త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Effect | ప్రమాదంలో 60లక్షల కోడింగ్‌ ఉద్యోగుల భవిష్యత్‌..!

AI Effect | దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభంగా నిలిచిన ఐటీ సేవల రంగం ప్రస్తుతం కొత్త దిశలో సాగుతోంది. రూ.18 లక్షల కోట్లకుపైగా విలువైన ఐటీ ఎగుమతులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) కారణంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. సుమారు 60 లక్షల కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

P

Business | Published On Feb 28, 2026, 5.02 pm IST

AI Effect | ప్రమాదంలో 60లక్షల కోడింగ్‌ ఉద్యోగుల భవిష్యత్‌..!
Advertisement
  • ఏఐతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న ఐటీరంగం
  • రాబోయే దశాబ్దమంతా ఏఐ టోకెన్‌దే..
  • రూ.2లక్షల కోట్లతో టోకెన్‌ హబ్‌ ఏర్పాటు
  • ఈ హబ్‌ భారత్‌కు ఊరట కలిగించేనా?

AI Effect | దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభంగా నిలిచిన ఐటీ సేవల రంగం ప్రస్తుతం కొత్త దిశలో సాగుతోంది. రూ.18 లక్షల కోట్లకుపైగా విలువైన ఐటీ ఎగుమతులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) కారణంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. సుమారు 60 లక్షల కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ (Tata Consultancy Services) ఏఐని స్వాగతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన కంపెనీ సమావేశంలో టీసీఎస్ సీఈవో కే కృతివాసన్ ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

రాబోయే దశాబ్దం ఏఐ టోకెన్‌దే..

గత 25 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ సేవలే భారత ఐటీ రంగానికి గుర్తింపును తెచ్చాయి. రాబోయే దశాబ్దం ‘ఏఐ టోకెన్’ ఆధారిత సర్వీసెస్‌ కాలంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణ కోడింగ్ పనులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. ఏఐ ఆల్గోరిథమ్స్‌ స్వయంగా కోడ్ రాయగల స్థాయికి చేరడంతో, కేవలం సింటాక్స్ రాయడానికి వినియోగదారులు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గింది. ఇకపై ‘ఇంటెలిజెన్స్ ఆడిట్స్, డేటా విశ్లేషణ, ఏఐ పర్యవేక్షణ’ వంటి ఉన్నత నైపుణ్యాలకే డిమాండ్ పెరుగనుంది. టీసీఎస్ సీఈవో చెప్పినట్లుగా పని వేగం, సామర్థ్యం పెరగడం ముఖ్యమని, తాత్కాలికంగా ఆదాయంపై ప్రభావం పడినా భవిష్యత్తు అవసరాల కోసం ఈ మార్పు అవసరం అని సంస్థ భావిస్తోంది. టీసీఎస్‌ పోటీ కంపెనీ అయిన విప్రో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అయితే, ఏఐ ప్రభావంతో సంప్రదాయ మానవ ఆధారిత ఐటీ మోడల్ దెబ్బతింటుందన్న ఆందోళన పెట్టుబడిదారుల్లో పెరుగుతోంది. ఫిబ్రవరిలో నిఫ్టీ ఐటీ సూచీ సుమారు 19–21 శాతం పడిపోయింది. ఐటీ రంగ మార్కెట్ విలువ సుమారు 68.6 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. మొత్తం మీద రూ.6.4 లక్షల కోట్లకుపైగా మార్కెట్ క్యాప్ పతనం కావడం ఈ రంగంలో తీవ్రమైన ఆందోళనకు కారణమైంది.

60లక్షల కోడింగ్‌ ఉద్యోగాలు..

దేశంలో సుమారు 60 లక్షల కోడింగ్ ఉద్యోగాలు ఉన్నట్లు అంచనా. ఏఐ విస్తరణతో వీటిలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్ వంటి దిగ్గజాలు లాభాలను నిలబెట్టుకునే క్రమంలో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నప్పటికీ, గతంలోకంటే పెద్ద స్థాయిలో ఉద్యోగాలు సృష్టించకపోవచ్చు. దేశంలోని 37.5 కోట్ల యువతకు ఇది విధానపరమైన సవాల్‌గా మారుతోంది. కేంద్రం దేశాన్ని ఏఐ టోకెన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. విదేశీ కంపెనీలు భారత్‌లో ఏఐ ఇన్‌ఫరెన్స్ హబ్‌లు, టోకెన్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే 20 ఏళ్ల పన్ను మినహాయింపు పొందుతాయి. తక్కువ ధరకే సౌరశక్తి అందుబాటులో ఉండడం భారత్‌కు ప్రధాన బలం. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌కు 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం 2.4 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు ఆఫర్ చేసింది. 2030 నాటికి భారత్ సంవత్సరానికి 12 క్వాడ్రిలియన్ టోకెన్లు ఉత్పత్తి చేయగలదని అంచనా. వీటిలో 80 శాతం ఎగుమతి చేస్తే సుమారు 19 బిలియన్ డాలర్ల (రూ.1.74 లక్షల కోట్లు) ఆదాయం సాధ్యమని నివేదికలు సూచిస్తున్నాయి.

వ్యూహాత్మకంగా ముందుకు సాగితేనే..

స్టార్టప్ సంస్థ అంథ్రోపిక్‌ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్ గ్లోబల్ ఐటీ రంగంలో పోటీని పెంచాయి. యూఎస్ టారిఫ్‌లు, హెచ్1బీ వీసా సమస్యలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ఐటీ కంపెనీలకు ఇది మరింత సవాల్ మారుతోంది. ఫిబ్రవరిలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.11 వేల కోట్లకుపైగా విలువైన ఐటీ షేర్లను విక్రయించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ‘విద్యుత్ వినియోగానికి బదులుగా హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ చిప్‌లలో 5 శాతం భారత్‌కు అందించేలా విధానాలు రూపొందించాలి. 500 విశ్వవిద్యాలయాలకు జాతీయ పరిశోధన క్లౌడ్ ఏర్పాటు చేయాలి. యువతను కేవలం కోడ్ డెవలపర్లుగా కాకుండా, ఏఐ సూపర్వైజర్లు, ఆటోనమస్ ఏజెంట్స్, రోబోట్స్ నిర్వహణలో నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది’ అని సూచిస్తున్నారు. భారత ఐటీ రంగం మార్పులను స్వీకరించి వ్యూహాత్మకంగా ముందుకు సాగితే, భారత్ నిజమైన ‘ఏఐ టోకెన్ హబ్’గా అవతరిస్తుందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also :

Indians | 2025లో భార‌తీయులు ఎక్కువ‌గా వెళ్లిన దేశాలు ఇవే.. టాప్ 3లో ఉన్న‌వి ఏవి అంటే..?

Gold Loans | భారీ స్థాయిలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్‌.. కార‌ణాలు ఇవే..

Advertisement
Advertisement