త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా 5వ సెష‌న్‌లోనూ స్టాక్ మార్కెట్ల‌లో లాభాలు.. కొన‌సాగుతున్న సూచీల ర్యాలీ..

Stock Markets | అమెరికా-ఇరాన్ ల మ‌ధ్య శాంతి ఒప్పందం జ‌రిగిన నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం వ‌రుస సెష‌న్‌ల‌లో లాభాల్లోనే ట్రేడ‌వుతున్నాయి. గ‌త 4 రోజుల నుంచి మార్కెట్లు లాభాల్లో ఉండ‌గా, గురువారం 5వ రోజు సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

S

Business | Published On Jun 18, 2026, 4.08 pm IST

Stock Markets | వ‌రుస‌గా 5వ సెష‌న్‌లోనూ స్టాక్ మార్కెట్ల‌లో లాభాలు.. కొన‌సాగుతున్న సూచీల ర్యాలీ..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ ల మ‌ధ్య శాంతి ఒప్పందం జ‌రిగిన నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం వ‌రుస సెష‌న్‌ల‌లో లాభాల్లోనే ట్రేడ‌వుతున్నాయి. గ‌త 4 రోజుల నుంచి మార్కెట్లు లాభాల్లో ఉండ‌గా, గురువారం 5వ రోజు సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 82.30 పాయింట్లు (0.34 శాతం) పెరిగి 24,168.00 వ‌ద్ద ముగియ‌గా, బీఎస్ఈ సెన్సెక్స్ 254.36 పాయింట్లు (0.33 శాతం) లాభ‌ప‌డి 77,409.98 వ‌ద్ద స్థిర‌ప‌డింది. పెట్టుబ‌డిదారులు భారీగా విక్ర‌యిస్తున్న‌ప్ప‌టికీ మార్కెట్ పై ఉన్న న‌మ్మ‌కంతో చాలా మంది కొత్త‌గా పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీంతో అమ్మ‌కాల ఒత్తిడి ఉన్నా మార్కెట్లు ర్యాలీలోనే కొన‌సాగుతున్నాయి. ఇక విస్తృత మార్కెట్లు సైతం లాభాల్లో కొన‌సాగాయి. నిఫ్టీ బ్యాంక్ 379 పాయింట్లు పెరిగి 57,964 వ‌ద్ద‌కు చేర‌గా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 256 పాయింట్లు లాభ‌ప‌డింది.

ఊత‌మిచ్చిన బ్యాంకింగ్ స్టాక్స్‌..

గురువారం స్టాక్ మార్కెట్ల‌లో వ‌చ్చిన బ‌ల‌మైన ర్యాలీకి బ్యాంకు స్టాక్సే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. బెంచ్ మార్క్ సూచీల క‌న్నా నిఫ్టీ బ్యాంక్ సూచీ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచింది. ఇందులో ఉన్న మొత్తం 14 స్టాక్స్‌లో 11 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభ‌ప‌డ‌డం బెంచ్ మార్క్ సూచీల ర్యాలీల‌కు కార‌ణ‌మైంది. బాటా ఇండియా గ‌త 20 ఏళ్ల‌లో తొలిసారిగా అత్య‌ధిక రోజువారీ లాభాల‌తో ముగియ‌గా పెట్టుబ‌డిదారుల‌కు భారీగా లాభాలు వ‌చ్చాయి. కంపెనీ కొత్త ఎండీ, సీఈవోను నియ‌మించినందుకు గాను బాటా ఇండియా షేర్ల‌లో బుల్ ర్యాలీ క‌నిపించింది. ఒక్క రోజులోనే ఈ కంపెనీ షేర్లు ఏకంగా 16 శాతం మేర పెరిగాయి. అలాగే ఆర్‌వీఎన్ఎల్ నుంచి వ‌చ్చిన రూ.2,666 కోట్ల ఆర్డ‌ర్ వ‌ల్ల హెచ్ఎఫ్‌సీఎల్ షేర్లు 5 శాతం ఎగ‌బాక‌గా, బేసిక్ గ్రేడ్ పిగ్ ఐర‌న్‌కు వ‌చ్చిన కాంట్రాక్టుకు గాను కిర్లోస్క‌ర్ ఫెర్ర‌స్ కంపెనీ షేర్లు ఏకంగా 7 శాతం ఎగిశాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

నిఫ్టీలో మ్యాక్స్ హెల్త్‌, ఇండిగో, ట్రెంట్‌, అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ టాప్ గెయిన‌ర్లుగా నిలిచాయి. జేబీఎం ఆటో షేర్లు 2 శాతం పెర‌గ్గా, రెండింగ్ట‌న్ షేర్లు 9 శాతం పెరిగాయి. నైకా కంపెనీ షేర్లు 6 శాతం లాభ‌ప‌డ్డాయి. రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ నిఫ్టీ ఐటీ మాత్రం లాభాల‌కు బ్రేక్ వేసింది. ఆ సూచీ టాప్ లూజింగ్ సెక్టోర‌ల్ ఇండెక్స్‌గా నిలిచింది. సెన్సెక్స్‌లో మ్యాక్స్ హెల్త్ కేర్‌, ట్రెంట్‌, భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐష‌ర్ మోటార్స్ లాభప‌డ్డాయి. ఇన్ఫోసిస్‌, టాటా క‌న్‌జ్యూమ‌ర్ ప్రొడ‌క్ట్స్ లిమిటెడ్‌, మారుతి సుజుకి ఇండియా, హిందుస్థాన్ ఎరోనాటిక్స్‌, కోల్ ఇండియా, టీసీఎస్ షేర్లు న‌ష్ట‌పోయాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.33 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.91 డాల‌ర్ల వ‌ద్ద నిల‌వ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.71 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 74.16 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. ఫారెక్క్ మార్కెట్‌లో భార‌త రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 19 పైస‌లు పెరిగిన రూపాయి 94.32 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం జ‌ర‌గ‌డం, హోర్ముజ్ జ‌ల సంధి తెరుచుకోనుండ‌డం, చ‌మురు ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఈక్విటీ మార్కెట్లు గ‌త 5 సెష‌న్‌ల నుంచి లాభాల్లో కొన‌సాగుతున్నాయి.

Advertisement
Advertisement