త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajesh Exports | రూ.15 లక్షల కోట్ల మిస్టరీ.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆదాయం ప‌జిల్‌.. సెబీ ద‌ర్యాప్తుతో గుట్టు ర‌ట్టు..

Rajesh Exports | భారత కార్పొరేట్ చరిత్రలో 2009లో జరిగిన స‌త్యం స్కామ్ తర్వాత అత్యంత పెద్ద అకౌంటింగ్ వివాదంగా మారే అవకాశం ఉన్న కేసులో బెంగళూరుకు చెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా నిలిచింది. 2024 మార్చిలో ఒక షేర్‌హోల్డర్ పంపిన ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ఇప్పుడు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) దర్యాప్తుతో భారీ చర్చకు దారి తీసింది.

S

Business | Published On Jun 5, 2026, 1.15 pm IST

Rajesh Exports | రూ.15 లక్షల కోట్ల మిస్టరీ.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆదాయం ప‌జిల్‌.. సెబీ ద‌ర్యాప్తుతో గుట్టు ర‌ట్టు..
Advertisement

Rajesh Exports | భారత కార్పొరేట్ చరిత్రలో 2009లో జరిగిన స‌త్యం స్కామ్ తర్వాత అత్యంత పెద్ద అకౌంటింగ్ వివాదంగా మారే అవకాశం ఉన్న కేసులో బెంగళూరుకు చెందిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా నిలిచింది. 2024 మార్చిలో ఒక షేర్‌హోల్డర్ పంపిన ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ఇప్పుడు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) దర్యాప్తుతో భారీ చర్చకు దారి తీసింది. సెబీ మధ్యంతర ఉత్తర్వు ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు కంపెనీ విదేశీ అనుబంధ సంస్థలు, స్టెప్-డౌన్ సబ్సిడరీల ద్వారా సుమారు రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తప్పుగా చూపించింద‌ని అనుమానం వ్యక్తమైంది. ఈ మొత్తం పరిమాణం ఎంతో భారీగా ఉన్నప్పటికీ, అసలు ప్రశ్న మాత్రం వేరే ఉంది. ఇది డబ్బు మాయం అయిన కేసు కాదని,  కంపెనీ రూ.15 లక్షల కోట్లను దారి మళ్లించిందని, సెబీ ఆరోపిస్తుంద‌ని స్పష్టమైంది. కానీ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ప్రకటించిన ఆదాయ గణాంకాలను నిజంగా ధ్రువీకరించగలమా అనే కీలక ప్రశ్నను సెబీ లేవనెత్తుతోంది.

గ‌తేడాదిలోనే రూ.4 ల‌క్ష‌ల కోట్లకు పైగా..

చాలా కాలంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ భారత కార్పొరేట్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కంపెనీ టర్నోవర్ ఆధారంగా దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే కంపెనీ సమీకృత ఆదాయం రూ.4.23 లక్షల కోట్లకు పైగా నమోదైంది. సెబీ పరిశీలిస్తున్న ఐదేళ్ల కాలంలో మొత్తం సమీకృత ఆదాయం దాదాపు రూ.15.45 లక్షల కోట్లకు చేరింది. అయితే ఇంత భారీ ఆదాయ గణాంకాలు ఉన్నప్పటికీ, కంపెనీ మార్కెట్ విలువ మాత్రం ఆ స్థాయిలో కనిపించేది కాదు. దీనికి కారణంగా బంగారం శుద్ధి, బులియన్ ట్రేడింగ్ వ్యాపారాలు సాధారణంగా తక్కువ లాభ మార్జిన్లతో నడుస్తాయని పెట్టుబడిదారులు భావించారు. భారీ వ్యాపార పరిమాణం ఉన్నా లాభాలు పరిమితంగా ఉండటం అసాధారణంగా అనిపించలేదు. కానీ సెబీ దర్యాప్తు మరో కోణాన్ని బయటపెట్టింది.

విదేశీ సంస్థ‌ల నుంచే ఆదాయం..

