త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మార్కెట్లు ప‌త‌న‌మైనా, రాబ‌డి త‌గ్గినా.. మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను మార్చాలా..?

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టే చాలా మంది సాధార‌ణంగా ఎక్కువ రాబ‌డి ఏ ఫండ్‌లో ల‌భిస్తుందో చూసి పెట్టుబ‌డులు పెడుతుంటారు. రిస్క్ ఎక్కువ ఉన్నా స‌రే రాబ‌డి అధికంగా ఉంటే చాల‌ని భావిస్తుంటారు.

S

Business | Published On Jul 24, 2026, 10.45 am IST

Mutual Funds | మార్కెట్లు ప‌త‌న‌మైనా, రాబ‌డి త‌గ్గినా.. మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను మార్చాలా..?
Advertisement

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టే చాలా మంది సాధార‌ణంగా ఎక్కువ రాబ‌డి ఏ ఫండ్‌లో ల‌భిస్తుందో చూసి పెట్టుబ‌డులు పెడుతుంటారు. రిస్క్ ఎక్కువ ఉన్నా స‌రే రాబ‌డి అధికంగా ఉంటే చాల‌ని భావిస్తుంటారు. ఫండ్‌లో పెట్టుబ‌డులు పెట్టిన త‌రువాత స్వ‌ల్ప కాలంలోనే న‌ష్టాలు వ‌చ్చినా లేదా ఆశించిన మేర రాబ‌డులు రాక‌పోయినా, మార్కెట్లు ప‌త‌నం అవుతున్నా డ‌బ్బును తీసి మ‌ళ్లీ వేరే ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఇలా చాలా మంది ఇన్వెస్ట‌ర్లు చేస్తుంటారు. అయితే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో అధిక రాబ‌డులు కాకుండా స్థిర‌మైన రాబ‌డుల‌ను ఇస్తూ, త‌క్కువ హెచ్చు త‌గ్గులు ఉండే ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల‌ని, అలాగే మార్కెట్లు ప‌త‌నంలో ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న క‌లిగించ‌ని విధంగా ఫండ్ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయాల‌ని, అలాంటి ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఆశించిన ఫ‌లితం లేక‌పోతే ఫండ్‌ను మార్చాలా..

మ్యుచువ‌ల్ ఫండ్స్ అంటే దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ప‌నిచేసేవి. కానీ చాలా మంది స్వ‌ల్ప‌కాలంలోనే అధిక పెట్టుబ‌డుల‌ను ఆశిస్తుంటారు. అలాంటి ధోర‌ణి స‌రైంది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ఎంత దీర్ఘ‌కాలం వేచి ఉంటే అంత ఎక్కువ సంప‌ద‌ను సృష్టించే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇందుకు కాంపౌండింగ్ శ‌క్తి ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని అంటున్నారు. చాలా మంది మార్కెట్లు ప‌త‌నంలో ఉన్న‌ప్పుడు, న‌ష్టాల్లో ఉన్నా, ఆశించిన స్థాయిలో లాభాలు రాకున్నా డ‌బ్బును తీసి ఇత‌ర ఫండ్స్‌లో పెడుతుంటారు. అందులోనూ ఆశించిన స్థాయిలో ఫ‌లితం ల‌భించ‌క‌పోతే అప్పుడు వేరే ఫండ్స్ వైపు చూస్తారు. ఈ ధోర‌ణి స‌రైంది కాదు. ఏ ఫండ్ అయినా స‌రే దీర్ఘ‌కాలంలో ఎంత మొత్తంలో రాబ‌డుల‌ను అందించింది, హెచ్చు త‌గ్గులు ఎలా ఉన్నాయి, మార్కెట్లు ప‌త‌న‌మైన‌ప్పుడు ఫండ్ ప‌నితీరు ఎలా ఉంది త‌దిత‌ర అంశాల‌ను ముందుగానే విశ్లేషించి పెట్టుబ‌డులు పెట్టాలి. దీంతో దీర్ఘ‌కాలంలో త‌క్కువ రిస్క్‌తో, స్వ‌ల్ప హెచ్చు త‌గ్గుల‌తో స్థిర‌మైన రాబడుల‌ను పొందే అవ‌కాశాలు ఉంటాయి. అంతే కానీ స్వ‌ల్ప కాలంలో రాబడులు రావ‌డం లేద‌ని ఫండ్స్‌ను మార్చ‌డం స‌రైన నిర్ణ‌యం కాద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

స్వ‌ల్ప‌కాల లాభాల‌ను చూడ‌వ‌ద్దు..

మ్యుచువ‌ల్ ఫండ్స్ ఏవైనా స‌రే స్వ‌ల్ప‌కాలిక రాబడుల‌ను చూసి వాటి ప‌నితీరును విశ్లేషించడం స‌రైన నిర్ణ‌యం కాదు. ఫండ్ దీర్ఘ‌కాలంలో ఎలా ప్ర‌వ‌ర్తించింద‌న్న అంశ‌మే చాలా ముఖ్యం. పెట్టుబ‌డిదారులు ఫండ్ ప‌నితీరును విశ్లేషించేట‌ప్పుడు దీర్ఘ‌కాలిక లాభాలు, స్థిర‌త్వం త‌దిత‌ర విష‌యాల‌ను ఎక్కువ‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో వ‌చ్చిన రాబ‌డులు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించినా స‌రే ఫండ్ దీర్ఘ‌కాలిక రాబ‌డుల‌పై అవి ప్ర‌భావం చూప‌వు. ఏ క్ష‌ణంలో అయినా ఫండ్ ప‌నితీరు పూర్తి క్షీణించే అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల గ‌తంలో దీర్ఘ‌కాలంలో ఫండ్ ఎలాంటి ప‌నితీరును క‌న‌బ‌రించింద‌న్న‌దే ముఖ్యం. ఫండ్ నిల‌క‌డ‌గా రాబ‌డుల‌ను అందించిందా, హెచ్చు త‌గ్గుల‌ను త‌ట్టుకుని ఎంత మేర నిల‌బ‌డ‌గ‌లిగింది, ఫండ్‌లో ఉండే ఖ‌ర్చులు, చార్జిలు, అందులో ఉండే పెట్టుబ‌డి ఇన్‌స్ట్రుమెంట్లు, అవి దీర్ఘ‌కాలంలో ఎలాంటి రాబడుల‌ను అందించాయి.. అన్న వివ‌రాల‌ను కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంది. కేవ‌లం స్వ‌ల్ప‌కాలంలో అధిక రాబ‌డుల‌ను ఇస్తున్నాయ‌ని అత్య‌ధిక రిస్క్ క‌లిగిన ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రికాదు. ఫండ్ పోర్ట్‌ఫోలియో నాణ్య‌త‌, నిర్దేశిత పెట్టుబ‌డి శైలి, నిల‌క‌డ వంటి అంశాల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది.

ఇత‌ర ఫండ్స్‌ను పోల్చి చూడాలి..

ఫండ్‌ను మార్చాల‌ని అనుకుంటున్న‌ప్పుడు ముందుగా అదే త‌ర‌హా ఇత‌ర ఫండ్స్ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నాయో గ‌మ‌నించాలి. ఇత‌ర ఫండ్స్ రాబ‌డులు స‌రిగ్గానే ఉన్నా అలాంటి ఫండ్‌నే క‌లిగి ఉంటే, అందులో రాబ‌డులు స‌రిగ్గా లేక‌పోతే అప్పుడు క‌చ్చితంగా మార్చాలి. కానీ పెట్టుబ‌డిదారులు త‌మ ఫండ్స్‌ను పోలిన ఇత‌ర ఫండ్స్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నా, త‌మ ఫండ్‌కు స‌మానంగా రాబ‌డుల‌ను అందిస్తున్నా ఇత‌ర ఫండ్స్‌కు మారాల్సిన ప‌నిలేదు. మార్కెటింగ్ చేసే డిస్ట్రిబ్యూట‌ర్లు లేదా ఏజెంట్లు స్వ‌ల్ప‌కాలంలో అధిక రాబడుల‌ను ఆశ‌జూపి ఫండ్ మారేలా చేస్తారు. కానీ అది స‌రైన నిర్ణ‌యం కాదు. ముందుగా మార్కెట్ స్థితిగ‌తుల‌ను, ఇత‌ర ఫండ్స్‌ను పూర్తిగా ప‌రిశీలించాకే నిర్ణ‌యం తీసుకోవాలి. అప్పుడే దీర్ఘ‌కాలంలో సంపద సృష్టి సాధ్య‌మ‌వుతుంది.

రేటింగ్‌ల‌ను చూసి మోసపోవ‌ద్దు..

చాలా మంది మ‌దుప‌రులు కేవ‌లం ఫండ్స్‌కు చెందిన రేటింగ్‌, అత్య‌ధిక రాబ‌డులు వంటి అంశాల‌ను చూసే పెట్టుబ‌డులు పెడ‌తారు. అది కూడా స‌రైన నిర్ణ‌యం కాదు. అవి భ‌విష్య‌త్తు ప‌నితీరుకు ప్ర‌తిబింబం కాదు. దీర్థ‌కాలిక ప్ర‌ద‌ర్శ‌న‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఫండ్ రాబ‌డి త‌గ్గిపోతే అదేలాంటి ఇత‌ర ఫండ్స్‌తో పోల్చి చూసి అప్పుడు నిర్ణ‌యం తీసుకోవాలి. మార్కెట్లు ప‌త‌నంలో ఉండ‌డం వ‌ల్ల ఫండ్ రాబ‌డి త‌గ్గితే అప్పుడు ఇత‌ర ఫండ్స్‌కు మారినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మార్కెట్‌ల‌లో ప‌త‌నం వ‌స్తే అది ఒక ఫండ్ మాత్ర‌మే కాదు, అన్ని ఫండ్స్‌ను ప్ర‌భావితం చేస్తుంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ప‌తనంలోనూ మెరుగ్గా ప‌నిచేసే లేదా భారీ న‌ష్టాల‌ను త‌ట్టుకునే ఫండ్స్‌ను వెద‌కాలి. అలాంటి ఫండ్స్ దీర్ఘ‌కాలంలో ఎలాంటి రాబ‌డుల‌ను అందించాయో చూడాలి. వాటిల్లో మెరుగైన ఫండ్‌ను ఎంపిక చేయాలి. ఇలా పెట్టుబ‌డిదారుల ఆందోళ‌న‌ను తగ్గిస్తూ, న‌ష్టాల‌ను భ‌ర్తీ చేస్తూ, దీర్ఘ‌కాలంలో స్థిర‌మైన రాబ‌డుల‌ను అందించే ఫండ్స్‌లో మాత్ర‌మే పెట్టుబ‌డుల‌ను పెట్టాలి. అప్పుడే దీర్ఘ‌కాలంలో భారీ మొత్తంలో కార్ప‌స్‌ను లేదా రిటైర్మెంట్ ఫండ్‌ను సృష్టించే అవ‌కాశాలు ఉంటాయి. దీంతో భ‌విష్య‌త్తులో స్ప‌ష్ట‌మైన ఆర్థిక భ‌రోసా ల‌భిస్తుంది.

Advertisement
Advertisement