త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Post | సెప్టెంబర్ 1 నుంచి పోస్టాఫీస్ ఖాతాదారులకు కొత్త రూల్.. మొబైల్ లింక్ లేకపోతే లావాదేవీలు బంద్..

India Post | దేశంలోని గ్రామీణ పోస్టాఫీస్ బ్యాంకింగ్ సేవల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. పోస్ట‌ల్‌ శాఖ గ్రామీణ బ్రాంచ్ పోస్టాఫీస్‌లలో బ్యాంకింగ్ సేవలను మరింత డిజిటల్‌గా మార్చేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

S

Business | Published On Jun 25, 2026, 1.54 pm IST

India Post | సెప్టెంబర్ 1 నుంచి పోస్టాఫీస్ ఖాతాదారులకు కొత్త రూల్.. మొబైల్ లింక్ లేకపోతే లావాదేవీలు బంద్..
Advertisement

India Post | దేశంలోని గ్రామీణ పోస్టాఫీస్ బ్యాంకింగ్ సేవల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. పోస్ట‌ల్‌ శాఖ గ్రామీణ బ్రాంచ్ పోస్టాఫీస్‌లలో బ్యాంకింగ్ సేవలను మరింత డిజిటల్‌గా మార్చేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డ్రీమ్ మొబైల్ యాప్ ద్వారా జరిగే బ్యాంకింగ్ లావాదేవీల్లో బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సెప్టెంబర్ 1 నుంచి పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పీఓఎస్‌బీ) ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ చేయని వినియోగదారులు డ్రీమ్ యాప్ ద్వారా ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో గ్రామీణ పోస్టల్ బ్యాంకింగ్ వినియోగదారులకు ఇది కీలక మార్పుగా మారనుంది. ఇప్పటికే పీఓఎస్‌బీ ఖాతాలకు మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరిగా ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు దానికి ప్రత్యక్ష పరిమితులు లేవు. అయితే తాజా ఉత్తర్వులతో మొబైల్ నంబర్ నమోదు చేయని ఖాతాలపై నేరుగా ప్రభావం చూపేలా నిర్ణయం తీసుకుంది.

మొబైల్ నంబ‌ర్ న‌మోదు త‌ప్ప‌నిస‌రి..

సెప్టెంబర్ 1 నుంచి డ్రీమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే ఆధార్ ధ్రువీకరణతో కూడిన డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ వంటి అన్ని లావాదేవీలు మొబైల్ నంబర్ నమోదు చేయని ఖాతాలకు నిలిపివేస్తారు. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్‌ను బలోపేతం చేయడం, లావాదేవీల అలర్ట్‌లు సకాలంలో అందించడం, మోసాలను అరికట్టడం వంటి లక్ష్యాలను పోస్టుల శాఖ ముందుకు తీసుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించడంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా బ్రాంచ్ పోస్టాఫీస్‌లలో తొలిసారిగా ఈ-కేవైసీ ఆధారిత బ్యాంకింగ్ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఇకపై వినియోగదారులు సంప్రదాయ పేపర్ స్లిప్‌లు నింపాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ ధ్రువీకరణతో సాధారణ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.

అనేక సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు..

ఈ కొత్త సేవల కింద బయోమెట్రిక్ ధ్రువీకరణతో సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), సుకన్య సమృద్ధి ఖాతాల్లో రూ.50వేల వరకు నగదు జమ చేయవచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతాల నుంచి విత్‌డ్రాయల్ స్లిప్ అవసరం లేకుండా రూ.20వేల వరకు నగదు ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఖాతాదారుల వివరాలను కూడా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రొఫైల్‌గా మార్చే అవకాశం కల్పించారు. అయితే ఈ సౌకర్యాలు ప్రస్తుతం సింగిల్ హోల్డర్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి. జాయింట్ ఖాతాలు, మైనర్ ఖాతాలను ఈ-కేవైసీ లావాదేవీల పరిధిలోకి తీసుకురాలేదు. మరో ముఖ్యమైన మార్పుగా పోస్టుల శాఖ బీఓ ఇంటర్-ఆపరబిలిటీని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఖాతాదారులు తమ ఖాతా ఉన్న అదే బ్రాంచ్ పోస్టాఫీస్‌లో మాత్రమే లావాదేవీలు నిర్వహించాల్సి వచ్చేది. కానీ కొత్త ఆధార్ ధ్రువీకరణ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న వినియోగదారులు దేశంలోని ఏ బ్రాంచ్ పోస్టాఫీస్ నుంచైనా తమ లావాదేవీల‌ను నిర్వహించుకోవ‌చ్చు.

ఇత‌ర బ్రాంచ్‌ల్లోనూ సేవ‌లు..

ఈ మార్పు వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, వలస కార్మికులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం క‌లుగుతుందని పోస్టుల శాఖ భావిస్తోంది. తమ స్వగ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇతర ప్రాంతాల బ్రాంచ్ పోస్టాఫీస్‌ల నుంచే సేవలు పొందే అవకాశం లభిస్తుంది. కొత్త ఈ-కేవైసీ విధానంలో ఖాతాదారుల పేరు, చిరునామా, లింగం, పుట్టిన తేదీ వంటి వివరాలు బయోమెట్రిక్ సమ్మతి తర్వాత నేరుగా యూఐడీఏఐ డేటాబేస్ నుంచి తీసుకుంటారు. ఈ వివరాలను పోస్టల్ సిబ్బంది స్వయంగా సవరించే అవకాశం ఉండదు. ఒకవేళ ఆధార్‌లోని వివరాలు అసంపూర్ణంగా ఉన్నా లేదా ఖాతా వివరాలతో సరిపోలకపోయినా ఆ ఖాతాను ఈ-కేవైసీ స్థితికి మార్చరు. ముందుగా వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారు ఇప్పటివరకు అమల్లో ఉన్న సంప్రదాయ పేపర్ ఆధారిత లావాదేవీలనే కొనసాగించాల్సి ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement