త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anthropic IPO | ఐపీఓ జోరు ఆవిరి.. ఇష్యూ ధర కంటే దిగువకు ఆంథ్రోపిక్ షేర్లు..

Anthropic IPO | నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో లిస్టింగ్‌తో సంచలనం సృష్టించిన ఆంథ్రోపిక్ షేర్లు కొద్ది రోజుల్లోనే భారీగా పడిపోయాయి. మంగళవారం ఒక్కరోజే 11.12 శాతం క్షీణించి, 83 డాలర్ల ఐపీఓ ఇష్యూ ధర కంటే దిగువకు చేరాయి. ఏఐ కంపెనీల అధిక వాల్యుయేషన్లు, డేటా సెంటర్ల పెట్టుబడులపై అనిశ్చితి, పెరుగుతున్న పోటీ ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమయ్యాయి.

S

Business | Published On Nov 25, 2026, 12.29 pm IST

Anthropic IPO | ఐపీఓ జోరు ఆవిరి.. ఇష్యూ ధర కంటే దిగువకు ఆంథ్రోపిక్ షేర్లు..
Advertisement

Anthropic IPO | నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో లిస్టింగ్‌తో సంచలనం సృష్టించిన ఆంథ్రోపిక్ షేర్లు కొద్ది రోజుల్లోనే భారీగా పడిపోయాయి. మంగళవారం ఒక్కరోజే 11.12 శాతం క్షీణించి, 83 డాలర్ల ఐపీఓ ఇష్యూ ధర కంటే దిగువకు చేరాయి. ఏఐ కంపెనీల అధిక వాల్యుయేషన్లు, డేటా సెంటర్ల పెట్టుబడులపై అనిశ్చితి, పెరుగుతున్న పోటీ ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమయ్యాయి.

11 శాతం న‌ష్ట‌పోయిన షేర్లు..

ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ, క్లాడ్ ఏఐ డెవలపర్ ఆంథ్రోపిక్ షేర్లలో భారీ పతనం నమోదైంది. మంగళవారం ఉదయం 10.55 గంటల ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ సమయానికి కంపెనీ షేర్లు 11.12 శాతం నష్టపోయి 77.90 డాలర్లకు పడిపోయాయి. నవంబర్ 19న నాస్‌డాక్‌లో ఏఎన్‌టీ (ANT) టికర్‌తో లిస్టయిన ఈ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 111.50 డాలర్లకు చేరాయి. తొలి ట్రేడింగ్ రోజున ఇష్యూ ధర కంటే 17 శాతం అధికంగా ముగిసినప్పటికీ, ఆ ఉత్సాహం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్లు 83 డాలర్ల ఐపీఓ ధర కంటే దిగువకు చేరాయి. గత వారం ఎస్‌అండ్‌పీ 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీలు కరెక్షన్ జోన్‌లోకి వెళ్లడం, ఏఐ కంపెనీల అధిక విలువలపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగడం ఈ పతనానికి నేపథ్యంగా మారాయి. డేటా సెంటర్ల నిర్మాణం మందగిస్తే ఆంథ్రోపిక్ అభివృద్ధి వేగం, భవిష్యత్తు ఆదాయం, కంపెనీ వాల్యుయేషన్‌పై ప్రభావం పడుతుందని స్టోన్‌ఎక్స్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఫియోనా సిన్‌కొట్టా రాయిటర్స్‌కు తెలిపారు.

షేర్ల‌ను విక్ర‌యించిన సీఈఓ..

ఆంథ్రోపిక్ షేర్లు సోమవారం వాల్‌స్ట్రీట్‌లో నమోదైన సాధారణ ర్యాలీలోనూ భాగం కాలేదు. ఎన్విడియా సంస్థలో జెన్సన్ హువాంగ్‌ను సీఈఓగా తిరిగి కొనసాగించడంతో ఏఐ సంబంధిత షేర్లలో కొనుగోళ్లు పెరిగినప్పటికీ, ఆంథ్రోపిక్ మాత్రం నష్టాల బాట పట్టింది. దీనికి తోడు కంపెనీ అంతర్గత వాటాదారుల షేర్ల విక్రయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. రాయిటర్స్ వెల్లడించిన నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాల ప్రకారం, లిస్టింగ్ జరిగిన మరుసటి రోజే సీఈఓ డారియో అమోడై, ప్రెసిడెంట్ డానియెలా అమోడై ఒక్కొక్కరు 33.7 లక్షలకు పైగా షేర్లను ఐపీఓ అండర్‌రైటర్లకు విక్రయించారు. ఈ విక్రయాల విలువ ఒక్కొక్కరికి 280 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. మరోవైపు అండర్‌రైటర్లు అదనపు షేర్ల కొనుగోలు ఆప్షన్‌ను వినియోగించుకోవడంతో ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తం నిధులు రికార్డు స్థాయిలో 93.5 బిలియన్ డాలర్లకు చేరాయి. డీప్‌సీక్, మిస్ట్రల్, మూన్‌షాట్ ఏఐ వంటి సంస్థలు తక్కువ ఖర్చుతో అందిస్తున్న ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ కూడా క్లాడ్ వంటి ప్రొప్రైటరీ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా మారుతున్నాయి.

న‌వంబ‌ర్ 30న ధ‌ర‌లు పెరుగుతాయా..?

అయితే ఆంథ్రోపిక్ షేర్లకు కొంత మద్దతు లభించే అవకాశమూ ఉంది. నవంబర్ 30న‌ మార్కెట్ ముగిసిన తర్వాత ఎంఎస్‌సీఐ తన గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లలో ఆంథ్రోపిక్‌ను చేర్చనుంది. దీంతో ఇండెక్స్‌ను అనుసరించే పాసివ్ ఫండ్స్ ఈ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇండెక్స్ రీబ్యాలెన్స్ విశ్లేషణ సంస్థ ఇంట్రోపిక్ అంచనా ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి పాసివ్ ఫండ్స్ ఐపీఓలో అందుబాటులోకి వచ్చిన షేర్లలో 30 శాతం వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ పరిణామం షేర్లకు కొంత ఊరటనిచ్చే అవకాశమున్నప్పటికీ, ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ, భారీ డేటా సెంటర్ పెట్టుబడులు, కంపెనీ భవిష్యత్తు ఆదాయంపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్లకు కీలక సవాళ్లుగా మారాయి.

Advertisement
Advertisement