త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India US Trade Deal | డిసెంబర్‌లో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం? ఇక టెన్ష‌న్ ముగిసిన‌ట్లే..?

India US Trade Deal | భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మధ్య సుంకాల ఉద్రిక్తతలకు ముగింపు పలికే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ అభివృద్ధి లక్ష్యమైన వికసిత్‌ భారత్‌ 2047 సాధనకు ఐదు ప్రధాన సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

S

Business | Published On Nov 19, 2026, 3.12 pm IST

India US Trade Deal | డిసెంబర్‌లో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం? ఇక టెన్ష‌న్ ముగిసిన‌ట్లే..?
Advertisement

India US Trade Deal | భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరు దేశాల మధ్య సుంకాల ఉద్రిక్తతలకు ముగింపు పలికే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ అభివృద్ధి లక్ష్యమైన వికసిత్‌ భారత్‌ 2047 సాధనకు ఐదు ప్రధాన సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.

త‌గ్గుముఖం ప‌డుతున్న సుంకాల వివాదాలు: నాగేశ్వ‌ర‌న్

భారత్‌, అమెరికా మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య, సుంకాల వివాదాలు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. గత కొన్ని వారాలుగా ఇరు దేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని, డిసెంబర్ మొదట్లో లేదా ఆ సమయానికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని గురువారం వెల్లడించారు. ముంబైలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్వహించిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజెస్ 65వ జనరల్ అసెంబ్లీ, వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2025 జనవరి నుంచి అమెరికాతో భారత్‌ సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని, పరస్పర సుంకాలు, రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోళ్లపై అదనపు సుంకాలు, భారతీయ ప్రవాసులు, సేవల ఎగుమతులపై ప్రభావం వంటి అంశాలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయని వివరించారు.

భారీగా పెరుగుతున్న విదేశీ పెట్టుబ‌డులు..

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక వడ్డీ రేట్లు, కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడుల వైపు విదేశీ మూలధనం మళ్లడం భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఉన్నాయని నాగేశ్వరన్ పేర్కొన్నారు. అయితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు తగ్గడం, కృత్రిమ మేధ సంస్థల అధిక విలువలపై ఆందోళనలు పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్ల వైపు వస్తున్నారని తెలిపారు. నవంబర్‌లో తొలి 18 రోజుల్లోనే భారత్‌కు 11.3 బిలియన్ డాలర్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. కృత్రిమ మేధ సంబంధిత పెట్టుబడుల కారణంగా రూపాయిపై ఏర్పడుతున్న ఒత్తిడి భవిష్యత్తులో రూపాయికి బలంగా మారే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

ఏయే స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి..?

దేశం వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి భౌగోళిక రాజకీయ విభజనలు, సముద్ర రవాణా మార్గాల్లో అంతరాయాలు, చైనా తయారీ రంగ సామర్థ్యం, వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలకు ఎదురయ్యే ముప్పు వంటి అంశాలను ప్రధాన సవాళ్లుగా గుర్తించారు. వీటిని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం, నైపుణ్య ఆధారిత వృత్తులు, మానవ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, వృద్ధుల జనాభా అధికంగా ఉన్న దేశాలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కరోనా అనంతరం గత ఆరేళ్లుగా భారత్‌ సుమారు 7 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని కొనసాగించిందని, రోజుకు 4.20 డాలర్ల ఆదాయ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న దాదాపు 50 కోట్ల మంది ఆ పరిమితిని అధిగమించారని వివరించారు.

వాణిజ్య ఒప్పందం కుదిరేనా..?

కాగా భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర ఒప్పంద ప్రతిపాదన ప్రకారం భారత వస్తువులపై అమెరికా సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాల్సి ఉంది. అయితే అదే నెలలో అమెరికా సుప్రీంకోర్టు అత్యవసర పరస్పర సుంకాలను రద్దు చేయడంతో, వాటి స్థానంలో కొత్త సుంకాల విధానాన్ని రూపొందించే దిశగా అమెరికా చర్యలు చేపట్టింది. బలవంతపు కార్మిక విధానాలు, పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంలో అధిక మిగులు వంటి అంశాలపై సెక్షన్ 301 కింద కొత్త దర్యాప్తులను కూడా ప్రారంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డిసెంబర్‌లో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement