Gold | నెల రోజుల్లో రూ.20వేలు తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు కొనవచ్చా..?
Gold | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నెల రోజుల వ్యవధిలో 10 గ్రాములకు సుమారు రూ.22,822 తగ్గాయి. అక్టోబర్ 19న రూ.1,46,406గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నవంబర్ 20 నాటికి రూ.1,23,584కు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం ధరల తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.
Gold | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నెల రోజుల వ్యవధిలో 10 గ్రాములకు సుమారు రూ.22,822 తగ్గాయి. అక్టోబర్ 19న రూ.1,46,406గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నవంబర్ 20 నాటికి రూ.1,23,584కు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం ధరల తదుపరి దిశను నిర్ణయించనున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇప్పుడే కొనాలా? మరికొంత కాలం వేచి చూడాలా? అన్న సందిగ్ధంలో కొనుగోలుదారులు ఉన్నారు.
వినియోగదారులకు ఊరటనిస్తున్న ధరల తగ్గుదల..
బంగారం కొనుగోలుదారులకు ఇటీవల ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 19న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,406 ఉండగా, నవంబర్ 20 నాటికి రూ.1,23,584కు తగ్గింది. అంటే ఒక్క నెలలోనే రూ.22,822 (సుమారు 15.6 శాతం) తగ్గింది. సోమవారం సాయంత్రం నమోదైన తాజా ధర రూ.1,24,945గా ఉంది. అక్టోబర్ 19తో పోలిస్తే ఇప్పటికీ రూ.21,461 తక్కువగానే ఉంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని, వీటి ద్వారా దాదాపు రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరల తగ్గుదల నగల కొనుగోలుదారులకు కీలకంగా మారింది.
బంగారం ధర ఇంకా తగ్గుతుందా..?
అంతర్జాతీయంగా గత వారం స్పాట్ గోల్డ్ ధర సుమారు 9 శాతం తగ్గి, ఎనిమిది నెలల్లోనే అత్యంత భారీ వారపు పతనాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఔన్సు బంగారం ధర 3,502.93 డాలర్లకు పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి 3,623 డాలర్ల వద్ద ట్రేడయింది. అమెరికాలో వరుసగా మూడో నెల కూడా కోర్ వినియోగదారుల ధరల సూచీ 0.3 శాతం పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బంగారంపై ఒత్తిడి పెంచాయి. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే అధిక వడ్డీ అందించే పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా టెక్నాలజీ మార్కెట్లో కృత్రిమ మేధ స్టాక్స్ పతనం కూడా బంగారం అమ్మకాలకు కారణమైంది. మరోవైపు రూపాయి బలపడడం దేశీయంగా బంగారం ధరల తగ్గుదలకు తోడ్పడింది.
మార్కెట్ నిపుణులు ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయిని కీలక మద్దతు స్థాయిగా పరిశీలిస్తున్నారు. ఈ స్థాయికి ధర పడిపోతే, ప్రస్తుత ధరతో పోలిస్తే 10 గ్రాములకు మరో రూ.4,700 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అయితే కేంద్ర బ్యాంకులు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం ధరల పతనాన్ని కొంతవరకు అడ్డుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చా..?
బంగారం కొనుగోలు నిర్ణయానికి ముందు మూడు తేదీలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. నవంబర్ 25న అమెరికా అక్టోబర్ నెల వ్యక్తిగత వినియోగ వ్యయాల (పీసీఈ) ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనుంది. డిసెంబర్ 4న భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. అదే రోజు అమెరికా నవంబర్ నెల ఉద్యోగ గణాంకాలు కూడా వెలువడనున్నాయి. ఇక డిసెంబర్ 9న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్న అంచనాలు మార్కెట్లో బలంగా ఉన్నాయని సీఎంఈ గ్రూప్ ఫెడ్‌వాచ్ సాధనం సూచిస్తోంది. ఒకవేళ అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గితే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
మరోవైపు ధరలు ఔన్సుకు 3,500 డాలర్లకు పడిపోతే కొనుగోలుదారులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునే కుటుంబాలు మొత్తం కొనుగోలును ఒకేసారి చేయకుండా, కొంత ఇప్పుడే కొనుగోలు చేసి, మిగిలిన మొత్తాన్ని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తర్వాత కొనుగోలు చేయడం ద్వారా ధరల ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇప్పటికే అధిక ధరల కారణంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత బంగారు ఆభరణాల డిమాండ్ గతేడాదితో పోలిస్తే 20 శాతం తగ్గి 99.9 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. కొనుగోలుదారులు తక్కువ బరువున్న ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది.
తాజావార్తలు
- ●MLA KP Vivekananda Goud | కూకట్పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసి కుట్ర
- ●Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
- ●Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి
- ●Laxmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ..
- ●Anthropic IPO | ఐపీఓ జోరు ఆవిరి.. ఇష్యూ ధర కంటే దిగువకు ఆంథ్రోపిక్ షేర్లు..
- ●Miss Universe 2026 | భారత్కు నిరాశ.. విశ్వసుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ప్యూర్టో రికో భామ

MLA KP Vivekananda Goud | కూకట్పల్లి ట్రక్ పార్కు భూములను అమ్మేసి కుట్ర

Supreme Court | కొండపై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

Nirmal | పెళ్లి కోసం దాచిన రూ. 10 లక్షలు అగ్నికి ఆహుతి

Laxmi Lankala Kenderla | ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ..






