త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Miss Universe 2026 | భార‌త్‌కు నిరాశ‌.. విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని ఎగ‌రేసుకుపోయిన ప్యూర్టో రికో భామ

Miss Universe 2026 | మిస్ యూనివర్స్ 2026 (Miss Universe 2026) విజేత‌గా ప్యూర్టో రికా (Puerto Rico) భామ జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) నిలిచారు. ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లో జరిగిన తుది పోటీల్లో ఆమె తన అద్భుతమైన సమాధానంతో న్యాయనిర్ణేతల మనసు గెలుచుకుని విశ్వసుందరిగా నిలిచారు. గ‌తేడాది మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని గెలుచుకున్న‌ మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కేరళకు చెందిన కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) టాప్ 30లో నిలిచినప్పటికీ, స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత టాప్ 12కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆమె పోటీ నుంచి నిష్క్రమించాల్సి వ‌చ్చింది.

D

National | Published On Nov 25, 2026, 12.25 pm IST

Miss Universe 2026 | భార‌త్‌కు నిరాశ‌.. విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని ఎగ‌రేసుకుపోయిన ప్యూర్టో రికో భామ
Advertisement

Miss Universe 2026 | త్రినేత్ర న్యూస్ : మిస్ యూనివర్స్ (Miss Universe 2026) కిరీటం భారత్‌కు చేజారింది. ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ప్యూర్టో రికా (Puerto Rico) భామ జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto)ను వరించింది. 75వ మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కేరళకు చెందిన కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) టాప్ 30లో నిలిచినప్పటికీ, స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత టాప్ 12కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఆమె పోటీ నుంచి నిష్క్రమించాల్సి వ‌చ్చింది.

మొత్తం 116 దేశాల‌కు చెందిన అంద‌గ‌త్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిలీ, డొమినికన్ రిపబ్లిక్, అమెరికా, న్యూజిలాండ్, క్యూబా, ప్యూర్టో రికో, ఫిలిప్పీన్స్, కొలంబియా, నికరాగ్వా, వెనెజువెలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫ్రాన్స్ దేశాల అంద‌గ‌త్తెలు టాప్ 12లో నిలిచారు. చివ‌రికి ప్యూర్టో రికో భామ మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని ఎగరేసుకుపోయారు. ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లో జరిగిన తుది పోటీల్లో ఆమె తన అద్భుతమైన సమాధానంతో న్యాయనిర్ణేతల మనసు గెలుచుకుని విశ్వసుందరిగా నిలిచారు. గ‌తేడాది మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని గెలుచుకున్న‌ మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు అందాల కిరీటాన్ని అలంకరించారు. ఈ అందాల పోటీల్లో డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్‌ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్‌ గోయెట్జ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు.

త‌న స‌మాధానంతో న్యాయ నిర్ణేత‌ల మ‌న‌సు గెలుచుకుని..

మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో టాప్-5 ఫైనలిస్టులుగా ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనెజువెలా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో దేశాల అంద‌గ‌త్తెలు నిలిచారు. తుది రౌండ్‌లో ఫైనలిస్టులందరికీ ఒకే ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటని న్యాయ‌నిర్ణేత‌లు ప్రశ్నించారు. దీనికి జెన్నిఫర్‌ బారెటో స్పందిస్తూ.. "ప్ర‌పంచానికి వృత్తిప‌ర‌మైన సానుభూతి (professionally empathetic) కలిగిన నాయకులు అవసరమని నేను నమ్ముతున్నాను. ప్ర‌స్తుతం స‌మాజంలో ఇతరులను తప్పుబట్ట‌డం, ప్రశ్నించ‌డం చాలా ఎక్కువైపోయింది. ఒక నాయకుడు తన విలువలకు కట్టుబడి నిలబడాలి. ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించినప్పుడే సమర్థవంతమైన మార్పు సాధ్య‌మ‌వుతుంది" అని జెన్నిఫర్ బారెటో అభిప్రాయ‌ప‌డ్డారు. ఆమె స‌మాధానం న్యాయ నిర్ణేత‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో ఆమెకు ఈ అందాల కిరీటం ద‌క్కింది.

3,150 వజ్రాల‌తో

ఈ సారి పోటీల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 75వ వార్షికోత్సవం సందర్భంగా "ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ" పేరుతో ప్ర‌త్యేక కిరీటాన్ని రూపొందించారు. ఇందులో 3,150 వజ్రాలను పొందుప‌రిచారు. ఇక 2027లో జ‌ర‌గ‌నున్న మిస్ యూనివ‌ర్స్ పోటీల‌కు వియ‌త్నాం ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

స్వ‌దేశంలో ప్యూర్టో రికోకు రెండో విజ‌యం

ప్యూర్టో రికో ఇప్పటివరకు ఆరుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. 1970లో తొలిసారి మారిసోల్‌ మలరెట్ అందాల పోటీల్లో విజేత‌గా నిలిచారు. ఆ త‌ర్వాత 1985లో డెబోరా కార్తీ-డియో, 1993లో దయనారా టోరెస్, 2001లో డెనిస్ క్వినోనెస్, 2006లో జులైకా రివెరా విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని ద‌క్కించుకున్నారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత జెన్నిఫర్ బారెటో ద్వారా ప్యూర్టో రికోకు మిస్ యూనివ‌ర్స్ కిరీటం ద‌క్కిన‌ట్లైంది. మ‌రో విశేషం ఏంటంటే.. స్వ‌దేశంలో రెండోసారి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకోవడం. అంతేకాదు, అమెరికా (9), వెనెజువెలా (7) తర్వాత అత్యధిక సార్లు ఈ కిరీటాన్ని గెలుచుకున్న మూడో దేశంగా ప్యూర్టో రికో నిలిచింది.

చ‌రిత్ర సృష్టించిన బారెటో

75 ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్రలో ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకున్న మొదటి వివాహిత, తల్లిగా జెన్నిఫర్ బారెటో చరిత్ర సృష్టించారు. ఆమె సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (US Department of Defense) లో 'ప్రివెన్షన్ స్పెషలిస్ట్'గా (Prevention Specialist) పనిచేస్తూ మానసిక ఆరోగ్యం, సామాజిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.

భార‌త్‌కు నిరాశ‌

భార‌త్‌కు మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో వ‌రుస‌గా ఐదోసారి నిరాశ త‌ప్ప‌లేదు. భారత్ తరఫున చివరిసారిగా హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 1994లో తొలిసారి సుస్మితాసేన్ విశ్వసుందరి కిరీటాన్ని కైవ‌సం చేసుకుంది. 2000లో లారా దత్తా మిస్ యూనివ‌ర్స్ గా నిలిచింది. ఆ త‌ర్వాత దాదాపు రెండు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ త‌ర్వాత 2021లో పంజాబ్ భామ హ‌ర్నాజ్ సంధూ(21) మిస్ యూనివ‌ర్స్ కిరీటాన్ని సొతం చేసుకుంది. ఈసారి కాజియా నిష్క్ర‌మ‌ణ‌తో మిస్ యూనివర్స్ కిరీటంపై భారత్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.

Also Read..

ద‌లైలామాకు ఢిల్లీలో అధికారిక బంగ్లా కేటాయింపు

బులియ‌న్ మార్కెట్లు కుదేలు.. మళ్లీ భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..

ఎన్‌ఎస్‌ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..

Advertisement
Advertisement