2021 నుంచి 2025 మధ్య కంపెనీ ప్రకటించిన ఆదాయంలో దాదాపు మొత్తం విదేశీ అనుబంధ సంస్థల నుంచే వచ్చిందని గుర్తించింది. కొన్ని సంవత్సరాల్లో ఈ విదేశీ సంస్థలే మొత్తం సమీకృత ఆదాయంలో 98 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో పెట్టుబడి పెట్టినవారు వాస్తవానికి బెంగళూరులోని జ్యువెలరీ కంపెనీని కాకుండా, వేల కిలోమీటర్ల దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ వ్యాపారాలను అంచనా వేస్తున్నట్లయిందని సెబీ అభిప్రాయపడింది. దర్యాప్తు సమయంలో కస్టమర్ వారీ విక్రయ వివరాలు, సరఫరాదారుల సమాచారం, కొనుగోలు రికార్డులు, ఇన్వాయిస్‌లు, ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని సెబీ పలుమార్లు కోరింది. అయితే మధ్యంతర ఉత్తర్వు ప్రకారం, ఈ సమాచారంలో చాలా భాగం పూర్తిగా అందుబాటులోకి రాలేదని లేదా అసంపూర్ణంగా ఉన్నట్లు పేర్కొంది.

అవ‌స‌ర‌మైన ప‌త్రాలు లేవు..

సెబీ నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. అకౌంటింగ్ వ్యవస్థలకు పూర్తి ప్రాప్యత లభించలేదని, ముఖ్యమైన రికార్డులు అందుబాటులో లేవని, కస్టమర్లు, సరఫరాదారుల సమాచారం తగినంతగా ఇవ్వలేదని పేర్కొంది. అనేక లావాదేవీలను స్వతంత్రంగా ధ్రువీకరించడానికి అవసరమైన పత్రాలు లేకపోవడంతో పరిశీలన క్లిష్టంగా మారిందని తెలిపింది. దర్యాప్తు మరింత లోతుగా సాగడంతో దృష్టి స్విట్జర్లాండ్ వైపు మళ్లింది. కంపెనీ అంతర్జాతీయ నిర్మాణంలో కీలకమైన సంస్థగా వ‌ల్కంబి ఎస్ఏ నిలిచింది. ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన విలువైన లోహాల రిఫైనరీలలో ఇది ఒకటి. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తెలిపిన ప్రకారం వ‌ల్కంబి గ్రూప్‌లో ప్రధాన ఆపరేటింగ్ సంస్థ కాగా, గ్లోబ‌ల్ గోల్డ్ రిఫైన‌రీస్ ఏజీ (జీజీఆర్) వంటి ఇతర సంస్థలు ప్రధానంగా హోల్డింగ్ కంపెనీలుగా మాత్రమే ఉన్నాయని పేర్కొంది. అయితే సెబీ ఈ సంస్థల ఆర్థిక నివేదికలను పోల్చినప్పుడు గణాంకాల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయని తెలిపింది. వ‌ల్కంబి స్వతంత్ర ఆడిటెడ్ ఖాతాల్లో ఆదాయం కొన్ని వందల కోట్ల రూపాయల స్థాయిలో మాత్రమే ఉండగా, జీజీఆర్ సమీకృత ఖాతాల్లో అది లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరిందని గుర్తించింది.

వంద‌ల కోట్ల ఆదాయం ల‌క్ష‌ల కోట్ల‌కు ఎలా చేరింది..

2023 క్యాలెండర్ సంవత్సరంలో వ‌ల్కంబి స్వతంత్ర ఆదాయం సుమారు రూ.543 కోట్లుగా నమోదవగా, అదే సమయంలో జీజీఆర్ సమీకృత ఆదాయాన్ని దాదాపు రూ.2.93 లక్షల కోట్లుగా చూపించారు. మరోవైపు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2024 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.81 లక్షల కోట్ల సమీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఇక్కడే సెబీ ప్రధాన ప్రశ్నను లేవనెత్తింది. ప్రధాన కార్యకలాపాల సంస్థగా వ‌ల్కంబి ఉంటే, కొన్ని వందల కోట్ల ఆదాయం కార్పొరేట్ నిర్మాణంలో పైస్థాయికి చేరే సరికి లక్షల కోట్ల ఆదాయంగా ఎలా మారింది? అని సెబీ సందేహం వ్య‌క్తం చేసింది. దీనికి కంపెనీ అకౌంటింగ్ విధానాల ఆధారంగా వివరణ ఇచ్చింది. వ‌ల్కంబి స్వతంత్ర ఖాతాల్లో కేవలం రిఫైనింగ్ సేవలకు సంబంధించిన ప్రాసెసింగ్ ఛార్జీలు, విలువ జోడింపును మాత్రమే ఆదాయంగా నమోదు చేశామని, సమీకృత ఖాతాల్లో మాత్రం బంగారం లావాదేవీల మొత్తం విలువతోపాటు ప్రాసెసింగ్ ఆదాయాన్ని కూడా చూపించామని పేర్కొంది.

బంగారాన్ని కొన్నారా, ప్రాసెస్ మాత్ర‌మే చేశారా..?

ఉదాహరణకు, రూ.1వేయి కోట్ల విలువైన బంగారాన్ని ఒక రిఫైనరీ ప్రాసెస్ చేస్తే, సేవా రుసుము మాత్రమే ఆదాయంగా చూపవచ్చు. కానీ ఆ బంగారంపై యాజమాన్యం, రిస్క్ తనదే అయితే మొత్తం రూ.1వేయి కోట్ల విలువనే ఆదాయంగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఈ తేడా చిన్న ఆదాయాన్ని వేల కోట్లుగా మారుస్తుంది. అయితే సెబీ అభ్యంతరం ఈ వివరణపై మాత్రమే కాదు. ఆ వివరణకు మద్దతు ఇచ్చే రికార్డులు తగినంతగా అందుబాటులో లేకపోవడంపైనా ఉంది. బంగారం యాజమాన్యం, కస్టమర్ సంబంధాలు, ఇన్వెంటరీ రిస్క్, లావాదేవీ ట్రయిల్స్ వంటి అంశాలకు సంబంధించిన ఆధారాల‌ను సరిపడా సమర్పించలేదని సెబీ పేర్కొంది. దీని ఆధారంగానే 2021-2025 మధ్య విదేశీ సంస్థలకు ఆపాదించిన సుమారు రూ.15.15 లక్షల కోట్ల ఆదాయం తప్పుగా చూపి ఉంటార‌ని సెబీ తన మధ్యంతర అభిప్రాయాన్ని వెల్లడించింది.

పెట్టుబ‌డిదారుల‌కు కొర‌వ‌డిన అవ‌గాహ‌న‌..

ఈ వివాదం కేవలం అకౌంటింగ్ అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. విదేశీ అనుబంధ సంస్థలే దాదాపు మొత్తం ఆదాయాన్ని సృష్టిస్తున్నప్పటికీ, వాటి ఆర్థిక వివరాలపై పెట్టుబడిదారులకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని సెబీ పేర్కొంది. కొన్ని సబ్సిడరీల ఆర్థిక నివేదికలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం లేదా పూర్తిగా వెల్లడించకపోవడం కూడా సెబీ దృష్టికి వ‌చ్చింది. దీంతో పెట్టుబడిదారులు తుది సమీకృత గణాంకాలను మాత్రమే చూడగలిగారు కానీ ఆ ఆదాయాన్ని సృష్టిస్తున్న అసలు వ్యాపారాలపై లోతైన అవగాహన పొందే అవకాశం లేకపోయిందని సెబీ అభిప్రాయపడింది. ఇది ఒక్క రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, అనేక దేశాలు, చట్టాలు, అకౌంటింగ్ వ్యవస్థలను కలిగి ఉన్న కార్పొరేట్ నిర్మాణాలను పర్యవేక్షించడం నియంత్రణ సంస్థలకు సవాలుగా మారుతోంది.

అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్‌..

ప్రస్తుతం సెబీ చేసినవి మధ్యంతర పరిశీలనలే. కంపెనీకి తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. తుది నిర్ణయాలు తదుపరి విచారణల తర్వాతే వెలువడతాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పేరు భారీ ఆదాయ గణాంకాల కారణంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ ఆదాయం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఆధారాలు ఏమిటి అన్న ప్రశ్నలే కేంద్రబిందువుగా మారాయి. సెబీ కోరుతున్న సమాధానాలు లభించే వరకు భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్‌ల‌లో ఇది తొలి స్థానంలో నిలుస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement