త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhar Changes | ఆధార్ వివ‌రాల‌ను ఎన్నిసార్లు మార్చుకోవ‌చ్చు.. ప‌రిమితులు ఎలా ఉన్నాయి..?

Aadhar Changes | ఆధార్ కార్డుల్లోని వివ‌రాల‌ను మార్చుకోవాల‌ని చూస్తున్నారా..? అయితే UIDAI స‌ద‌వకాశాన్ని క‌ల్పిస్తోంది. జూన్ 14 వ‌ర‌కు 17 ఏళ్ల లోపు వారికి ఆధార్‌ను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. 17 ఏళ్ల‌కు పైబ‌డిన వారు మాత్రం స్వ‌ల్ప రుసుముతో ఆధార్‌లో వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు.

S

Business | Published On Mar 29, 2026, 10.08 am IST

Aadhar Changes | ఆధార్ వివ‌రాల‌ను ఎన్నిసార్లు మార్చుకోవ‌చ్చు.. ప‌రిమితులు ఎలా ఉన్నాయి..?
Advertisement

Aadhar Changes | ఆధార్ కార్డుల్లోని వివ‌రాల‌ను మార్చుకోవాల‌ని చూస్తున్నారా..? అయితే UIDAI స‌ద‌వకాశాన్ని క‌ల్పిస్తోంది. జూన్ 14 వ‌ర‌కు 17 ఏళ్ల లోపు వారికి ఆధార్‌ను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. 17 ఏళ్ల‌కు పైబ‌డిన వారు మాత్రం స్వ‌ల్ప రుసుముతో ఆధార్‌లో వివ‌రాల‌ను మార్చుకోవ‌చ్చు. ఆధార్‌లో ఉండే పుట్టిన తేదీ, పేరు, చిరునామా, ఫొటో త‌దిత‌ర వివ‌రాల‌ను మై ఆధార్ పోర్ట‌ల్ లో మార్చుకోవ‌చ్చు. అలాగే ఆధార్ సేవా కేంద్రాల్లోనూ ఈ వివ‌రాల‌ను అప్ డేట్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ప్ర‌జ‌లు త‌మ‌కు స‌మీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆయా వివ‌రాల‌ను అప్‌డేట్ లేదా క‌రెక్ష‌న్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను కేంద్రాల్లో ఉండే ఆయా వివ‌రాల‌కు చెందిన అప్లికేష‌న్ ఫామ్‌ల‌ను నింపి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

పుట్టిన తేదీని మార్చాల‌నుకుంటే..

ఆధార్ లో పుట్టిన తేదీని మార్చాల‌ని అనుకుంటే సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌తోపాటు కేంద్రంలో బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంత‌రం పౌరుల‌కు ర‌శీదు ఇస్తారు. త‌రువాత పుట్టిన తేదీ అప్‌డేట్ అయిందీ లేనిదీ ఆ ర‌శీదులో ఉండే నంబ‌ర్‌తో ట్రాక్ చేసి స్థితిని తెలుసుకోవ‌చ్చు. ఆధార్ అప్‌డేట్ అయ్యాక UIDAI పోర్ట‌ల్ నుంచి మ‌ళ్లీ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అందులోనే పీవీసీ కార్డును కూడా పొంద‌వ‌చ్చు. సాధారణంగా ఈ ప్ర‌క్రియ‌కు క‌నీసం 7 నుంచి 10 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో పుట్టిన తేదీ మార్పు త్వ‌ర‌గానే పూర్త‌య్యే అవ‌కాశాలు ఉంటాయి.

ఏయే వివ‌రాల‌కు ఎన్ని ప‌రిమితులు..

UIDAI తెలిపిన ప్ర‌కారం ఆధార్‌లో పౌరులు త‌మ పేరును కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే మార్చుకునేందుకు వీలుంటుంది. పుట్టిన తేదీని కేవ‌లం ఒక‌సారి మాత్ర‌మే మార్చుకోవ‌చ్చు. అయితే త‌రువాత మార్పు కావాలంటే మాత్రం స‌మీపంలో ఉండే UIDAI రీజ‌న‌ల్ ఆఫీస్‌ను సంద‌ర్శించి పుట్టిన తేదీ మార్పుకు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌లో జెండ‌ర్ (లింగం)ను ఒక‌సారి మార్చుకోవ‌చ్చు. ఫొటోను మాత్రం కావ‌ల్సిన‌న్ని సార్లు మార్చుకోవ‌చ్చు. అందుకు ఎలాంటి పరిమితి లేదు. అయితే ఫొటో మార్పిడి కావాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఆన్ లైన్‌లో ఈ సౌక‌ర్యం లేదు. ఇక అడ్ర‌స్‌ను కూడా కావ‌ల్సిన‌న్ని సార్లు మార్చుకోవ‌చ్చు. ఇందుకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.

అడ్ర‌స్ మార్చాల‌నుకుంటే..

ఆధార్ లో అడ్ర‌స్ వివ‌రాల‌ను మార్చేందుకు గాను మై ఆధార్ పోర్ట‌ల్ ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో లాగిన్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసిన‌ అనంత‌రం స్క్రీన్‌పై ఆధార్ నంబ‌ర్‌, క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి లాగిన్ అయ్యాక డ్యాష్ బోర్డులో ఆధార్ స‌ర్వీస్ ఆప్ష‌న్‌ల నుంచి అడ్ర‌స్ చేంజ్ రిక్వెస్ట్‌ను ఎంచుకోవాలి. అక్క‌డ చూపించే వివ‌రాలు స‌రి చూసుకున్న అనంత‌రం బ‌ట‌న్‌పై క్లిక్ చేసి సంబంధిత ధ్రువ ప‌త్రాల‌ను అప్ లోడ్ చేయాలి. త‌రువాత పేమెంట్ పూర్తి చేయ‌గానే ఓ సీరియ‌ల్ నంబ‌ర్ వ‌స్తుంది. దాంతో ఆధార్ అడ్ర‌స్ అప్‌డేట్ స్టేట‌స్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. అడ్ర‌స్ అప్‌డేట్ అవ‌గానే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ప‌రిమితులు దాటితే..

అయితే పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్ వివ‌రాల‌ను ప‌రిమితి దాటిన త‌రువాత మార్చాల‌నుకుంటే ఆధార్ రీజన‌ల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదా స‌మీపంలో ఉన్న ఆధార్ కేంద్రంలో ప్ర‌త్యేకంగా మెయిల్ లేదా పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాలి. ఎందుకు మార్చాల్సి వ‌స్తుందో కార‌ణాల‌ను స్ప‌ష్టంగా వివ‌రించాలి. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను, ఆధార్ వివ‌రాల‌ను, యూఆర్ఎన్ స్లిప్‌ను జ‌త చేసి help@uidai.gov.in అనే ఐడీకి మెయిల్ పంపించాలి. అధికారులు అన్నీ త‌నిఖీ చేసి మార్పుల‌కు అనుమ‌తిస్తారు.

ఆధార్ కేంద్రాల‌ను ఇలా గుర్తించండి..

దేశ‌వ్యాప్తంగా ఆధార్ కేంద్రాలు ఎక్క‌డ ఉన్నాయో తెలుసుకునేందుకు భువ‌న్ అనే పోర్ట‌ల్ అందుబాటులో ఉంది. అందులో ఎడ‌మ వైపు నాలుగు డ్రాప్ డౌన్ ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. ద‌గ్గ‌ర్లోని కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్ష‌న్‌లలో సెంట‌ర్స్ నియ‌ర్‌బై ని ఎంపిక చేసుకోవాలి. స‌మీపంలో ఉండే కేంద్రాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. పిన్ కోడ్‌ను ఎంట‌ర్ చేయ‌డం ద్వారా పౌరులు త‌మకు స‌మీపంలో ఉండే ఆధార్ కేంద్రాల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. టూల్స్ అనే సెక్ష‌న్‌పై క్లిక్ చేసి ద‌గ్గ‌ర్లోని కేంద్రానికి మార్గాన్ని చెక్ చేసుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌లే గూగుల్ కూడా త‌న మ్యాప్స్ యాప్‌లో ఆధార్ కేంద్రాల‌ను పిన్ చేస్తోంది. అందువ‌ల్ల గూగుల్ మ్యాప్స్‌లోనూ ఈ కేంద్రాల వివ‌రాలు తెలుస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement