త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | కాజీపేట రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన.. ఈరోజు ఎమ్మెల్సీనయ్యా : తీన్మార్ మల్లన్న

హన్మకొండలో జరిగిన 'యూత్ మీటప్'లో జెన్-జీ యువతకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే ఈ తరం రాజకీయాలను శాసించాలన్నారు.

J

Warangal | Published On Aug 8, 2026, 8.45 pm IST

Teenmar Mallanna | కాజీపేట రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన.. ఈరోజు ఎమ్మెల్సీనయ్యా : తీన్మార్ మల్లన్న
Advertisement
  • హన్మకొండలో విద్యార్థులతో నిర్వహించిన 'యూత్ మీటప్' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • సాంకేతికతను ఆయుధంగా మలచుకుని జెన్-జీ (Gen-Z) యువత రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని పిలుపు
  • తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలను వెనక్కి పిలిచే 'రైట్ టు రీకాల్', 50% మహిళా రిజర్వేషన్లు తెస్తామని హామీ
  • 60 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే 'బీసీ ముఖ్యమంత్రి' రావాలని స్పష్టీకరణ
  • సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

Teenmar Mallanna | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న యువతకు సంచలన పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన 'యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న' (Youth Meetup) కార్యక్రమంలో ఆయన పలు కళాశాలల జెన్-జీ (Gen-Z) విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇవ్వడంతో పాటు,.. సెప్టెంబర్ 17 నుంచి తాను చేయబోయే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర గురించి కీలక ప్రకటన చేశారు.

Teenmar Mallanna Urges Gen-Z to Enter Politics Announces Statewide Padayatra

జెన్-జీ పవర్.. ఇన్‌స్టాగ్రామే ఆయుధం

సాంకేతిక విప్లవంతో పెరిగిన 29 ఏళ్ల లోపు యువతను జెన్-జీ గా అభివర్ణించిన మల్లన్న.. నేటి తరం స్మార్ట్‌ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పుట్టిందన్నారు. కేవలం 5 సెకన్లలో సమాచారాన్ని సృష్టించగల ఈ తరం, రాజకీయాల్లో కూడా అంతే వేగంగా మార్పు తీసుకురాగలదని ఆకాంక్షించారు. తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ కోసం యువత కేవలం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా ప్రచారం చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారని, డబ్బులు పంచకుండానే తల్లిదండ్రులను ఒప్పించి ఓట్లు వేయిస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయాలు బురద అని భయపడకుండా, అధికారాన్ని బాధ్యతగా తీసుకుని యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Teenmar Mallanna Urges Gen-Z to Enter Politics Announces Statewide Padayatra

పని చేయకపోతే దించేయడమే.. (Right to Recall)

తమ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే చరిత్రాత్మక మార్పులు తీసుకొస్తామని మల్లన్న ప్రకటించారు. అందులో ముఖ్యంగా 'రైట్ టు రీకాల్' (Right to Recall) విధానం ఒకటి. దీని ద్వారా పని చేయని ఎమ్మెల్యేలను ఐదేళ్ల పదవీ కాలం ముగియకముందే ప్రజలు తొలగించే అవకాశం ఉంటుంది. అలాగే, రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీలకు 1952 నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదని, వారికి సరైన న్యాయం జరగాలంటే కచ్చితంగా 'బీసీ ముఖ్యమంత్రి' అవసరమని ఆయన ఉద్ఘాటించారు.

Teenmar Mallanna Urges Gen-Z to Enter Politics Announces Statewide Padayatra

మల్లన్న సూటి సమాధానాలు

కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు క్లిష్టమైన ప్రశ్నలకు మల్లన్న తనదైన స్టైల్‌లో సమాధానాలిచ్చారు.

మీరే 20 ఏళ్ల యువకుడైతే ఏం చేస్తారు? అని అడగగా.. "నేను తప్పకుండా రాజకీయాలనే ఎంచుకుంటాను. పవర్ ఉంటేనే సిస్టమ్‌ను మార్చగలం" అని బదులిచ్చారు.

ఉద్యోగాల్లో కులం అడ్డువస్తుందా? అన్న ప్రశ్నకు.. రిజర్వేషన్ల కంటే ముందు కులాన్ని తీసేయాలని, విద్య అందరికీ ఉచితంగా అందితే ఆటోమేటిక్‌గా టాలెంట్‌కే ప్రాధాన్యత దక్కుతుందని చెప్పారు.

వ్యక్తిగత జీవితంపై.. తనది ప్రేమ వివాహమని, కాకతీయ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో పరిచయమై తొమ్మిదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని వివరించారు.

Teenmar Mallanna Urges Gen-Z to Enter Politics Announces Statewide Padayatra

పార్టీ టార్గెట్స్ ఇవే

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తమ పార్టీ లక్ష్యాలను మల్లన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మహిళా సాధికారత: అసెంబ్లీలోని 119 స్థానాల్లో ఏకంగా 50% అంటే 59 సీట్లు మహిళలకే కేటాయిస్తాం.

ఉచిత విద్య, వైద్యం: కేజీ నుంచి పీజీ వరకు రూపాయి ఖర్చు లేని కార్పొరేట్ స్థాయి విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లో విద్య కోసం 20% నిధులు కేటాయిస్తాం.

యువతకు ఉపాధి: యువతను కేవలం ఉద్యోగులుగా కాకుండా, పది మందికి ఉపాధి ఇచ్చే బిజినెస్ ఓనర్లుగా (Business Owners) తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

"కాజీపేట రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకున్న నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఎదిగానంటే అది నా పట్టుదల వల్లే. భయపడే వారికి నా పార్టీలో చోటు లేదు, ధైర్యవంతులే రావాలి." అని మల్లన్న పిలుపునిచ్చారు.

Teenmar Mallanna Urges Gen-Z to Enter Politics Announces Statewide Padayatra

ప్రభుత్వాలు ఇచ్చే కంట్రోల్ బియ్యం కోసం కాకుండా, మీ ఆత్మగౌరవం కోసం, నాణ్యమైన భవిష్యత్తు కోసం పోరాడాలని యువతకు దిశానిర్దేశం చేసిన మల్లన్న.. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement