త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mudragada Padmanabham | అధికార లాంఛ‌నాల‌తో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు

Mudragada Padmanabham | కాపు ఉద్య‌మ‌నేత, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మనాభం (Mudragada Padmanabham) అంత్య‌క్రియ‌ల‌ను (Last Rites) అధికారిక లాంఛనాలతో (State Honours) నిర్వ‌హించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (AP Govt) నిర్ణ‌యించింది.

G

Andhra pradesh | Published On Jul 15, 2026, 10.57 am IST

Mudragada Padmanabham | అధికార లాంఛ‌నాల‌తో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు
Advertisement

Mudragada Padmanabham | త్రినేత్ర‌.న్యూస్‌: కాపు ఉద్య‌మ‌నేత, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మనాభం (Mudragada Padmanabham) అంత్య‌క్రియ‌ల‌ను (Last Rites) అధికారిక లాంఛనాలతో (State Honours) నిర్వ‌హించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (AP Govt) నిర్ణ‌యించింది. ఈమేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించింది. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారని.. రాష్ట్రానికి ఆయ‌న సేవ‌ల‌కుగాను అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

గత కొంతకాలంగా శ్వాసకోశ (Respiratory), కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం హైద‌రాబాద్‌లోని ఓ ద‌వాఖాన‌లో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయ‌న భౌతిక‌కాయాన్ని స్వ‌గ్రామ‌మైన కాకినాడ జిల్ల కిర్లంపూడికి త‌ర‌లించారు. అభిమానులు, ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచిన త‌ర్వాత అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

25 ఏళ్లకే ఎంట్రీ.. వరుస విజయాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ముద్రగడ జన్మించారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కేవలం 25 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా (MLA) అసెంబ్లీలో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున, 1989లో కాంగ్రెస్ నుంచి.. ఇలా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. తన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం.

మంత్రిగా.. ఎంపీగా కీలక బాధ్యతలు

దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు (NTR), డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. పలు కీలక శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా (MP) పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై చేసిన ఒక సవాల్‌కు కట్టుబడి తన పేరును అధికారికంగా 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా మార్చుకుని వార్తల్లో నిలిచారు.

కాపు రిజర్వేషన్ల పోరాటమే ఊపిరిగా..

కాపు సామాజిక వర్గాన్ని బీసీ (BC) జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ముద్రగడ సుదీర్ఘ పోరాటాలు చేశారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కాపుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు.. ఆ సామాజిక వర్గం గుండెల్లో ఆయనకు చెరగని స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ముద్రగడకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

Advertisement
Advertisement