త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు

Bankers | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని బ్యాంకు ఖాతాదారుల భద్రత, సౌకర్యాలకు గాను అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంక్ ఎప్పటికప్పుడు బ్యాంకులకు వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తోంది. తాజాగా బ్యాంకులు తమ కస్టమర్లను ఏ విధంగానూ తప్పుదోవ పట్టించకూడదని ఆర్బీఐ కఠినంగా ఆదేశించింది.

S

Business | Published On Jun 18, 2026, 1.24 pm IST

Bankers | బ్యాంకర్లూ, జాగ్రత్త.. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు: ఆర్బీఐ కొత్త ఆదేశాలు
Advertisement

Bankers | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని బ్యాంకు ఖాతాదారుల భద్రత, సౌకర్యాలకు గాను అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంక్ ఎప్పటికప్పుడు బ్యాంకులకు వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తోంది. తాజాగా బ్యాంకులు తమ కస్టమర్లను ఏ విధంగానూ తప్పుదోవ పట్టించకూడదని ఆర్బీఐ కఠినంగా ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇటీవల ఆర్బీఐ బ్యాంకుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు కూడా తన కస్టమర్లపై ఎలాంటి స్కీమ్‌ను బలవంతంగా రుద్దకూడదు. అలాగే వారిని తప్పుదోవ పట్టించే చర్యలకు పాల్పడకూడదు. జూన్ 15న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్) సెకండ్ అమెండ్‌మెంట్ డైరెక్షన్స్, 2026 పేరుతో ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు అన్ని కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఈ ఆదేశాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త వ్యవస్థలను అమలు చేసేందుకు బ్యాంకులకు ఆరున్నర నెలల సమయం కేటాయించింది.

విధిగా రూల్స్‌ను పాటించాలి..

ఆర్బీఐ జారీ చేసిన నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో అన్ని ఎంపానెల్డ్ డీఎస్‌ఏలు (డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్), డీఎంఏలు (డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్స్) జాబితాను అందుబాటులో ఉంచాలి. ఏదైనా మార్పు జరిగితే ఏడు రోజుల్లోగా ఆ జాబితాను అప్‌డేట్ చేయాలి. బ్యాంకు శాఖల్లో బ్యాంకు సిబ్బంది, ఏజెంట్లు లేదా థర్డ్ పార్టీ ఉత్పత్తుల ప్రతినిధులను దుస్తులు లేదా గుర్తింపు కార్డుల ద్వారా స్పష్టంగా వేరు చేయాలి. డీఎస్‌ఏలు, డీఎంఏలు, వారి సబ్ ఏజెంట్లు బ్యాంకు కోడ్ ఆఫ్ కండక్ట్ ను తప్పనిసరిగా పాటిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ను బ్యాంకు వెబ్‌సైట్‌లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. ఏజెంట్లు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. కస్టమర్ అనుమతి లేకుండా వారి ఇల్లు లేదా కార్యాలయానికి వెళ్లకూడదు. అలాగే తమను బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకోవడం పూర్తిగా నిషేధం. థర్డ్ పార్టీ ఉద్యోగులు బ్యాంకు సిబ్బందిగా చెప్పుకోవడం, బ్యాంకు తరఫున హామీలు ఇవ్వడం లేదా వాగ్దానాలు చేయడాన్ని కూడా అనుమతించరు.

పరోక్షంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న బ్యాంకులు..

బ్యాంకులు తరచూ కస్టమర్లను పరోక్షంగా తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. ఉదాహరణకు, ఒక కస్టమర్ బ్యాంకుకు సాధారణ సమాచారం కోసం వెళ్లినప్పుడు అతనికి వివిధ పెట్టుబడి పథకాలు లేదా ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఆన్‌లైన్ సేవల్లో కూడా ఆకర్షణీయమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని చూపించి, వినియోగదారుల అనుమతి లేకుండానే కొన్ని ఉత్పత్తులు లేదా సేవలను అందించిన‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి అనైతిక విధానాల నుంచి కస్టమర్లను రక్షించడానికే ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement