Govindaraja Swamy Temple | తిరుమల శ్రీవారి అన్న ఎవరో తెలుసా..? గోవిందరాజస్వామి ఆలయ విశిష్టత ఇదే..!
Govindaraja Swamy Temple | తిరుపతిలోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ఒకటైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు మొదలై జూన్ ఒకటి వరకు వైభవోపేతంగా కొనసాగనున్నాయి. ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Devotional | Published On May 22, 2026, 12.32 pm IST
Govindaraja Swamy Temple | తిరుపతిలోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ఒకటైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు మొదలై జూన్ ఒకటి వరకు వైభవోపేతంగా కొనసాగనున్నాయి. ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణం, వాహన సేవలు, ప్రత్యేక పూజలు, చక్రస్నానం వంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ చరిత్ర, విశిష్టత ఏంటో తెలుసుకుందాం..!
వెంకన్నకు అన్నగా..

తిరుపతిలో కొలువై ఉన్న గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ గోవిందరాజస్వామి శయనమూర్తిగా దర్శనమిస్తాడు. స్వామివారిని తిరుమల వేంకటేశ్వరస్వామి అన్నగా భక్తుల విశ్వాసం. ఎత్తైన గోపురాలు, విశాలమైన మండపాలు, అద్భుతమైన శిల్పకళ, విస్తారమైన ప్రాంగణంతో ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతాయి. చోళరాజ్యంలో 12వ శతాబ్దంలో పాలించిన కుళోత్తుంగ చోళుడు శైవమతాన్ని ప్రోత్సహించాడని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించాడని చెబుతారు. దీంతో వైష్ణవ భక్తులు ఆ విగ్రహాన్ని రక్షించి తిరుపతి సమీపంలోని కొత్తూరు గ్రామంలో దాచిపెట్టారు. తర్వాత తిరుపతికి వచ్చిన రామానుజాచార్యులు ఈ విషయం తెలుసుకుని గోవిందరాజస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి అప్పటికే ఉన్న పార్థసారథి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. అలాగే ఆ ప్రాంతానికి ‘గోవిందరాజ పట్టణం’ అనే పేరు కూడా రామానుజాచార్యులే పెట్టారని స్థానికులు చెబుతారు.
శయనముద్ర వెనుక కథ..

గోవిందరాజస్వామి శయనముద్ర వెనుక ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని శ్రీనివాసుడికి వివాహం చేయడానికి ఒప్పుకున్నప్పుడు, వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడని చెబుతారు. ఆ అప్పుకు శివుడు, బ్రహ్మ సాక్షులుగా ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో భక్తులు సమర్పించే ధనాన్ని కుబేరుడికి వడ్డీగా చెల్లించే బాధ్యతను గోవిందరాజస్వామి తీసుకున్నాడని కథనం. డబ్బు కొలుస్తూ అలసిపోయిన గోవిందరాజస్వామి శేరును తలకింద పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలోనే శయనముద్రలో దర్శనమిస్తున్నారని ఆలయ అర్చకులు భక్తులకు వివరిస్తుంటారు. చారిత్రక ఆధారాలు కూడా ఆలయ వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ఆలయ గోడలపై, ప్రాంగణంలో కనిపించే అనేక శాసనాలు ఆలయ చరిత్రను వివరిస్తున్నాయి. మొదట ఇక్కడ పార్థసారథి స్వామి ఆలయం మాత్రమే ఉండేదని, తర్వాత 11వ–12వ శతాబ్దాల మధ్య గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం సామాన్య శకం 1130 ప్రాంతంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. విజయనగర రాజుల కాలంలో ఆలయంలో అనేక మండపాలు, ఉపాలయాలు నిర్మించారు.
తిరుపతికే ప్రత్యేక ఆకర్షణగా..

తూర్పు వైపున ఉన్న ఆలయ ప్రధాన ద్వారంపై ఏడు అంతస్తులతో నిర్మించిన రాజగోపురం తిరుపతి నగరానికే ప్రత్యేకంగా నిలుస్తోంది. గోపురం పైభాగంలో ఉన్న పదకొండు కలశాలు ఆలయ వైభవాన్ని చాటుతున్నాయి. మొదటి గోపురాన్ని దాటి లోపలికి వెళ్తే ఉత్తర, దక్షిణ మాడవీధుల నుంచి ఆలయంలోకి ప్రవేశించే మార్గాలు కనిపిస్తాయి. ఎదురుగా రెండో గోపురం దర్శనమిస్తుంది. మొదటి, రెండో గోపురాల మధ్య కోదండరామస్వామి, రంగనాథస్వామి, రామానుజాచార్యులు, లక్ష్మీదేవి, అళ్వారుల ఆలయాలు ఉన్నాయి. రెండో గోపురం వద్ద నాలుగు స్తంభాల మండపం, దాని కింద నీటి కొలను ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. మూడు అంతస్తులతో నిర్మించిన రెండో గోపురంపై తొమ్మిది కలశాలు ఉన్నాయి. ఈ గోపురాన్ని దాటగానే విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. అక్కడి నుంచి మూడో గోపురం వరకు ఇరువైపులా అనేక ఉపాలయాలు, మండపాలు దర్శనమిస్తాయి. మూడో గోపురాన్ని దాటి లోపలికి వెళ్తే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ప్రధాన గర్భగుడికి ఎదురుగా పార్థసారథి స్వామి కొలువై ఉండటం ప్రత్యేకత. గోవిందరాజస్వామి, పార్థసారథి ఆలయాలు ఒకే రంగమండపాన్ని పంచుకుంటాయి. రంగమండపంలో గర్భగుడికి ఎదురుగా గరుడాళ్వారు కొలువై ఉంటారు.
పద్మం నుంచి బ్రహ్మదేవుడు..

ప్రధాన గర్భాలయంలో గోవిందరాజస్వామి శయనముద్రలో దర్శనమిస్తుండగా, పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కొలువై ఉంటారు. మధు, కైటభ రాక్షసుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి నాభి నుంచి వెలువడిన పద్మంపై బ్రహ్మదేవుడు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. గోవిందరాజస్వామి ఆలయానికి కుడివైపున ఉన్న పార్థసారథి ఆలయంలో రుక్మిణీ, సత్యభామ సమేతంగా పార్థసారథి స్వామి ఆసీనముద్రలో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా.. ఆలయం తిరుపతి రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు దగ్గరలోనే ఉండడంతో నిత్యం వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నెల 23 నుంచి వార్షిక ఉత్సవాలు మొదలుకానుండడంతో ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!





