త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..

IRDAI | భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) జీవిత బీమా పాలసీదారులకు ప్రయోజనం కల్పించే ప్రతిపాదనపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక అవసరాల కారణంగా పాలసీలను గడువుకు ముందే రద్దు చేసుకునే పరిస్థితులను తగ్గించేందుకు, జీవిత బీమా ప్రీమియంల చెల్లింపులకు రుణ సదుపాయాన్ని అందించే మార్గాలను పరిశీలిస్తోంది.

S

Business | Published On Oct 17, 2026, 3.38 pm IST

IRDAI | లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ఐఆర్‌డీఏఐ ఊరట.. ప్రీమియం చెల్లింపులకు రుణాలు..
Advertisement

IRDAI | భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) జీవిత బీమా పాలసీదారులకు ప్రయోజనం కల్పించే ప్రతిపాదనపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక అవసరాల కారణంగా పాలసీలను గడువుకు ముందే రద్దు చేసుకునే పరిస్థితులను తగ్గించేందుకు, జీవిత బీమా ప్రీమియంల చెల్లింపులకు రుణ సదుపాయాన్ని అందించే మార్గాలను పరిశీలిస్తోంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ పాలసీదారులు తమ బీమా పాలసీలను కొనసాగించే అవకాశం లభిస్తుంది. అకౌంట్ అగ్రిగేటర్ల కోసం పనిచేసే స్వీయ నియంత్రణ సంస్థ సహమతి నిర్వహించిన సంవాద్‌ 2026 కార్యక్రమంలో ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ అజయ్‌ సేథ్‌ ఈ అంశంపై మాట్లాడారు. గణనీయమైన సంఖ్యలో పాలసీదారులు డబ్బు అవసరం ఏర్పడినప్పుడు తమ బీమా పాలసీలను సరెండర్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జీతం రూపంలో స్థిరమైన ఆదాయం లేని వ్యక్తుల విషయంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడం వల్ల ప్రీమియంల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

పాల‌సీ ద్వారా మెరుగైన ప్రయోజ‌నం పొందేందుకే..

చివరి దశలో చెల్లించాల్సిన ప్రీమియంలకు రుణ సదుపాయం కల్పించడం ఉపయోగకరంగా ఉంటుందని అజయ్‌ సేథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రీమియంలను కొంతకాలంపాటు రుణ సహాయంతో చెల్లించగలిగితే పాలసీదారులు తమ బీమా పాలసీ నుంచి మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చని చెప్పారు. అదే సమయంలో రుణదాతకు కూడా ఆ పాలసీలో ఉన్న విలువ భద్రతగా ఉపయోగపడుతుందని వివరించారు. ఇదే కార్యక్రమంలో పాలసీల హక్కుల బదిలీకి సంబంధించి అనధికారిక మార్కెట్‌ ఏర్పడిందని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ వెల్లడించారు. బీమా చట్టం ప్రకారం అనుమతి లేని విధానాల్లో పాలసీలను బదిలీ చేసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రీమియం ఫైనాన్సింగ్‌ కోసం అధికారిక వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. ప్రజలు తమ బీమా పాలసీలను మధ్యలోనే నిలిపివేయకుండా కొనసాగించేందుకు అవసరమైన మార్గాలను ఐఆర్‌డీఏఐ అన్వేషిస్తోందని తెలిపారు.

రుణం తీసుకునే అవ‌కాశాల‌పై ప‌రిశీల‌న‌..

ఈ నేపథ్యంలో పాలసీదారులు తమ జీవిత బీమా ప్రీమియంలను చెల్లించేందుకు రుణం తీసుకునే అవకాశాలను నియంత్రణ సంస్థ పరిశీలిస్తోంది. ఇందుకోసం పాలసీ సరెండర్‌ విలువను రుణానికి భద్రతగా ఉపయోగించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. జీవిత బీమా పాలసీ గడువు పూర్తికాకముందే, అర్హత కలిగిన పాలసీని రద్దు చేసుకున్నప్పుడు బీమా సంస్థ పాలసీదారునికి చెల్లించే మొత్తాన్ని సరెండర్‌ విలువ అంటారు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే సాధారణంగా కనీస సంఖ్యలో ప్రీమియంలు చెల్లించి ఉండాలి. పాలసీ నిబంధనల ఆధారంగా సరెండర్‌ విలువను నిర్ణయిస్తారు. సాధారణంగా పాలసీదారులు ఇప్పటివరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలతో పోలిస్తే సరెండర్‌ విలువ గణనీయంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మరో మార్గం లేకపోతే చాలామంది తమ పాలసీలను సరెండర్‌ చేస్తుంటారు. దీనివల్ల ఇప్పటికే చెల్లించిన ప్రీమియంలపై ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

స‌రెండ‌ర్‌కు బ‌దులుగా రుణం..

ఈ సమస్యను తగ్గించేందుకు చివరి దశలో చెల్లించాల్సిన ప్రీమియంలకు ఆర్థిక స‌హాయం అందించే మార్గాలను ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది. పాలసీని సరెండర్‌ చేయడానికి బదులుగా రుణం తీసుకుని మిగిలిన ప్రీమియంలను చెల్లించగలిగితే, గడువు ముగిసిన తర్వాత పాలసీ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం విజయవంతం కావాలంటే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం అత్యంత కీలకం. వడ్డీ రేట్లు అధికంగా ఉంటే రుణగ్రహీతలు పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల పాలసీని కొనసాగించడం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనం తగ్గిపోతుంది. అందువల్ల పాలసీదారులకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా తక్కువ వడ్డీ రేట్లతో రుణ సదుపాయాన్ని అందించే విధానం రూపొందించడం కీలకం కానుంది.

Advertisement
Advertisement