త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon India | అమెజాన్ ఆస‌క్తిక‌ర స‌ర్వే.. ఫోన్ల‌లో ఏఐ ఫీచ‌ర్ల‌ను కోరుకుంటున్న యూజ‌ర్లు..

Amazon India | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తొలిసారిగా నిర్వహించిన బెస్ట్ ఇన్ టెక్ సర్వే ఫలితాలను వెల్లడించింది. జూలైలో అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఈ సర్వేలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, గృహోపకరణాలు, వియ‌రబుల్స్, ఆడియో ఉత్పత్తులకు సంబంధించి 40వేల మందికి పైగా స్పందించారు.

S

Business | Published On Aug 21, 2026, 12.35 pm IST

Amazon India | అమెజాన్ ఆస‌క్తిక‌ర స‌ర్వే.. ఫోన్ల‌లో ఏఐ ఫీచ‌ర్ల‌ను కోరుకుంటున్న యూజ‌ర్లు..
Advertisement

Amazon India | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తొలిసారిగా నిర్వహించిన బెస్ట్ ఇన్ టెక్ సర్వే ఫలితాలను వెల్లడించింది. జూలైలో అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఈ సర్వేలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, గృహోపకరణాలు, వియ‌రబుల్స్, ఆడియో ఉత్పత్తులకు సంబంధించి 40వేల మందికి పైగా స్పందించారు. సర్వే ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు సమయంలో 82 శాతం మంది వినియోగదారులు ఏఐ ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్ల‌డైంది. అయితే ఫోన్ కొనుగోలులో పనితీరు, వేగం, బ్యాటరీ లైఫ్, కెమెరా నాణ్యత వంటి అంశాలు కూడా కీలకంగా ఉన్న‌ట్లు తేలింది.

ఏఐ ఫీచ‌ర్ టాప్‌..

చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు తాము కొనే ఫోన్ల‌లో ఏఐ ఫీచ‌ర్లు ఉన్నాయా, లేదా అనే విష‌యాన్ని ప‌రిశీలించి మ‌రీ తీసుకుంటున్నారు. సంద‌ర్భానుసార ఏఐ స‌హాయం కోరుకున్న వారి శాతం 25గా న‌మోదైంది. యూజ‌ర్ ఫోన్‌లో ఏం చేస్తున్నారో అర్థం చేసుకుని, ఆ స‌మ‌యంలో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ను ఏఐ స్వ‌యంగా సూచించ‌డం లేదా యూజ‌ర్‌కు బ‌దులుగా ప‌నిచేయ‌డం వంటి ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్లు కోరుకుంటున్నారు. సందర్భానుసార సహాయం అత్యధికంగా కోరుకున్న ఏఐ ఫీచ‌ర్‌గా నిలిచింది. 25 శాతం మంది దీనిని ఎంపిక చేశారు. వినియోగదారు ఫోన్‌లో ఏం చేస్తున్నారో అర్థం చేసుకుని, ఆ సమయంలో అవసరమైన చర్యను ఏఐ స్వయంగా సూచించడం లేదా స్క్రీన్‌పై ఉన్న అంశాన్ని వెతకడం, వినియోగదారు అడగకముందే సమాధానం సూచించడం వంటి ఫీచర్లను సందర్భానుసార సహాయంగా పేర్కొన్నారు. జెనరేటివ్ ఫొటో ఎడిటింగ్‌ను 18 శాతం మంది, విజువల్ సెర్చ్‌ను 17 శాతం మంది, అడాప్టివ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ను 11 శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

87 శాతం మందికి ప‌నితీరు, వేగం..

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు నిర్ణయంలో 87 శాతం మందికి పనితీరు, వేగం అత్యంత ప్రభావవంతమైన అంశాలుగా ఉన్నాయి. ఆ తర్వాత 79 శాతంతో బ్యాటరీ లైఫ్, 77 శాతంతో కెమెరా నాణ్యత నిలిచాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో మెరుగుపడాలని వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న అంశం కూడా బ్యాటరీ లైఫే. 22 శాతం మంది బ్యాటరీ లైఫ్‌ను పేర్కొనగా, 17 శాతం మంది కెమెరా నాణ్యతను, 12 శాతం మంది పనితీరును మెరుగుపరచాలని కోరుకున్నారు. తదుపరి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కోసం రూ.25వేల నుంచి రూ.50వేల ధరల పరిధిని 42 శాతం మంది పరిశీలిస్తున్నట్లు సర్వే తెలిపింది. రూ.15వేల కంటే తక్కువ ధరల ఫోన్లను 7 శాతం మంది, రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య ధరలను 19 శాతం మంది, రూ.25వేల నుంచి రూ.35వేల మధ్య ధరలను 21 శాతం మంది, రూ.35వేల నుంచి రూ.50వేల మధ్య ధరలను 21 శాతం మంది ఎంపిక చేశారు. రూ.50వేల నుంచి రూ.75వేల మధ్య ధరల ఫోన్లను 15 శాతం మంది, రూ.75వేల కంటే ఎక్కువ ధరల ఫోన్లను 17 శాతం మంది పరిశీలిస్తున్న‌ట్లు చెప్పారు.

రూ.50వేల క‌న్నా ఎక్కువ ధ‌ర‌కే..

మొత్తం 32 శాతం మంది రూ.50వేలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. రూ.75వేల‌ కంటే ఎక్కువ ధరల ఫోన్లను పరిశీలిస్తున్న వారిలో మెట్రో నగరాల వినియోగదారులు 18 శాతం, టియ‌ర్-2 నగరాల వారు 17 శాతం, టియ‌ర్-3 నగరాల వారు 15 శాతంగా ఉన్నారు. 54 శాతం మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. అయితే 48 శాతం మంది వచ్చే మూడు నెలల్లోనే తమ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్న‌ట్లు తేలింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు నిర్ణయంలో రివ్యూలు, రేటింగ్‌లకు కూడా గణనీయమైన ప్రాధాన్యం ఉంది. 47 శాతం మంది వీటిని ముఖ్యమైన అంశంగా పేర్కొనగా, ధర, డీల్స్‌కు 35 శాతం మంది ప్రాధాన్యం ఇచ్చారు.

ఇక‌పై వ‌రుస‌గా స‌ర్వేలు..

అమెజాన్ ఇండియా నిర్వహించిన బెస్ట్ ఇన్ టెక్ సర్వేలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, గృహోపకరణాలు, వియ‌ర‌బుల్స్, ఆడియో ఉత్పత్తులను కవర్ చేశారు. ఈ సర్వే ఫలితాలను వ‌చ్చే సెప్టెంబర్ లో తిరిగి నిర్వహించనున్న రెండో ఎడిషన్ బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్ విభాగాల రూపకల్పనకు ఉపయోగించనున్నారు. ఇది వరుసగా విడుదల చేయనున్న సర్వే ఫలితాల్లో తొలి విడత మాత్రమేనని అమెజాన్ ఇండియా తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలను సంస్థ వెల్లడించనుంది.

Advertisement
Advertisement