త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | ఆర్‌బీఐ కొరడా.. ఆరు బ్యాంకులకు భారీ జరిమానాలు..

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జూలై నెలలో మరోసారి నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని రెండు చొప్పున సహకార బ్యాంకులతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఒక బ్యాంకు, గుజరాత్‌లోని మరో బ్యాంకుపై జరిమానాలు విధించింది.

S

Business | Published On Jul 24, 2026, 3.43 pm IST

RBI | ఆర్‌బీఐ కొరడా.. ఆరు బ్యాంకులకు భారీ జరిమానాలు..
Advertisement

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జూలై నెలలో మరోసారి నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని రెండు చొప్పున సహకార బ్యాంకులతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఒక బ్యాంకు, గుజరాత్‌లోని మరో బ్యాంకుపై జరిమానాలు విధించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని పరిశీలించేందుకు 2025 మార్చి నాటికి నాబార్డ్ లేదా ఆర్‌బీఐ చట్టబద్ధ తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో సంబంధిత బ్యాంకులు నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని గుర్తించారు. అనంతరం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. బ్యాంకుల నుంచి వచ్చిన సమాధానాలు, వ్యక్తిగత విచారణలో చేసిన వాదనలు పరిశీలించిన తర్వాత ఆరోపణలు నిజమని తేలడంతో జరిమానాలు విధించాలని నిర్ణయించారు.

అక్ర‌మంగా రుణాల‌ను ఆమోదించినందుకు..

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై డైరెక్టర్లకు సంబంధించిన రుణాలను ఆమోదించినందుకు రూ.13.30 లక్షల జరిమానా విధించారు. అలాగే కటోల్‌లోని అరవింద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై భూసేకరణ కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్లకు రుణాలు మంజూరు చేయడంతో పాటు అర్హత లేని కొందరు డిపాజిటర్లకు అదనపు వడ్డీ చెల్లించినందుకు రూ.11 లక్షల జరిమానా విధించింది. కర్ణాటకలోని మండ్యా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌పై బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ ఇతర సహకార సంఘాల్లో షేర్లు కలిగి ఉన్నందుకు రూ.50 వేల జరిమానా విధించారు. హసన్‌లోని ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై వినియోగదారుల కేవైసీ వివరాలను నిర్ణీత గడువులో సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీలో అప్‌లోడ్ చేయకపోవడంతో రూ.50 వేల జరిమానా విధించారు.

ఖాతాదారుల‌పై ప్ర‌భావం ఉండ‌దు..

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై అర్హత లేని డిపాజిటర్లకు అదనపు వడ్డీ చెల్లించినందుకు రూ.1 లక్ష జరిమానా విధించారు. అలాగే గుజరాత్‌లోని బారియాలో ఉన్న శ్రీ బారియా నగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్‌పై 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు అంతర్గత ఆడిట్ నిర్వహించకపోవడంతో రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ చర్యల వల్ల బ్యాంకు ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఎప్పటిలాగే అన్ని బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యలు కేవలం నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినవేనని, బ్యాంకులు, ఖాతాదారుల మధ్య జరిగిన లావాదేవీల చెల్లుబాటుపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తడం కాదని, భవిష్యత్ లావాదేవీలపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బీఐ పేర్కొంది.

Advertisement
Advertisement