త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon | ప్ర‌ధాని మోదీని క‌లిసిన అమెజాన్ సీఈవో.. భార‌త్‌లో మ‌రో 13 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు..

Amazon | ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన పెట్టుబడులను మరింత విస్తరించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా, 2030 నాటికి దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్ల‌ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

S

Business | Published On Jun 25, 2026, 2.35 pm IST

Amazon | ప్ర‌ధాని మోదీని క‌లిసిన అమెజాన్ సీఈవో.. భార‌త్‌లో మ‌రో 13 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు..
Advertisement

Amazon | ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన పెట్టుబడులను మరింత విస్తరించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా, 2030 నాటికి దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్ల‌ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. గ‌తేడాది డిసెంబర్ లో ప్రకటించిన 35 బిలియన్ డాలర్ల పెట్టుబడికి అదనంగా ఈ 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేరడంతో, 2010 నుంచి 2030 వరకు భారత్‌లో అమెజాన్ మొత్తం పెట్టుబడులు 88 బిలియన్ డాలర్లకు పైగా చేరనున్నాయని సంస్థ వెల్లడించింది.

దేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబ‌డిదారుగా..

ఈ తాజా పెట్టుబడితో అమెజాన్ భారత్‌లో అతిపెద్ద గ్లోబల్ ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల పెట్టుబడిదారుల్లో ఒకటిగా నిలవనుంది. అలాగే దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా, ఈ-కామర్స్ ఎగుమతులకు ప్రధాన మద్దతుదారుగా, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆండీ జస్సీ మాట్లాడుతూ పదేళ్ల క్రితం అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిందని, అప్పటి నుంచి వినియోగదారులు, విక్రేతలు, డెవలపర్లు, స్టార్టప్‌లు, సంస్థలకు వివిధ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని చెప్పారు. భారత్‌లో అమెజాన్ వ్యాపార విస్తరణ దేశ ప్రాధాన్యతలకు అనుగుణంగానే సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఏఐ అందుబాటును ప్రజలకు విస్తరించడం, చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం, ఉద్యోగాలు సృష్టించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అంశాలపై సంస్థ దృష్టి సారించిందని తెలిపారు.

మ‌రో 48 బిలియ‌న్ డాల‌ర్లకు పైగా..

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తమ వ్యాపార అవసరాల కోసం 48 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆండీ జ‌స్సీ వెల్లడించారు. అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన విజన్ తమకు స్ఫూర్తినిస్తోందని, భారత్ అభివృద్ధి ప్రయాణంలో దీర్ఘకాలిక భాగస్వామిగా కొనసాగుతామని చెప్పారు. ఈ ప్రణాళికలో భాగంగా 2030 నాటికి 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడం, 80 బిలియన్ డాలర్ల విలువైన ఈ-కామర్స్ ఎగుమతులకు తోడ్పాటు అందించడం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు అందించడం, అలాగే 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ఆధారిత అవకాశాలను చేరవేయాలని అమెజాన్ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. 2026 నుంచి 2030 మధ్య పెట్టనున్న మొత్తం 48 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో సుమారు 21 బిలియన్ డాలర్లు ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికే వెచ్చించనుంది. ఈ నిధులతో ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఏడబ్ల్యూఎస్ రీజియన్లను విస్తరించి, అధునాతన ఏఐ, క్లౌడ్ సేవలను మరింత బలోపేతం చేయనుంది.

ఏడ‌బ్ల్యూఎస్ రీజియ‌న్‌ల‌తో అత్యాధునిక ఏఐ సేవ‌లు..

ఈ రెండు ఏడబ్ల్యూఎస్ రీజియన్ల ద్వారా వినియోగదారులు తమ డేటాను భారత్‌లోనే సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అధిక పనితీరు కలిగిన ట్రెయినియమ్ చిప్స్, అమెజాన్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫరెన్స్ ఇంజిన్ అమెజాన్ బెడ్ రాక్ వంటి అత్యాధునిక ఏఐ, క్లౌడ్ సాంకేతికతలను వినియోగించుకునే అవకాశం లభిస్తుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో లక్షలాది సంస్థలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే ఏడబ్ల్యూఎస్‌ను ఉపయోగిస్తూ ఏఐ ఆధారిత సేవలను అభివృద్ధి చేసి అమలు చేస్తున్నాయి. వీటిలో నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివరీ, ఫిజిక్స్ వాలా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వినియోగదారుల డేటా ఎక్కడ నిల్వ ఉండాలి, దానికి ఎవరు ప్రాప్యత పొందాలి, ఎలా భద్రపరచాలి అనే అంశాలపై పూర్తి నియంత్రణ కస్టమర్లకే ఉండేలా తమ క్లౌడ్ మౌలిక సదుపాయాలను రూపొందించామని అమెజాన్ పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement