త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియ‌మం ఏమిటి..?

SIP | సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) ద్వారా దీర్ఘకాలంలో సంపదను నిర్మించుకోవచ్చు. కాంపౌండింగ్‌ ప్రభావం, రూపాయి వ్యయ సగటు విధానం ద్వారా మార్కెట్‌ను టైమింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన SIPలు కూడా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టిస్తాయి.

S

Business | Published On Oct 6, 2026, 1.19 pm IST

SIP | వేతనంలో ఎస్ఐపీ కోసం ఎంత శాతం కేటాయించాలి.. 50-30-20 నియ‌మం ఏమిటి..?
Advertisement

SIP | సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) ద్వారా దీర్ఘకాలంలో సంపదను నిర్మించుకోవచ్చు. కాంపౌండింగ్‌ ప్రభావం, రూపాయి వ్యయ సగటు విధానం ద్వారా మార్కెట్‌ను టైమింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన SIPలు కూడా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టిస్తాయి. అయితే ఉద్యోగులకు తమ జీతంలో ఎంత మొత్తాన్ని SIPలో పెట్టుబడి పెట్టాలనే విషయంలో స్పష్టత ఉండ‌దు. SIP కోసం అందరికీ వర్తించే ఒకే శాతం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ, పెట్టుబడుల కేటాయింపులో కొన్ని ప్రాథమిక విధానాలను పెట్టుబడిదారులు చాలా కాలంగా అనుసరిస్తున్నారు. చాలా మంది నెలవారీ బడ్జెట్‌ కోసం 50-30-20 నియమాన్ని అనుసరిస్తుంటారు. ఇందులో జీతంలో 50 శాతం అవసరాలకు, 30 శాతం వినోదాలకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయిస్తారు. ఈ లెక్కన నెలకు రూ.40వేలు చేతికి వచ్చే వ్యక్తి సుమారు రూ.8వేల‌ను పొదుపు, పెట్టుబడులకు కేటాయించవచ్చు.

ఎంత కేటాయించాలి..

రూ.8వేల‌లో ఎంత మొత్తాన్ని SIPకి, ఎంత మొత్తాన్ని అత్యవసర నిధికి కేటాయించాలనేది వ్యక్తి రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించడం కూడా చాలా ముఖ్యం. నెలకు రూ.8వేలు పొదుపు చేయగలిగితే, కన్జర్వేటివ్‌ విధానంలో రూ.2వేలు అంటే 25 శాతం SIPకి, రూ.6వేలు అంటే 75 శాతం అత్యవసర నిధికి కేటాయించవచ్చు. బ్యాలెన్స్‌డ్‌ విధానంలో రూ.4వేలు అంటే 50 శాతం SIPకి, మరో రూ.4వేలు అంటే 50 శాతం అత్యవసర నిధికి కేటాయించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోకస్డ్‌ విధానాన్ని ఎంచుకునేవారు రూ.6వేలు అంటే 75 శాతం SIPకి, రూ.2వేలు అంటే 25 శాతం అత్యవసర నిధికి కేటాయించవచ్చు. అయితే ఇవి కేవలం ఉదాహరణకు ఇచ్చిన కేటాయింపులు మాత్రమే. కెరీర్‌ ప్రారంభ దశలో జీతం తక్కువగా ఉండడం, జీవన వ్యయాలు, ఇతర ఖర్చులు వంటి కారణాలతో ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో కనీసం జీతంలో 10 నుంచి 15 శాతాన్ని పెట్టుబడుల కోసం పొదుపు చేయడానికి ప్రయత్నించవచ్చు.

జీతం రూ.60వేలు అయితే SIP ఎంత?

50-30-20 నియమాన్ని అనుసరిస్తే నెలకు రూ.60వేలు చేతికి వచ్చే వ్యక్తి పెట్టుబడులు, పొదుపు కోసం సుమారు రూ.12వేల‌ను కేటాయించవచ్చు. కన్జర్వేటివ్‌ విధానంలో ఈ రూ.12వేల‌లో రూ.2వేలు అంటే 17 శాతం SIPకి, రూ.6వేలు అంటే 50 శాతం అత్యవసర నిధికి, రూ.4వేలు అంటే 33 శాతం రుణ పొదుపుకు కేటాయించవచ్చు. బ్యాలెన్స్‌డ్‌ విధానంలో SIPకి రూ.4వేలు అంటే 33 శాతం, అత్యవసర నిధికి రూ.4 వేలు అంటే 33 శాతం, రుణ పొదుపుకు రూ.4 వేలు అంటే 33 శాతం కేటాయించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోకస్డ్‌ విధానంలో SIPకి రూ.6వేలు అంటే 50 శాతం, అత్యవసర నిధికి రూ.3వేలు అంటే 25 శాతం, రుణ పొదుపుకు రూ.3వేలు అంటే 25 శాతం కేటాయించవచ్చు.

జీతం రూ.1 లక్ష అయితే SIP ఎంత?

నెలకు రూ.1 లక్ష చేతికి వచ్చే వ్యక్తి 50-30-20 నియమాన్ని అనుసరిస్తే కనీసం రూ.20వేల‌ను పొదుపు, పెట్టుబడుల కోసం కేటాయించవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయగలిగితే సంపద సృష్టి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయవచ్చు. కన్జర్వేటివ్‌ విధానంలో రూ.20వేల‌లో రూ.3వేలు అంటే 15 శాతం SIPకి, రూ.10వేలు అంటే 50 శాతం అత్యవసర నిధికి, రూ.7వేలు అంటే 35 శాతం రుణ పొదుపుకు కేటాయించవచ్చు. బ్యాలెన్స్‌డ్‌ విధానంలో రూ.7వేలు అంటే 35 శాతం SIPకి, రూ.7వేలు అంటే 35 శాతం అత్యవసర నిధికి, రూ.6వేలు అంటే 30 శాతం రుణ పొదుపుకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోకస్డ్‌ విధానాన్ని ఎంచుకుంటే రూ.10వేలు అంటే 50 శాతం SIPకి, రూ.5వేలు అంటే 25 శాతం అత్యవసర నిధికి, మరో రూ.5వేలు అంటే 25 శాతం రుణ పొదుపుకు కేటాయించవచ్చు.

అయితే ఈ గణాంకాలన్నీ కేవలం ఉదాహరణల కోసం మాత్రమే. వీటిని ఆర్థిక సలహాగా పరిగణించకూడదు. వ్యక్తి వద్ద ఇప్పటికే ఉన్న అత్యవసర పొదుపు, రుణాలు, నెలవారీ ఖర్చులు, భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా సరైన కేటాయింపు మారుతుంది. ఈ అంశాల్లో మార్పులు వచ్చినప్పుడు SIP, అత్యవసర నిధి, రుణ పొదుపు మధ్య కేటాయింపులను కూడా మార్చాల్సి వ‌స్తుంది. అందువల్ల దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Advertisement
Advertisement