త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?

Indian Railways | పండుగల సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల కోసం 102 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రధానంగా సోలాపూర్ డివిజన్‌ మీదుగా నడిచే ఈ ప్రత్యేక రైళ్లతో ముంబై, చెన్నై, లాతూర్, కొల్హాపూర్, కలబురగి తదితర ముఖ్య నగరాలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

S

Business | Published On Sep 26, 2026, 1.39 pm IST

Indian Railways | దసరా, దీపావళికి 102 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్ ఎప్పుడు అంటే?
Advertisement

Indian Railways | పండుగల సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల కోసం 102 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రధానంగా సోలాపూర్ డివిజన్‌ మీదుగా నడిచే ఈ ప్రత్యేక రైళ్లతో ముంబై, చెన్నై, లాతూర్, కొల్హాపూర్, కలబురగి తదితర ముఖ్య నగరాలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. పండుగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై-చెన్నై బీచ్ వీక్లీ ప్రత్యేక రైలును ఆరు ట్రిప్పులు నడపనుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై బీచ్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై ప్రత్యేక రైలు కూడా ఆరు ట్రిప్పులు నడుస్తుంది. ఈ రైలు ప్రతి గురువారం ఉదయం 4 గంటలకు చెన్నై బీచ్ నుంచి బయలుదేరుతుంది. ఈ సేవ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ముంబై చేరుకుంటుంది. దాదర్, థానే, పుణే, సోలాపూర్, కలబురగి, గుంతకల్, రేణిగుంట, పెరంబూర్ తదితర స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ ఉంటుంది.

ముంబై-లాతూర్ ప్రత్యేక రైళ్లు..

ప్రాంతీయ ప్రయాణికుల కోసం ముంబై-లాతూర్ మధ్య వారానికి రెండు రోజుల చొప్పున ప్రత్యేక రైలు నడపనున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై-లాతూర్ ప్రత్యేక రైలు ప్రతి దిశలో 13 ట్రిప్పులు పూర్తి చేయనుంది. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు మంగళ, గురువారాల్లో అర్ధరాత్రి 12:35 గంటలకు ముంబై నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 11:40 గంటలకు లాతూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో లాతూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై ప్రత్యేక రైలు అదే రోజుల్లో సాయంత్రం 4:30 గంటలకు లాతూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:10 గంటలకు ముంబై చేరుకుంటుంది. కల్యాణ్, లోనావాలా, పూణె, దౌండ్, కుర్దువాడి, ధారాశివ్ తదితర స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ ఉంటుంది.

కొల్హాపూర్-కలబురగి ప్రత్యేక రైళ్లు..

కొల్హాపూర్-కలబురగి మధ్య దాదాపు ప్రతిరోజూ ప్రత్యేక రైలు సేవలను కూడా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. శుక్రవారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు నడుస్తుంది. మొత్తం 64 ట్రిప్పులు, ఇరువైపులా 32 చొప్పున ట్రిప్పులు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు ఉదయం 6:10 గంటలకు కొల్హాపూర్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరి సాయంత్రం 4:10 గంటలకు కలబురగి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కలబురగి నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు కొల్హాపూర్ చేరుకుంటుంది. మిరాజ్ జంక్షన్, సంగోలా, పంఢర్‌పూర్, కుర్దువాడి, సోలాపూర్ తదితర స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ ఉంటుంది.

టికెట్ల బుకింగ్ ఎప్పటి నుంచి?

ఈ పండుగ ప్రత్యేక రైళ్లకు సెప్టెంబర్ 27 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ప్రయాణికులు అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, కంప్యూటరైజ్డ్ రైల్వే రిజర్వేషన్ కేంద్రాలు, రైల్‌వన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు వర్తించనున్నాయి. ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. చెల్లుబాటు అయ్యే టికెట్‌తోనే ప్రయాణించాలని కోరారు. రైళ్ల హాల్ట్‌లు, సమయాల్లో తాజా మార్పులు, ఇతర వివరాల కోసం ప్రయాణానికి ముందు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్ లేదా రైల్‌వన్ అప్లికేషన్‌లో వివరాలు పరిశీలించాలని సూచించారు.

Advertisement
Advertisement