త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | నెలకు రూ.500తోనే కోటీశ్వరులు కావచ్చా? ఇలా చేస్తే భారీ సంపద!

SIP | మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే గ‌తంలో చాలా మంది ఆందోళ‌న చెందేవారు. వాటిల్లో డ‌బ్బు పెడితే మొత్తం పోతుంద‌ని భావించేవారు. కానీ ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే దీర్ఘ‌కాల పెట్టుబ‌డి అని, స్వ‌ల్ప‌కాలంలో వ‌చ్చే న‌ష్టాల‌కు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా మందికి అవ‌గాహ‌న వ‌చ్చింది.

S

Business | Published On Jul 4, 2026, 5.56 pm IST

SIP | నెలకు రూ.500తోనే కోటీశ్వరులు కావచ్చా? ఇలా చేస్తే భారీ సంపద!
Advertisement

SIP | మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే గ‌తంలో చాలా మంది ఆందోళ‌న చెందేవారు. వాటిల్లో డ‌బ్బు పెడితే మొత్తం పోతుంద‌ని భావించేవారు. కానీ ప్ర‌జ‌ల్లో మార్పు వ‌చ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే దీర్ఘ‌కాల పెట్టుబ‌డి అని, స్వ‌ల్ప‌కాలంలో వ‌చ్చే న‌ష్టాల‌కు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చాలా మందికి అవ‌గాహ‌న వ‌చ్చింది. దీంతో గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా చాలా మంది ప్ర‌జ‌లు చిన్న మొత్తాల్లో అయినా స‌రే మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో నెల నెలా సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) రూపంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. వ్య‌క్తులు త‌మ ఆదాయాన్ని బ‌ట్టి, ఆర్థిక అవ‌స‌రాలు పోను నెల నెలా కొంత మొత్తాన్ని ఎస్ఐపీల‌కు కేటాయిస్తున్నారు. అయితే ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే నెల నెలా భారీ మొత్తాన్ని జ‌మ చేయాల్సిన అవ‌స‌రం లేదు. నెల‌కు రూ.500 పెట్టినా స్థిరంగా, క్ర‌మశిక్ష‌ణ‌తో పెట్టుబ‌డి పెడితే అదే దీర్ఘ‌కాలంలో ల‌క్ష‌ల రూపాయల‌ను జ‌మ చేసి పెడుతుంది. అందువ‌ల్ల ఎంత పెట్టుబ‌డి పెడుతున్నామ‌నే విష‌యం కాకుండా ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ ఉందా, లేదా అన్న విష‌యాన్ని పరిశీలించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

10 కోట్ల‌కు పైగా యాక్టివ్ ఎస్ఐపీలు..

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాల్లో భారీ మార్పులను చూసింది. ప్రస్తుతం చాలా మంది స్థిర డిపాజిట్లు (ఎఫ్‌డీలు), రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీలు) వంటి సంప్రదాయ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి ఎస్‌ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నెలా ఎస్‌ఐపీల్లో పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10 కోట్లకు పైగా యాక్టివ్ ఎస్‌ఐపీ అకౌంట్లు ఉండటం దీనికి నిదర్శనం. ఎస్‌ఐపీలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. క్రమశిక్షణతో, దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగిస్తే చిన్న మొత్తాలతో కూడా భారీ సంపదను నిర్మించుకోవచ్చు. నెలకు కేవలం రూ.500 పెట్టుబడితోనే భవిష్యత్తులో లక్షలు, కోట్లు కూడబెట్టే అవకాశం ఉంటుందని ఉదాహరణలు చెబుతున్నాయి.

రూ.500తో లక్షల ఫండ్ ఎలా..?

నెలకు కేవలం రూ.500తో ఎస్‌ఐపీ ప్రారంభించవచ్చు. ప్రతి నెలా రూ.500 చొప్పున 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, సగటున వార్షికంగా 12 శాతం రాబడి పొందితే, మొత్తం పెట్టుబడి రూ.1.80 ల‌క్ష‌లు మాత్రమే అవుతుంది. అయితే చక్రవడ్డీ ప్రభావంతో దాదాపు రూ.13,60,487 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో 30 సంవత్సరాల చివరికి మొత్తం నిధి సుమారు రూ.15,40,487కు చేరుకుంటుంది. ఈ ఉదాహరణలో నెలవారీ ఎస్‌ఐపీ పెట్టుబడి రూ.500, అంచనా వార్షిక రాబడి 12 శాతం, పెట్టుబడి కాలం 30 సంవత్సరాలు. మొత్తం పెట్టుబడి రూ.1.80 ల‌క్ష‌లు కాగా, అంచనా లాభం రూ.13,60,487. మొత్తం కార్పస్ విలువ రూ.15,40,487గా ఉంటుంది. ఇంకా ఎక్కువ సంపదను నిర్మించాలనుకుంటే కూడా ఎస్‌ఐపీ ద్వారా అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగించడం, మెరుగైన రాబడిని అందించే ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం అవసరం.

40 ఏళ్ల‌కు అయితే..

ఉదాహరణకు, నెలకు రూ.500 చొప్పున 40 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, సగటున 15 శాతం వార్షిక రాబడి లభించినట్లయితే, మొత్తం పెట్టుబడి కేవలం రూ.2.40 ల‌క్ష‌లు మాత్రమే అవుతుంది. అయితే ఈ పెట్టుబడిపై సుమారు రూ.1,12,83,335 లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం కార్పస్ దాదాపు రూ.1,15,23,335కు చేరుకుంటుంది. ఈ ఉదాహరణలో నెలవారీ ఎస్‌ఐపీ పెట్టుబడి రూ.500, అంచనా వార్షిక రాబడి 15 శాతం, పెట్టుబడి కాలం 40 సంవత్సరాలు. మొత్తం పెట్టుబడి రూ.2.40 ల‌క్ష‌లు కాగా, అంచనా లాభం రూ.1,12,83,335. మొత్తం నిధి విలువ రూ.1,15,23,335గా ఉండే అవకాశం ఉంటుంది.

అన్ని అంశాల‌ను గ‌మ‌నించాలి..

భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ గతంలో లభించినంత అధిక రాబడులను ఎప్పుడూ అందిస్తుందని చెప్పలేం. అయితే ఎస్‌ఐపీ ప్రభావం తగ్గిపోతుందని భావించాల్సిన అవసరం లేదు. ఎస్‌ఐపీ అంటే క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే విధానం మాత్రమే. ఎస్‌ఐపీ ద్వారా వచ్చే రాబడులు కార్పొరేట్ కంపెనీల లాభదాయకత, దేశ ఆర్థిక వృద్ధి, మార్కెట్ పరిస్థితులు, అలాగే పెట్టుబడిదారుడు ఎంతకాలం పెట్టుబడిని కొనసాగిస్తాడన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎస్‌ఐపీలో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. అవ‌సరం అయితే నిపుణుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement