త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PB Fintech | ఐఆర్‌డీఏఐ చ‌ర్య‌ల ఎఫెక్ట్‌.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

PB Fintech | బీమా రంగంలో కమిషన్ల వ్యవస్థను సమూలంగా మార్చేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)ప్రతిపాదించిన సంస్కరణలు స్టాక్ మార్కెట్‌ల‌లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

S

Business | Published On Sep 24, 2026, 1.08 pm IST

PB Fintech | ఐఆర్‌డీఏఐ చ‌ర్య‌ల ఎఫెక్ట్‌.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
Advertisement

PB Fintech | బీమా రంగంలో కమిషన్ల వ్యవస్థను సమూలంగా మార్చేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)ప్రతిపాదించిన సంస్కరణలు స్టాక్ మార్కెట్‌ల‌లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పీబీ ఫిన్‌టెక్ షేర్ ఏకంగా 28 శాతం పడిపోయింది. గ‌త సెష‌న్‌లో రూ.1,886.30 వద్ద ముగిసిన షేర్.. గురువారం రూ.1,357.90 స్థాయికి చేరింది. అంతకుముందు సెషన్‌లో ఈ షేర్ 4.5 శాతం లాభపడడం గమనార్హం. మరోవైపు టర్టిల్‌మింట్ షేర్ 20 శాతం క్షీణించి రూ.109.04 వద్ద ట్రేడయ్యింది. బీమా నియంత్రణ సంస్థ రీక్యాలిబ్రేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో బీమా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన కమిషన్లు, వ్యయాలు, మార్కెట్ ప్రవర్తన, పారదర్శకత వంటి అంశాల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. కమిషన్లపై పరిమితులు విధించడం, బీమా ఉత్పత్తి సంక్లిష్టతకు అనుగుణంగా కమిషన్లను నిర్ణయించడం, జీవిత బీమా కమిషన్లను తొలి ఏడాదికే పరిమితం కాకుండా పాలసీ కాలవ్యవధిలో విస్తరించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

ఆదాయాల‌పై భారీ ప్ర‌భావం..

ఈ మార్పుల ప్రభావం పీబీ ఫిన్‌టెక్ వ్యాపార నమూనాపై గణనీయంగా పడే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్ పేర్కొంది. ముఖ్యంగా ఆరోగ్య బీమా రెన్యూవల్, పోర్టింగ్ కమిషన్లు, మొదటి ఏడాది టర్మ్ లైఫ్ కమిషన్లు, మోటార్ ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ బీమా కమిషన్లలో కోతలు పీబీ ఫిన్‌టెక్ ఆదాయాలపై ప్రభావం చూపిస్తాయ‌ని తెలిపింది. పీబీ ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ సంస్థలకు కొత్త వ్యాపారాలపై వచ్చే కమిషన్లు తగ్గితే ఆదాయాలపై ఒత్తిడి పెరుగుతుంద‌ని జెఫరీస్ పేర్కొంది. కమిషన్ రేట్లలో 10 శాతం కోత వస్తే పీబీ ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ ఆదాయాలు 10 నుంచి 12 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రతిపాదించిన కమిషన్ కోతలు మార్కెట్ అంచనాల కంటే చాలా తీవ్రంగా ఉన్నాయని బెర్న్‌స్టీన్ పేర్కొంది. ముఖ్యంగా పీబీ ఫిన్‌టెక్‌పై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రతిపాదించిన టేక్-రేట్ పరిమితులు ఆరోగ్య, మోటార్ బీమా విభాగాల్లో పీబీ ఫిన్‌టెక్ యూనిట్ ఎకనామిక్స్‌పై గణనీయమైన ఒత్తిడి తీసుకువ‌స్తాయ‌ని బెర్న్‌స్టీన్ పేర్కొంది.

చాలా త‌క్కువ‌గా క‌మిష‌న్లు..

కొత్త ప్రతిపాదనల ప్రకారం బీమా ఉత్పత్తి ఎంత క్లిష్టంగా ఉంది, దాన్ని విక్రయించేందుకు ఎంత శ్రమ అవసరమవుతోంది అనే అంశాల ఆధారంగా కమిషన్ స్థాయిని నిర్ణయించనున్నారు. బ్రోకర్లు, బ్యాంకుల వంటి విస్తృత పంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించే ఆరోగ్య, మోటార్, జీవిత బీమా ఉత్పత్తులకు తక్కువ కమిషన్లు చెల్లించే విధానాన్ని ప్రతిపాదించారు. తప్పనిసరి బీమా కవర్లలో ముఖ్యంగా థర్డ్ పార్టీ మోటార్ బీమా పాలసీలకు చాలా తక్కువ లేదా ఎలాంటి కమిషన్ లేకుండా చేసే ప్రతిపాదన కూడా ఉంది. రుణాలతోపాటు బీమా పాలసీలను విక్రయించే బ్యాంకులు, రుణ సంస్థలకు ఉత్పత్తిని బట్టి కమిషన్లను 2 శాతం నుంచి 5 శాతం వరకు పరిమితం చేయాలని ప్రతిపాదించారు. అలాగే రుణం తీసుకునే సమయంలో బీమాను తప్పనిసరిగా తీసుకోవాలనే విధంగా బీమాను రుణంతో కలిపి విక్రయించడాన్ని నిషేధించాలని ప్రతిపాదించారు.

అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అభిప్రాయాల సేక‌ర‌ణ‌..

ఆరోగ్య బీమాలో పాలసీని మొదటిసారి తీసుకున్నప్పుడు పంపిణీదారులకు చెల్లించే కమిషన్‌ను 15 శాతం నుంచి 20 శాతం మధ్య పరిమితం చేయాలని ప్రతిపాదించారు. అలాగే పాలసీ రెన్యూవల్ లేదా మరో బీమా సంస్థకు పాలసీని పోర్ట్ చేసినప్పుడు చెల్లించే కమిషన్‌ను మరింత తక్కువగా 5 నుంచి 10 శాతం మధ్య పరిమితం చేయాలని ప్రతిపాదించారు. మోటార్ బీమాలో వ్యక్తిగత ప్రమాద కవరేజీకి కమిషన్‌ను 5 శాతం నుంచి 10 శాతం మధ్య పరిమితం చేయాలని బీమా నియంత్రణ సంస్థ ప్రతిపాదించింది. జీవిత బీమా విషయంలో పాలసీ కాలవ్యవధిని బట్టి పంపిణీదారులకు మొదటి ఏడాది చెల్లించే కమిషన్‌ను 5 శాతం నుంచి 20 శాతం మధ్య పరిమితం చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై బీమా రంగంలోని సంస్థలు, ఇతర భాగస్వాముల నుంచి అక్టోబర్ 25 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం తుది నిబంధనలను ఖరారు చేయనున్నారు. అందువల్ల ప్రస్తుతం ఇవి ప్రతిపాదనలు మాత్రమే కాగా, తుది నిబంధనల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Advertisement
Advertisement