త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా

Teenmar Mallanna | బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 41వ రోజు పాదయాత్రగా తీన్మార్ మల్లన్న మునుగోడుకు చేరుకున్నారు. స్థానిక పార్టీ నాయకులు మల్లన్నకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మునుగోడు సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు.

S

Telangana | Published On Nov 3, 2026, 8.26 pm IST

Teenmar Mallanna | 2028లో మునుగోడు బీసీ ఎమ్మెల్యే పక్కా
Advertisement

మీ ఓట్లు వద్దు.. మీ సోపతే వద్దు!
కోమటిరెడ్డి బ్రదర్స్ కి గ్రాడ్యుయేట్ ఓటే లేదు..
ఈడ‌బ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసి తీరుతా
60 వేల కోట్ల బీసీల నిధులు దారిమళ్లింపు..
లెక్కలతో సహా బట్టబయలు చేసిన టీఆర్పీ అధినేత!
మునుగోడులో 'తీన్మార్ మల్లన్న' మాస్ వార్నింగ్!

Teenmar Mallanna | త్రినేత్ర న్యూస్ : బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా 41వ రోజు పాదయాత్రగా తీన్మార్ మల్లన్న మునుగోడుకు చేరుకున్నారు. స్థానిక పార్టీ నాయకులు మల్లన్నకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మునుగోడు సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు.

అసెంబ్లీ నుంచి వీధి దాకా.. అక్రమాల బట్టబయలు!

మునుగోడు వేదికగా తీన్మార్ మల్లన్న అధికార, ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత పేద నియోజకవర్గమని, కానీ ఇక్కడి నుండి గెలిచే ఎమ్మెల్యేలు మాత్రం కోట్లకు పడగెత్తిన ధనికులని ధ్వజమెత్తారు. "ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను మనసు చంపుకొని దళితుడైన డిప్యూటీ సీఎం దగ్గరకు పోయానని చెప్తున్నాడని, మరి ఇన్నాళ్లూ మా గొల్ల, కురుమల దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసు చచ్చిపోలేదా?" అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డలు రైలు పట్టాలపై పడి ప్రాణాలు అర్పిస్తే, పదేళ్ల కాలంలో పదవులు, ఆస్తులు అనుభవించింది మాత్రం రెడ్డి,వెలమ కులాల నేతలేనని మండిపడ్డారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పట్టభద్రుల ఓటే లేదు!

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కానీ అస్సలు పట్టభద్రుల ఓటే లేదని ఎద్దేవా చేశారు. "గ్రాడ్యుయేట్ ఓటే లేని నేతలు మన ఓట్లు ఎలా అడుగుతారు? మీ ఓట్లు మాకు వద్దే వద్దు. మీ సోపతీ వద్దు. బొందలగడ్డ దగ్గర ఉండే సోపతి కూడా మీతో మాకు లేదు. మా బొందలు వేరు.. మీ బొందలు వేరు" అని స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బిసి బిడ్డ, ఉపాధ్యాయుడు పాలకూరి అశోక్ సార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టామని ప్రకటిస్తూ, బీసీల ఐక్యత కోసం తన సొంత ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా త్యాగం చేసి అశోక్ సార్‌కు కేటాయించానని తెలిపారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 15 లక్షల ఓట్లలో బీసీల ఓట్లే అత్యధికంగా 8లక్షలు ఉన్నాయని, రెడ్ల ఓట్లు జల్లెడ పట్టినా 2 లక్షలు కూడా లేవని స్పష్టం చేశారు.

లక్షమంది లేని వెలమలకు 13 సీట్లు.. 2 కోట్ల బీసీలకు తిప్పలు!

రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా, వారికి దక్కుతున్న రాజకీయ ప్రాతినిధ్యంపై మల్లన్న పక్కా లెక్కలు బయటపెట్టారు. వెలమ సామాజికవర్గం వారు రాష్ట్రంలో లక్ష మంది కూడా లేరు, కానీ ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం వారు 10 లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్నారు, కానీ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఇగ 2 కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలు మాత్రం ఒక చిన్న ఎంపీటీసీ టికెట్ కోసం పార్టీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నేతలంతా కేవలం రెండు రోజులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే, రెడ్ల గుండెలాగిపోతాయని అన్నారు.

ప్రభుత్వ పథకాల్లో తీవ్ర వివక్ష.. పథకాల్లేవు.. భూముల్లేవు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లెక్కల ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెబుతూ పథకాల పంపిణీలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.ప్రతి రెడ్డి కుటుంబానికి సగటున 1.25 ఎకరాల భూమి ఉంది కానీ యాదవులకు సగటున అర ఎకరం, ముదిరాజులకు అర ఎకరం కంటే తక్కువ, గౌడ సోదరులకు పావు ఎకరం మాత్రమే ఉందని, ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుందని తీన్మార్ మ‌ల్ల‌న్న ప్ర‌శ్నించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు వైద్యం వెంకటేశ్వర్లు,మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సతీష్ బాబు, పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జ్ పూజిత, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అరుణ,పార్టీ నాయకులు కంటాల యాదగిరి, శేఖర్, రాణి, గొల్లకుర్మ సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ట్యాగ్స్:

Ashok SirGraduate MLC ElectionsMunugodeNallagondaTeenmar MallannaTRP Party
Advertisement
Advertisement