త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

J

Andhra pradesh | Published On Jul 14, 2026, 7.31 pm IST

Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
Advertisement
  • దీర్ఘకాలిక శ్వాసకోశ, కిడ్నీ సమస్యలతో హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో కన్నుమూసిన ముద్రగడ పద్మనాభం (73)
  • 1953లో కిర్లంపూడిలో జననం.. 25 ఏళ్లకే తొలిసారి ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా విజయం
  • ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో కీలక మంత్రిగా, కాకినాడ ఎంపీగా సేవలు
  • కాపు రిజర్వేషన్ల సాధన కోసం సుదీర్ఘ పోరాటాలు.. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరిక

Mudragada Padmanabham Passes Away | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం (73) ఇక లేరు. గత కొంతకాలంగా శ్వాసకోశ (Respiratory), కిడ్నీ సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సింధు హాస్పిటల్‌ ( Sindhu Hospital) లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

25 ఏళ్లకే ఎంట్రీ.. వరుస విజయాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో ముద్రగడ జన్మించారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కేవలం 25 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా (MLA) అసెంబ్లీలో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున, 1989లో కాంగ్రెస్ నుంచి.. ఇలా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. తన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం.

మంత్రిగా.. ఎంపీగా కీలక బాధ్యతలు

దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు (NTR), డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. పలు కీలక శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా (MP) పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై చేసిన ఒక సవాల్‌కు కట్టుబడి తన పేరును అధికారికంగా 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా మార్చుకుని వార్తల్లో నిలిచారు.

కాపు రిజర్వేషన్ల పోరాటమే ఊపిరిగా..

కాపు సామాజిక వర్గాన్ని బీసీ (BC) జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ముద్రగడ సుదీర్ఘ పోరాటాలు చేశారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కాపుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు.. ఆ సామాజిక వర్గం గుండెల్లో ఆయనకు చెరగని స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ముద్రగడకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement