త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Service Charge | క‌స్ట‌మ‌ర్ల నుంచి అక్ర‌మంగా స‌ర్వీస్ చార్జి వ‌సూలు.. 27 రెస్టారెంట్ల‌పై CCPA కొర‌డా..

Service Charge | నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వినియోగదారుల నుంచి స‌ర్వీస్ చార్జిల‌ను వ‌సూలు చేస్తున్న ప‌లు హోట‌ల్స్, రెస్టారెంట్ల‌పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కొర‌డా ఝులిపించింది. స‌ర్వీస్ చార్జిల‌ను త‌ప్ప‌నిస‌రిగా వ‌సూలు చేయ‌డాన్ని ఆ సంస్థ త‌ప్పుబట్టింది.

S

Business | Published On Jan 11, 2026, 11.00 am IST

Service Charge | క‌స్ట‌మ‌ర్ల నుంచి అక్ర‌మంగా స‌ర్వీస్ చార్జి వ‌సూలు.. 27 రెస్టారెంట్ల‌పై CCPA కొర‌డా..
Advertisement

Service Charge | నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వినియోగదారుల నుంచి స‌ర్వీస్ చార్జిల‌ను వ‌సూలు చేస్తున్న ప‌లు హోట‌ల్స్, రెస్టారెంట్ల‌పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కొర‌డా ఝులిపించింది. స‌ర్వీస్ చార్జిల‌ను త‌ప్ప‌నిస‌రిగా వ‌సూలు చేయ‌డాన్ని ఆ సంస్థ త‌ప్పుబట్టింది. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా ఉన్న 27 రెస్టారెంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని CCPA వెల్ల‌డించింది. ఆయా రెస్టారెంట్ల‌కు రూ.50వేల వ‌ర‌కు జ‌రిమానా విధించిన‌ట్లు తెలిపింది. అలాగే వినియోగ‌దారుల నుంచి వ‌సూలు చేసిన స‌ర్వీస్ చార్జిల‌ను తిరిగి రీఫండ్ కింద వారికే చెల్లించాల‌ని కూడా రెస్టారెంట్ల‌ను CCPA ఆదేశించింది. దీంతోపాటు హోట‌ల్స్, రెస్టారెంట్ నిర్వాహ‌కులు త‌మ బిల్లింగ్ సాఫ్ట్ వేర్‌లోనూ మార్పులు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

సుమోటోగా కేసు..

కాగా హోట‌ల్స్ లేదా రెస్టారెంట్ల‌లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి స‌ర్వీస్ చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారంటూ దేశ‌వ్యాప్తంగా ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే వారి ఫిర్యాదుల ఆధారంగా CCPA సుమోటోగా కేసు న‌మోదు చేసింది. అనంత‌రం విచార‌ణ చేపట్టింది. దేశంలోని 27 రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జిల‌ను త‌ప్ప‌నిస‌రి చేసి వ‌సూలు చేస్తున్నాయ‌ని గుర్తించింది. దీంతో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు ఆయా రెస్టారెంట్ల‌పై జ‌రిమానా విధించారు. ఆయా రెస్టారెంట్ల‌కు చెందిన యాజ‌మాన్యాలు స‌రైన వ్యాపార సూత్రాల‌ను పాటించ‌డం లేద‌ని, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు గుర్తించామ‌ని, అందుక‌నే జరిమానా విధించామ‌ని CCPA అధికారి ఒక‌రు తెలిపారు. ఈ మేర‌కు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌..

పాట్నాలోని కేఫ్ బ్లూ బాటిల్, ముంబైలోని చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బోరా బోరా)తో సహా అనేక రెస్టారెంట్లు డిఫాల్ట్‌గా 10 శాతం సర్వీస్ ఛార్జీల‌ని వసూలు చేస్తున్నాయని ఈ విచార‌ణలో తేలింది. ఇది 2019 వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టం, CCPA మార్గదర్శకాలను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే CCPA వాద‌న‌ల‌ను ఢిల్లీ హైకోర్టు కూడా స‌మ‌ర్ధించింది. కాగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో అందిన ఫిర్యాదుల ఆధారంగా CCPA ఈ చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది. ఈ క్ర‌మంలోనే రెస్టారెంట్లు స‌ర్వీస్ చార్జిల‌ను వ‌సూలు చేస్తుండ‌డం వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టం 2019 సెక్ష‌న్ 2(47) ప్ర‌కారం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని CCPA తేల్చింది. దీంతో పాట్నాలోని కేఫ్ బ్లూ బాటిల్ విషయంలో సర్వీస్ ఛార్జి పూర్తి మొత్తాన్ని వినియోగదారుడికి తిరిగి చెల్లించాలని CCPA రెస్టారెంట్‌ను ఆదేశించింది. తక్షణమే అమలులోకి వచ్చేలా సర్వీస్ ఛార్జిని విధించే పద్ధతిని నిలిపివేసి రూ. 30వేల జరిమానా చెల్లించాలని రెస్టారెంట్‌కు సూచించింది.

ఫిర్యాదుల ప‌రిశీల‌న‌..

ఇక‌ ముంబైలోని చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బోరా బోరా) కేసు విచారణ సమయంలోనే రెస్టారెంట్ సర్వీస్ ఛార్జిల‌ని తిరిగి వినియోగ‌దారుడికి చెల్లించ‌డం గ‌మనార్హం. అయితే సర్వీస్ ఛార్జ్ లేదా ఇలాంటి ఛార్జిల‌ని డిఫాల్ట్‌గా జోడించడాన్ని తొలగించడానికి సాఫ్ట్‌వేర్జనరేటెడ్ బిల్లింగ్ సిస్టమ్‌ను సవరించాలని CCPA రెస్టారెంట్‌ను ఆదేశించింది. రెస్టారెంట్‌ రూ.50వేల జరిమానా చెల్లించాలని తెలిపింది. కాగా సేవా ఛార్జిల విధింపుకు సంబంధించి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు అందుతున్న ఫిర్యాదులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి, నిబంధ‌న‌ల‌ను పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని CCPA స్ప‌ష్టం చేసింది.

CCPA మార్గ‌ద‌ర్శ‌కాలు..

సర్వీస్ ఛార్జిల విధింపుపై CCPA జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థిస్తూ మార్చి 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ చర్యల‌ను చేప‌ట్టారు. అయితే రెస్టారెంట్లు తప్పనిసరిగా సర్వీస్ ఛార్జిలను వసూలు చేయడం చట్టానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. అన్ని రెస్టారెంట్ సంస్థలు CCPA మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. చట్టానికి అనుగుణంగా మార్గదర్శకాలను అమలు చేయడానికి CCPAకి పూర్తి అధికారం ఉందని కూడా కోర్టు పేర్కొంది. హోటళ్ళు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జిల‌ విధింపుకు సంబంధించి అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం మార్గదర్శకాలను CCPA జూలై 4, 2022న జారీ చేసింది. దీని ప్ర‌కారం ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా ఆహార బిల్లుకు డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జిని జోడించకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి. అలాగే మరే ఇతర పేరుతోనూ సేవా రుసుమును వసూలు చేయకూడదు. అదేవిధంగా సేవా రుసుమును చెల్లించాల‌ని వినియోగ‌దారుల‌ను బలవంతం చేయకూడదు. క‌స్ట‌మ‌ర్ల‌కు అదొక ఆప్ష‌న్ మాత్ర‌మే అని CCPA స్ప‌ష్టం చేసింది. అలాగే స‌ర్వీస్ చార్జిల‌ను చెల్లించ‌లేద‌ని క‌స్ట‌మ‌ర్‌కు ప్ర‌వేశాన్ని నిషేధించ‌డం కూడా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని CCPA తెలియ‌జేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement