త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple CEO | టెక్ దిగ్గ‌జం యాపిల్‌కు కొత్త బాస్‌.. కుక్ ప‌ద‌వీ విర‌మ‌ణ‌, ఆయ‌న వార‌సుడిగా జాన్ టెర్న‌స్‌..

Apple CEO | ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ లో భారీ నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ ప్రకటించిన ప్రకారం ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న తన పదవికి వీడ్కోలు పలుకనున్నారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

S

Business | Published On Apr 21, 2026, 10.07 am IST

Apple CEO | టెక్ దిగ్గ‌జం యాపిల్‌కు కొత్త బాస్‌.. కుక్ ప‌ద‌వీ విర‌మ‌ణ‌, ఆయ‌న వార‌సుడిగా జాన్ టెర్న‌స్‌..
Advertisement

Apple CEO | ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ లో భారీ నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ ప్రకటించిన ప్రకారం ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న తన పదవికి వీడ్కోలు పలుకనున్నారు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 15 సంవత్సరాల పాటు సీఈవోగా సేవలందించిన కుక్ స్థానంలో హార్డ్‌వేర్ విభాగం హెడ్ జాన్ టెర్న‌స్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పును కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీన్ని దీర్ఘకాల వారసత్వ ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కుక్ వ‌చ్చే సెప్టెంబ‌ర్‌ వరకు సీఈవోగా కొనసాగుతూ, టెర్నస్‌తో కలిసి బాధ్యతల మార్పిడిని సమన్వయం చేస్తారు.

350 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 4 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు..

కాగా యాపిల్ సంస్థ మాజీ స‌హ‌-వ్య‌వ‌స్థాప‌క సీఈవో స్టీవ్ జాబ్స్ తర్వాత కంపెనీ చరిత్రలో దీన్ని అతిపెద్ద నాయకత్వ మార్పుగా భావిస్తున్నారు. 2011లో జాబ్స్ తరువాత బాధ్యతలు స్వీకరించిన కుక్ నేతృత్వంలో యాపిల్ ఐఫోన్‌కు మాత్రమే పరిమితం కాకుండా వియ‌రబుల్స్, సర్వీసులు, కస్టమ్ చిప్స్ వంటి విభాగాల్లో విస్తరించింది. కంపెనీ మార్కెట్ విలువ కూడా సుమారు 350 బిలియన్ డాలర్ల నుండి 4 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. తన అనుభవంపై కుక్ స్పందిస్తూ యాపిల్ సంస్థ‌ను నడిపించడం త‌న‌ జీవితంలో అత్యంత గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. త‌న‌కు యాపిల్‌పై అపారమైన ప్రేమ ఉంద‌ని, జాన్ టెర్నస్ ఇంజనీర్‌గా, బ్రెయిన్‌, ఇన్నోవేటర్‌గా నాయకత్వానికి కావాల్సిన విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు. భవిష్యత్తులో యాపిల్‌ను నడిపించేందుకు ఆయనే సరైన వ్యక్తి అని తెలిపారు.

బోర్డు స‌భ్యుడిగా చేర‌నున్న టెర్న‌స్‌..

టెర్నస్ కూడా తన బాధ్యతలపై స్పందిస్తూ ఈ అవకాశానికి తాను ఎంతో కృతజ్ఞుడిన‌ని అన్నారు. యాపిల్ విలువలు, దృష్టిని కొనసాగిస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తాన‌ని పేర్కొన్నారు. కాగా టెర్న‌స్‌ సెప్టెంబర్ 1 నుంచి బోర్డులో సభ్యుడిగా కూడా చేరనున్నారు. 25 సంవత్సరాలుగా యాపిల్‌లో పనిచేస్తున్న టెర్నస్ ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అలాగే పరికరాల దృఢత్వం, రిపేర్ సౌలభ్యం, పర్యావరణానికి అనుకూలమైన తయారీ విధానాలపై కూడా ఆయన ప్రత్యేకంగా పనిచేశారు. ఇక బోర్డు మార్పుల విషయానికి వస్తే గత 15 సంవత్సరాలుగా నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న ఆర్థ‌ర్ లెవిన్స‌న్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా మారనున్నారు. కుక్ నాయకత్వం యాపిల్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మార్చిందని ఆయన ప్రశంసించారు.

టెర్న‌స్ ముందున్న అతి పెద్ద స‌వాళ్లు..

1998లో యాపిల్‌లో చేరిన కుక్ సీఈవోగా ఉన్న సమయంలో Apple Watch, AirPods, Apple Vision Pro వంటి కీలక ఉత్పత్తులను విడుదల చేయడంతోపాటు Apple Pay, Apple TV+, Apple Music వంటి సేవలను విస్తరించారు. కాగా ఈ మార్పు స్మార్ట్‌ఫోన్‌లకు మించి కొత్త వృద్ధి అవకాశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ వంటి కీలక దశలో యాపిల్ వ్యూహాన్ని ప్రభావితం చేయనున్న కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జాన్ టెర్న‌స్ ముందు ప్ర‌స్తుతం పెద్ద స‌వాళ్లే ఉన్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టెక్ ప్ర‌పంచంలో ఏఐ రంగంలో విప‌రీత‌మైన పోటీ ఉంద‌ని, యాపిల్ ఈ విష‌యంలో చాలా వెనుకబ‌డి ఉంద‌ని, ఈ రంగంలో స‌వాళ్ల‌ను టెర్న‌స్ ఎలా ఎదుర్కొంటారు.. అన్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని అంటున్నారు. అలాగే ఐఫోన్లు కాకుండా ఇత‌ర కొత్త ఉత్ప‌త్తుల‌ను త‌న‌దైన ముద్ర‌తో లాంచ్ చేయ‌డం, చైనాలో యాపిల్ స‌ప్లై చెయిన్ స‌మ‌స్య‌లు వంటివి టెర్న‌స్ ముందున్న అతి పెద్ద స‌వాళ్ల‌ని అంటున్నారు. మ‌రి టెర్న‌స్ వాటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Advertisement
Advertisement