త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LTCG Taxes | ఆస్తుల అమ్మ‌కం లాభాల‌పై భారీగా ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తుందా..? ఇలా చేయండి..!

LTCG Taxes | ఇల్లు, స్థలం లేదా వ్యవసాయ భూమిని విక్రయించడం వల్ల ఒకవైపు భారీ ఆర్థిక లాభాలు దక్కే అవకాశం ఉన్నప్పటికీ, మరోవైపు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (మూలధన లాభ పన్ను) భారం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రయోజనాలు కేవలం ఇళ్ల యజమానులకే కాకుండా రైతులు, పారిశ్రామిక యూనిట్లు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా అందుబాటులో ఉన్నాయి.

S

Business | Published On Jan 25, 2026, 7.58 am IST

LTCG Taxes | ఆస్తుల అమ్మ‌కం లాభాల‌పై భారీగా ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తుందా..? ఇలా చేయండి..!
Advertisement

LTCG Taxes | ఇల్లు, స్థలం లేదా వ్యవసాయ భూమిని విక్రయించడం వల్ల ఒకవైపు భారీ ఆర్థిక లాభాలు దక్కే అవకాశం ఉన్నప్పటికీ, మరోవైపు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (మూలధన లాభ పన్ను) భారం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చట్టం, 1961లో ఉన్న పలు నిబంధనలు ఈ పన్నును తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా మినహాయింపు పొందడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రయోజనాలు కేవలం ఇళ్ల యజమానులకే కాకుండా రైతులు, పారిశ్రామిక యూనిట్లు, స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఆస్తి విక్రయంపై పన్ను విధింపు, హోల్డింగ్ పీరియడ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఒక నివాస గృహాన్ని 24 నెలలకు మించి ఉంచి విక్రయిస్తే, దానిపై వచ్చే లాభాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా పరిగణిస్తారు. జూలై 23, 2024కు ముందు కొనుగోలు చేసిన ఇళ్ల విషయంలో, ఇండెక్సేషన్ లేకుండా లెక్కిస్తే 12.5 శాతం, ఇండెక్సేషన్‌తో లెక్కిస్తే 20 శాతం పన్ను విధిస్తారు.

సీనియ‌ర్ సిటిజెన్లు అయితే..

ఈ పన్ను రేటు వ్యక్తి ఆదాయ స్లాబ్‌కు సంబంధం లేకుండా వర్తిస్తుంది. ఇతర ఆదాయం తక్కువగా ఉన్నవారు ప్రాథమిక మినహాయింపు పరిమితిని సర్దుబాటు చేసుకోవచ్చు కానీ 80C, 80D వంటి డిడక్షన్లు మాత్రం LTCGపై వర్తించవు. అదే ఇంటిని 24 నెలల్లోపు విక్రయిస్తే, వచ్చే లాభాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG)గా పరిగణించి, వ్యక్తి ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను వసూలు చేస్తారు. ఈ సందర్భంలో ప్రత్యేకమైన పన్ను ఆదా ప్రయోజనాలు లభించవు. పన్ను మినహాయింపు పరిమితుల విషయానికి వస్తే, 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు కాగా, 80 ఏళ్లు దాటిన వారికి మొత్తం ఆదాయం రూ.5 లక్షలు మించనట్లయితే పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలుగా నిర్ణయించారు.

ఇలా చేస్తే ఉప‌శ‌మ‌నం..

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆదాయపు పన్ను చట్టంలో పలు సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 54 ప్రకారం నివాస గృహాన్ని విక్రయించి వచ్చిన మొత్తాన్ని మరో నివాస గృహంలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 54F కింద స్థలం, బంగారం, షేర్లు వంటి ఇతర దీర్ఘకాలిక ఆస్తులను విక్రయించి వచ్చిన లాభాన్ని నివాస గృహంలో పెట్టుబడి పెడితే పన్ను రాయితీ పొందవచ్చు. రైతుల కోసం సెక్షన్ 54B ప్రత్యేకంగా ఉంది. వ్యవసాయ భూమిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని మరో వ్యవసాయ భూమి కొనుగోలుకు వినియోగిస్తే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. పారిశ్రామిక యూనిట్ల భూమి లేదా భవనం ప్రభుత్వ బలవంతపు స్వాధీనానికి గురైతే, సెక్షన్ 54D కింద లభించిన పరిహారాన్ని యూనిట్‌ను మళ్లీ స్థాపించడానికి లేదా ఇతర ప్రాంతానికి మార్చడానికి వినియోగిస్తే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప‌రిశ్ర‌మ‌లు అయితే..

ఇక సెక్షన్ 54EC ప్రకారం భూమి లేదా భవనం విక్రయ లాభాన్ని ఆరు నెలల్లోపు NHAI, REC వంటి ప్రభుత్వ మద్దతున్న బాండ్లలో పెట్టుబడి పెడితే పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 54EE కింద ప్రభుత్వ అనుమతితో ఉన్న ప్రత్యేక నిధుల్లో గరిష్టంగా రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది. పరిశ్రమలను నగరాల నుంచి గ్రామీణ లేదా పట్టణేతర ప్రాంతాలకు తరలించే వారికి సెక్షన్ 54G, ప్రత్యేక ఆర్థిక మండలాలకు (SEZ) మారే యూనిట్లకు సెక్షన్ 54GA కింద పన్ను రాయితీలు ఉన్నాయి. అంతేకాకుండా సెక్షన్ 54GB ప్రకారం వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్‌లు ఆస్తి విక్రయంతో వచ్చిన మొత్తాన్ని అర్హత కలిగిన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, సరైన ప్రణాళికతో పెట్టుబడులు చేస్తే ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడం లేదా పూర్తిగా తప్పించుకోవడం సాధ్యమేన‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement