త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | పెరిగిన టారిఫ్ భ‌యాలు, ముడి చ‌మురు ధ‌ర‌లు.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,650 స్థాయికి దిగువన ముగిసింది.

S

Business | Published On Nov 27, 2026, 4.11 pm IST

Stock Markets | పెరిగిన టారిఫ్ భ‌యాలు, ముడి చ‌మురు ధ‌ర‌లు.. భారీ న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 25,650 స్థాయికి దిగువన ముగిసింది.

సూచీల్లో భారీ అమ్మ‌కాల ఒత్తిడి..

భారత స్టాక్ మార్కెట్లలో శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 989.33 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 83,339.26 వద్ద ముగిసింది. అంతకుముందు ముగింపు 84,328.59గా ఉంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 277.30 పాయింట్లు (1.07 శాతం) క్షీణించి 25,607.20 వద్ద స్థిరపడింది. గత ముగింపు 25,884.50తో పోలిస్తే సూచీ గణనీయంగా పడిపోయింది. విస్తృత మార్కెట్ సూచీల్లోనూ ఎక్కువ భాగం నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీగా నిఫ్టీ కెమికల్స్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మిడ్‌స్మాల్ ఐటీ అండ్ టెలికాం, మీడియా సూచీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో బీఈఎల్, టైటాన్, ట్రెంట్, టాటా స్టీల్, ఇండిగో షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, మారుతీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఎన్ఎస్ఈలో టైటాన్, బీఈఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్, ఇండిగో, ట్రెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ లాభపడగా, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీఎంపీవీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ నష్టపోయాయి.

చ‌మురు స‌ర‌ఫ‌రాపై పెరుగుతున్న ఆందోళ‌న‌..

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 97.07 డాలర్ల వద్ద, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 85.66 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. భౌతికంగా చమురు సరఫరాలో ఇప్పటివరకు పెద్దగా అంతరాయం లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో సరఫరా అంతరాయాలు ఏర్పడే ప్రమాదాన్ని మార్కెట్లు అంచనా వేస్తున్నాయని కోటక్ నియో ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ ప్రతినిధి కయానత్ చైన్‌వాలా తెలిపారు. ఒపెక్ ప్లస్ సమావేశం సమీపిస్తుండడం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో బ్రెంట్ క్రూడ్ ధరలకు మద్దతు లభించే అవకాశముందని, ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరల్లో రిస్క్ ప్రీమియం కొనసాగుతుందని పేర్కొన్నారు.

లాభాల స్వీక‌ర‌ణ జ‌రిగిందా..?

గత కొన్ని సెషన్లలో వచ్చిన భారీ రికవరీ తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ, కన్సాలిడేషన్ కారణంగా కూడా శుక్రవారం పతనం నమోదైందని మార్కెట్ విశ్లేషకుడు విపిన్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బ్యారెల్‌కు 97 డాలర్లకు చేరువ కావడం భారత్‌కు ఆందోళనకరమని, దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడం, దిగుమతి బిల్లు విస్తరించడం, కంపెనీల లాభాల మార్జిన్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని వివరించారు. సాంకేతికంగా నిఫ్టీకి 25,600-25,650 స్థాయిలో తక్షణ మద్దతు ఉందని, ఆ తర్వాత 25,350-25,500 పరిధి కీలకమని తెలిపారు. పైస్థాయిలో 25,850-25,900 వద్ద నిరోధం ఉండగా, 26,000 కీలక రెసిస్టెన్స్ స్థాయిగా పేర్కొన్నారు. నిఫ్టీ 26,000 పైన నిలదొక్కుకుంటే స్వల్పకాలిక మార్కెట్ ధోరణి మెరుగుపడుతుందని, 25,600 దిగువకు పడిపోతే మరింత లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుందని విశ్లేషించారు.

Advertisement
Advertisement