త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flexi Cap Funds | స్టాక్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి.. ఏ మ్యుచువ‌ల్ ఫండ్స్ అయితే మంచిది..?

Flexi Cap Funds | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా స్టాక్ మార్కెట్ల‌లో అధిక వోల‌టిలిటీ, అనిశ్చిత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో కొత్త లేదా అనుభ‌వం లేని పెట్టుబ‌డిదారులు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటే ఆందోళ‌న చెందుతున్నారు.

S

Business | Published On Apr 13, 2026, 10.38 am IST

Flexi Cap Funds | స్టాక్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి.. ఏ మ్యుచువ‌ల్ ఫండ్స్ అయితే మంచిది..?
Advertisement

Flexi Cap Funds | ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా స్టాక్ మార్కెట్ల‌లో అధిక వోల‌టిలిటీ, అనిశ్చిత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీంతో కొత్త లేదా అనుభ‌వం లేని పెట్టుబ‌డిదారులు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటే ఆందోళ‌న చెందుతున్నారు. ఏ ఫండ్‌ల‌లో పెట్టాలి, లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్‌.. ఇలా ఏ విభాగాల్లో డ‌బ్బు పెడితే లాభాలు వ‌స్తాయి.. అని సందేహిస్తున్నారు. మార్కెట్ ప‌రిస్థితులు మారిన స‌మ‌యంలో ఏ విభాగం నుంచి ఏ విభాగానికి మారాలో కూడా చాలా మందికి స్ప‌ష్ట‌త లేదు. అయితే ఇలాంటి గంద‌ర‌గోళ స్థితిలో ఉండేవారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మ‌మైన ప‌ద్ధ‌తి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఫండ్ మేనేజ‌ర్ల‌కు స్వేచ్ఛ‌..

ఫ్లెక్సీ క్యాప్ మ్యుచువల్ ఫండ్లు ఫండ్ మేనేజర్‌కు మార్కెట్ క్యాపిటలైజేషన్, విభాగాల మధ్య స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తాయి. అంటే మార్కెట్ పరిస్థితులను బట్టి లార్జ్‌ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడ‌తారు. దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈ ఫండ్స్‌ సాధారణంగా మోస్తరు రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులకు అనువుగా ఉంటాయి. సాధారణంగా 5 నుంచి 7 సంవత్సరాల పెట్టుబడి కాలాన్ని మంచిదిగా భావిస్తారు. ఈ ఫండ్స్‌ ప్రత్యేకత ఏమిటంటే ఫండ్ మేనేజర్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను మారుస్తారు. ఉదాహరణకు స్థిరమైన పరిస్థితుల్లో లార్జ్‌ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారు. బుల్ మార్కెట్‌లో మిడ్ లేదా స్మాల్ క్యాప్‌లపై దృష్టి పెడతారు. అయితే ఈ అంశంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒకేలా ఉండదు. కొన్నివి కన్జ‌ర్వేటివ్‌గా ఉంటాయి, మరికొన్నివి అగ్రెసివ్‌గా ఉంటాయి. కాబట్టి రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఫండ్స్‌ను ఎంపిక చేయడం అత్యంత కీలకం.

ఈ స్కీమ్స్‌పై లుక్కేయండి..

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తే కొన్ని ప్రముఖ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ త‌మ‌ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతినెలా అప్‌డేట్ల‌ను ఇస్తాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 13 నెలలుగా రెండో క్వార్టైల్‌లో కొనసాగుతోంది. అంతకుముందు ఇది మూడో క్వార్టైల్‌లో ఉండేది. యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 35 నెలలుగా నాల్గవ క్వార్టైల్‌లో ఉంది. కెనరా రోబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 34 నెలలుగా మూడో క్వార్టైల్‌లో కొనసాగుతోంది. పీజీఐఎమ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత నాలుగు నెలలుగా నాల్గవ క్వార్టైల్‌లో ఉంది, అంతకుముందు ఇది మూడో క్వార్టైల్‌లో ఉండేది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 13 నెలలుగా మొదటి క్వార్టైల్‌లో నిలుస్తోంది. పరాగ్ పరిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత మూడు నెలలుగా రెండో క్వార్టైల్‌లో ఉంది, అంతకుముందు ఇది మొదటి క్వార్టైల్‌లో కొనసాగింది.

ఏయే అంశాల‌ను ప‌రిగ‌ణించాలి..?

ఏప్రిల్ 2026లో పెట్టుబడికి అనుకూలంగా భావిస్తున్న ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ జాబితా ఇలా ఉంది. పరాగ్ పరిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యూటీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, పీజీఐఎమ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎస్‌బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కెనరా రోబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లు పెట్టుబ‌డిదారుల‌కు ప్ర‌స్తుతం చ‌క్క‌ని అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. అయితే వీటిల్లో ఫండ్స్ ఎంపిక‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ‌త 3 సంవ‌త్స‌రాల డైలీ రోలింగ్ రిట‌ర్న్స్ ఆధారంగా స‌గ‌టు రాబ‌డుల‌ను ప‌రిశీలించాలి. హ‌ర్స్ ఎక్స్‌పోనెంట్ (H) ద్వారా ఫండ్ స్థిరత్వాన్ని అంచనా వేస్తారు. H విలువ 0.5 అయితే రాబడులు అంచనా వేయడం కష్టం. 0.5 కంటే తక్కువైతే రాబడులు తిరిగి సగటు వైపు వెళ్లే స్వభావం కలిగి ఉంటాయి. 0.5 కంటే ఎక్కువైతే స్థిరమైన ట్రెండ్‌ను సూచిస్తుంది.

ఫండ్ డిటెయిల్స్ తెలుసుకోవాలి..

డౌన్‌సైడ్ రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నెగెటివ్ రిటర్న్స్ ఆధారంగా లెక్కించి ఫండ్ నష్టపోయే అవకాశాన్ని అంచనా వేయాలి. అదేవిధంగా జెన్సెన్ ఆల్ఫా ద్వారా మార్కెట్‌తో పోలిస్తే ఫండ్ ఇచ్చే అదనపు రాబడిని కొల‌వాలి. ఇది రిస్క్‌కు అనుగుణంగా ఫండ్ పనితీరును తెలియజేస్తుంది. ఆస్తి పరిమాణాన్ని కూడా ప్రమాణంగా తీసుక‌వాలి. ఈక్విటీ ఫండ్లకు కనీసం రూ.50 కోట్ల ఆస్తి పరిమాణం ఉండే స్కీమ్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ సాంకేతిక అంశాల‌ను పెట్టుబ‌డిదారులు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఆయా అంశాల‌కు చెందిన వివ‌రాల‌ను ఫండ్స్‌కు చెందిన పూర్తి డిటెయిల్స్‌లో ఇస్తారు. క‌నుక వాటిపై కాస్త అవ‌గాహ‌న ఉంటే ఫండ్స్ డిటెయిల్స్‌ను అర్థం చేసుకోవ‌డం తేలిక‌వుతుంది. అప్పుడు ఏ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాలి అనే విష‌యం పెట్టుబ‌డిదారులకు స్వ‌యంగా తెలుస్తుంది. దీంతో ఇబ్బందులు లేకుండా పెట్టుబ‌డులు కొన‌సాగించ‌వ‌చ్చు. ఇక మార్కెట్లలో అనిశ్చితి ఉన్న స‌మ‌యంలో పెట్టుబ‌డిదారుల‌కు ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స‌రైన ఆదాయ వ‌న‌రుగా నిలుస్తాయి. స‌రైన ఎంపిక‌, దీర్ఘ‌కాల దృష్టితో పెట్టుబ‌డులు పెడితే చ‌క్క‌ని లాభాల‌ను పొందేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Advertisement
Advertisement