త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధ‌ర ఎంతంటే..?

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ తన సీ6 (C6) మోడల్ డెలివరీలను బెంగళూరులో ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఈ మోడల్‌కు ఇదే తొలి కస్టమర్ డెలివరీలు కావ‌డం విశేషం.

S

Automobiles | Published On Jun 20, 2026, 5.18 pm IST

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. డెలివరీలు షురూ.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

Royal Enfield Flying Flea C6 | రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ తన సీ6 (C6) మోడల్ డెలివరీలను బెంగళూరులో ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఈ మోడల్‌కు ఇదే తొలి కస్టమర్ డెలివరీలు కావ‌డం విశేషం. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, బెంగళూరుకు ప్రత్యేకంగా ఓనర్‌షిప్, ఆఫ్టర్-సేల్స్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్ ఫ్లీ ప్రస్తుతం దశలవారీగా నగరాల వారీగా విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరు తొలి మార్కెట్‌గా ఎంపికైంది. ఇక్కడ కార్యకలాపాలు స్థిరపడిన తర్వాత ఇతర ప్రధాన మెట్రో నగరాలకు కూడా ఈ బ్రాండ్ ను విస్తరించనున్నట్లు తెలిపింది. సీ6 యజమానుల కోసం బెంగళూరులో హబ్-అండ్-స్పోక్ సర్వీస్ నెట్‌వర్క్‌ను ఫ్లయింగ్ ఫ్లీ ఏర్పాటు చేసింది. బీటీఎం లేఅవుట్‌లో ఉన్న ప్రధాన హబ్ సర్వీస్ సెంటర్ ప్రత్యేక మరమ్మత్తులు, క్లిష్టమైన సర్వీస్ అవసరాలను చేప‌డుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చిన్న స్పోక్ సెంటర్లు సాధారణ సర్వీసింగ్, మెయింటెనెన్స్ పనులను చూసుకుంటాయి.

ఎక్స్‌-షోరూం ధ‌ర‌..

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా ఫ్లయింగ్ ఫ్లీ వినియోగిస్తోంది. బెంగళూరులోని ఎంపిక చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో షాప్-ఇన్-షాప్ విధానంలో సీ6ను ప్రదర్శిస్తూ, సర్వీస్ సదుపాయాలు అందిస్తోంది. దీంతో ప్రత్యేకంగా కొత్త మౌలిక సదుపాయాలు నిర్మించాల్సిన అవసరం లేకుండా సేవల‌ను అందించగలుగుతోంది. ప్రతి సీ6 మోటార్‌సైకిల్‌తోపాటు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవను కూడా కంపెనీ అందిస్తోంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ధర పూర్తిగా కొనుగోలు చేసే వారికి రూ.2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో బ్యాటరీ ఖర్చును వాహనం ధర నుంచి వేరు చేయడంతో ప్రారంభ ధర రూ.1.99 లక్షలకు తగ్గుతుంది. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ స్టార్మ్ బ్లాక్, ఫ్లీ గ్రీన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

154 కిలోమీట‌ర్ల రేంజ్‌..

సీ6లో 3.91 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఐడీసీ ప్రమాణాల ప్రకారం 154 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో ఉపయోగించిన పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4 కిలోవాట్ల పవర్, 60 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో అందుకుంటుందని, గరిష్ఠ వేగం గంటకు 115 కిలోమీటర్లుగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. కేవలం 124 కిలోల బరువుతో సీ6 తేలికగా, సన్నగా ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో 19 ఇంచుల వీల్స్, 90 సెక్షన్ సన్నని టైర్లు ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే 3.5 ఇంచుల వృత్తాకార కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐదు రైడింగ్ మోడ్స్, లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-చానల్ ఏబీఎస్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

బెంగ‌ళూరులో లభ్యం..

ఫ్లయింగ్ ఫ్లీ సీ6ను కేవలం ఒక మోటార్‌సైకిల్‌గా కాకుండా, సమగ్ర ఓనర్‌షిప్ అనుభవంతో కూడిన ఉత్పత్తిగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రతి దశలో రైడర్లకు అనుసంధానమైన సేవలు, మద్దతు అందించడమే లక్ష్యమని కంపెనీ పేర్కొంది. బెంగళూరులోని జయనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్లయింగ్ ఫ్లీ స్టోర్‌లో కూడా కస్టమర్లు సీ6 ని టెస్ట్ రైడ్ చేసి ఫీచ‌ర్ల‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement