త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Heatwave 2026 | ముంబై కష్టాలు: రాత్రంతా వెర్సోవా బీచ్‌లోనే నిద్రపోతున్న జనం.. అసలు కారణమిదే!

భరించలేని ఎండలు, కరెంట్ కోతలతో ముంబై వాసులు విలవిలలాడుతున్నారు. వేడి తట్టుకోలేక రాత్రంతా వెర్సోవా బీచ్‌లోనే నిద్రపోతున్నారు. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?

J

Viral news | Published On Jun 18, 2026, 4.55 pm IST

Mumbai Heatwave 2026 | ముంబై కష్టాలు: రాత్రంతా వెర్సోవా బీచ్‌లోనే నిద్రపోతున్న జనం.. అసలు కారణమిదే!
Advertisement
  • ముంబైలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతకు తోడు కరెంట్ కోతలతో మురికివాడల ప్రజల ఇబ్బందులు
  • ఇళ్లలో ఉండలేక, రాత్రిపూట ఆరుబయట వెర్సోవా బీచ్‌లో నిద్రపోతున్న వందలాది కుటుంబాలు
  • దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, పబ్లిక్ ప్రదేశాల వినియోగంపై సోషల్ మీడియాలో చర్చ
  • రేకుల ఇళ్లలో ఉక్కపోత, 4,608 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్‌తో ముంబైలో పెరిగిన పవర్ కట్స్

Mumbai Heatwave 2026 | త్రినేత్ర.న్యూస్ : దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) వాసులను భయంకరమైన ఎండలు, కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇళ్లలో ఉక్కపోత భరించలేక వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి, రాత్రంతా ఆరుబయట వెర్సోవా బీచ్‌ (Versova Beach) లోనే గడుపుతున్నాయి. చీకటి పడగానే చాపలు పట్టుకుని బీచ్‌కు చేరుకుంటున్న జనం, ఉదయం సూర్యోదయం అయ్యాక తిరిగి తమ ఇళ్లకు పయనమవుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

బీచ్‌లే బెడ్‌రూమ్‌లుగా..

ముంబై సమీపంలోని బస్తీలు, మురికివాడల్లో నివసించే వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ రాత్రి వెర్సోవా బీచ్‌కు చేరుకుంటున్నారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ఇసుకపై చాపలు పరుచుకుని నిద్రపోతున్నారు. కేవలం వెర్సోవాలోనే కాకుండా బాంద్రాలోని కార్టర్ రోడ్, మీరా-భయందర్‌లలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆనంద్ దిఘే గ్రౌండ్‌లో వలస కార్మికులు సైతం ఆరుబయటే నిద్రపోతున్న దృశ్యాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకులు ఈ ప్రాంతాలను సందర్శించి, స్థానికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఇళ్లలో ఎందుకు ఉండలేకపోతున్నారంటే?

జూన్ 2026 నాటికి ముంబైలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి:

కరెంట్ కష్టాలు: ఎండల తీవ్రతకు ముంబైలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో 4,608 మెగావాట్లకు (4,608 MW) చేరుకుంది. దీంతో పవర్ గ్రిడ్ ఓవర్‌లోడ్ అయ్యి, వెస్ట్రన్ సబర్బ్స్‌లో విపరీతమైన పవర్ కట్స్ (Power cuts) అవుతున్నాయి.

రేకుల ఇళ్లు - ఉక్కపోత: బస్తీల్లో ఇరుకు గదులు, వాటిపై ఉండే రేకులు, ఆస్బెస్టాస్ పైకప్పుల వల్ల పగటి పూట ఇళ్లు విపరీతంగా వేడెక్కుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 30.2°C గా నమోదు కావడం, దానికి తోడు కరెంట్ లేకపోవడంతో ఆ గదులు హీట్ ట్రాప్‌లుగా మారుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడంతో గదిలో ఉండటం ప్రాణాంతకంగా మారుతోంది.

ఆలస్యమైన వర్షాలు: రుతుపవనాల రాక ఆలస్యం కావడం, వాతావరణంలో తేమ శాతం (Humidity) విపరీతంగా పెరిగిపోవడంతో.. కనీసం సముద్రపు గాలితోనైనా ఉపశమనం పొందుదామని ప్రజలు బీచ్‌ల బాట పడుతున్నారు.

నెట్టింట తీవ్రమైన చర్చ

ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు పబ్లిక్ ప్రదేశాలను ఇలా ఆక్రమించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ఉండటానికి చోటు లేకపోతే ముంబై వదిలి వెళ్లిపోవాలి కానీ, పబ్లిక్ ప్లేస్‌లను ఇలా పాడుచేయొద్దు" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరికొందరు మాత్రం పేదల కష్టాలకు మద్దతుగా నిలుస్తున్నారు. "వారిని అక్కడి నుంచి వెళ్లిపోమనడం కాదు, నగరంలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ ప్రజల బాధ పోలీసులకు కూడా అర్థమైంది కాబట్టే వారిని ఆపడం లేదు" అని కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా, ఈ ఘటన ముంబైలోని హౌసింగ్, పేదరికం, నగర మౌలిక సదుపాయాల వైఫల్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది.

Advertisement
Advertisement