం వ‌ల్ల కూడా మార్కెట్లు ఒత్తిడికి లోన‌య్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర రెండు శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 85 డాలర్ల సమీపానికి చేరుకుంది. భారత్ త‌న మొత్తం ముడి చమురు అవసరాల్లో సుమారు 85 నుంచి 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది. అందువల్ల చమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచడంతోపాటు ఆర్థిక లోటును కూడా మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంటుంది. దీని వ‌ల్లే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ 51 పైస‌లు త‌గ్గి 96.13 వ‌ద్ద ఉంది.

భార‌త ఆర్థిక సూచీల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 85 డాలర్లకు చేరుకుందని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే భారత ఆర్థిక సూచీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, చెల్లింపుల సమతుల్యత, రూపాయి బలహీనత వంటి అంశాలు మార్కెట్‌ల‌పై మరింత ఒత్తిడిని సృష్టిస్తాయని చెప్పారు. అలాగే ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం, వడ్డీ రేట్ల పెంపు భయాలు ముందుకు వచ్చాయి. జూన్ నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతానికి చేరి, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన నాలుగు శాతం మధ్యస్థ లక్ష్యాన్ని 2025 జనవరి తర్వాత తొలిసారి అధిగమించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతోపాటు ఆహార ధరల పెరుగుదల కూడా ఇందుకు కారణమైంది.

వ‌డ్డీ రేట్ల పెంపుపై ఆందోళ‌న‌..

మింట్ సంస్థ నిర్వహించిన సర్వేలో 18 మంది ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణం 4.2 శాతం ఉంటుందని అంచనా వేసినా, వాస్తవ గణాంకాలు వాటిని మించాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే అవకాశంపై మార్కెట్‌లో ఆందోళన పెరిగింది. ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజన్ హజ్రా మాట్లాడుతూ జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరిందని తెలిపారు. మే నెలలో ఇది 3.9 శాతంగా ఉండగా, మార్కెట్ అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువగా నమోదైందన్నారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉందని, ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల‌పై పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రధాన ద్రవ్యోల్బణం ఆర్బీఐ నాలుగు శాతం లక్ష్యాన్ని మించినప్పటికీ, కేంద్ర బ్యాంక్ నిర్దేశించిన రెండు నుంచి ఆరు శాతం సహన పరిధిలోనే ఉందని హజ్రా చెప్పారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి ఆర్బీఐ తదుపరి ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బ‌ల‌హీన ప‌డుతున్న స్థూల ఆర్థిక సూచీలు..

దేశ స్థూల ఆర్థిక సూచీలు బలహీనపడటం కూడా మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మైంది. జూన్ నెలలో భారత వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ట స్థాయి 30.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐసీఆర్ఏ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ ప్రకారం 2025 జూన్‌లో 19.1 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, 2026 జూన్‌లో 30.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. కమోడిటీ ధరల పెరుగుదలతో దిగుమతులు ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరిగాయని, అదే సమయంలో ఎగుమతులు 15.5 శాతం పెరిగినా దిగుమతుల వృద్ధికి చాలా వెనుకబడ్డాయని ఆమె వివరించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, చమురు ధరల ప్రభావం దృష్ట్యా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ అకౌంట్ లోటు స్థూల దేశీయోత్పత్తిలో కనీసం ఒక శాతానికి చేరే అవకాశం ఉందని ఐసీఆర్ఏ అంచనా వేసింది.

మూడో త్రైమాసికంలోనే..

కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, యాజమాన్యాల భవిష్యత్ అంచనాలపై పెట్టుబడిదారుల దృష్టి నిలిచింది. ప్రస్తుత మాక్రో ఆర్థిక పరిస్థితులు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావంపై కంపెనీలు ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ప‌శ్చిమ ఆసియా ఘర్షణలతో చమురు ధరలు పెరగడం కంపెనీల లాభాల వృద్ధి అంచనాలపై కూడా ప్రభావం చూపుతోంది. కొందరు మార్కెట్ నిపుణులు కార్పొరేట్ ఆదాయాలు పుంజుకోవడం 2026-27 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement