త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elderly Couple First Flight Video | ఎర్ర బస్సు ఎక్కడానికి వెళ్లినంత సహజంగా విమానం ఎక్కారు.. తల్లిదండ్రుల కల నెరవేర్చిన కొడుకు

తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించాడో కొడుకు. ఎర్ర బస్సు ఎక్కినంత సహజంగా, పంచెకట్టుతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ దంపతుల వీడియో అందరి మనసు గెలుచుకుంటోంది.

J

Viral news | Published On Nov 17, 2026, 3.51 pm IST

Elderly Couple First Flight Video | ఎర్ర బస్సు ఎక్కడానికి వెళ్లినంత సహజంగా విమానం ఎక్కారు.. తల్లిదండ్రుల కల నెరవేర్చిన కొడుకు

సంక్షిప్త సారాంశం

తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించి, వారి చిరకాల కలను నెరవేర్చిన ఓ కొడుకు వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంటి హడావుడి లేకుండా, ఎర్ర బస్సు ఎక్కినంత సహజంగా పంచెకట్టు, కండువా, చీరకట్టుతోనే ఆ వృద్ధ దంపతులు ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టారు. విమానంలో కూర్చున్నాక ఆ పెద్దాయన కిటికీలోంచి బయటకు చూస్తూ ఆశ్చర్యపోయిన తీరు వీడియోకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులను ఇతరులకు పరిచయం చేయడానికే మొహమాటపడే ఈ రోజుల్లో, ఆ యువకుడు చూపిన ప్రేమపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

Elderly Couple First Flight Video  | త్రినేత్ర న్యూస్ :  తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా వారికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించాడు ఓ కొడుకు. తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించి, వారి చిరకాల కోరికను నెరవేర్చిన ఆ యువకుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు ఆ దంపతుల నిరాడంబరత, పెద్దాయన అమాయకపు ఆశ్చర్యం చూపరులను కట్టిపడేస్తున్నాయి.

ఎర్ర బస్సు ఎక్కినంత కూల్‌గా

సాధారణంగా మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నారంటే ఎవరికైనా కాస్త కంగారు, హడావుడి ఉంటాయి. కానీ ఈ వృద్ధ దంపతుల్లో అలాంటి తొందరపాటు ఎక్కడా కనిపించలేదు. మనం ఊర్లో 'ఎర్ర బస్సు' ఎక్కడానికి ఎంత సహజంగా వెళ్తామో, అంతే ప్రశాంతంగా 'ఎయిర్‌బస్' ఎక్కడానికి ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టారు.

మార్పులేని ఆ కట్టుబొట్టు, నిరాడంబరత

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నామని ప్రత్యేకంగా హంగు ఆర్భాటాలకు పోకుండా, తమ రోజువారీ అలవాట్లను వాళ్లు ఏమాత్రం మార్చుకోలేదు. పెద్దాయన తన సహజమైన పంచెకట్టు, భుజాన కండువాతో.. పెద్దావిడ సంప్రదాయ చీరకట్టుతో ఎంతో హుందాగా నడుచుకుంటూ వెళ్లారు. చేతిలో ఎప్పటికీ వాడే సాధారణ బ్యాగు, బట్టల షాపులో బేరమాడి తెచ్చుకున్నప్పుడు ఇచ్చే ఎక్స్‌ట్రా కవర్లతో కనిపించిన ఆ సహజత్వం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

వీడియోకే హైలైట్ ఆ 'విండో సీట్' మూమెంట్

ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ నుంచి ఏరోబ్రిడ్జ్ (Aerobridge) మీదుగా విమానంలోకి అడుగుపెట్టడం, క్యాబిన్ సిబ్బంది స్వాగతం పలకడం వంటి దృశ్యాలు ఎంతో సహజంగా సాగిపోతాయి. అయితే దాదాపు 80 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో మొత్తానికి హైలైట్ మాత్రం 'విండో సీట్' (Window seat) సన్నివేశం. విమానంలో కూర్చున్నాక, ఆ పెద్దాయన తన సీట్లోంచి కాస్త ముందుకు వంగి కిటికీలోంచి బయటకు ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ కళ్లలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ఆ కొడుకుకు నిజంగా హ్యాట్సాఫ్

చివర్లో ఆ దంపతుల పక్కనే కూర్చున్న కొడుకు ముఖంలో తల్లిదండ్రుల ఆనందాన్ని చూస్తున్న తృప్తి, గర్వం స్పష్టంగా కనిపిస్తాయి. నేటి కాలంలో చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక.. పల్లెటూరి తల్లిదండ్రులను తమ ఫ్రెండ్స్‌కు పరిచయం చేయడానికి కూడా మొహమాటపడే కొడుకులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటిది, తన తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా, వాళ్ల సహజత్వంతోనే తొలిసారి విమానం ఎక్కించి ఆనందపరిచిన ఆ యువకుడికి నిజంగా శుభాకాంక్షలు చెప్పాల్సిందే!

Advertisement
Advertisement