త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crorepati Beggar | రిచ్ బిచ్చగాడు..కోట్లకు అధిపతి.. కారులో వచ్చి భిక్షాటన

భిక్షాటన ద్వారా రోజుకు రూ.500 వరకు ఆదాయం, ఫైనాన్స్ ద్వారా రోజుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు మంగీలాల్‌కి ఆదాయం వస్తుందని, తనకు ఉన్న ప్రాపర్టీస్ ద్వారా కూడా ఇంకొంత ఆదాయం వస్తుందని.. వాటినే పక్కా ప్రణాళికతో పెట్టుబడి పెడుతూ కోటీశ్వరుడిగా మారాడని అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

J

Viral news | Published On Jan 19, 2026, 5.39 pm IST

Crorepati Beggar | రిచ్ బిచ్చగాడు..కోట్లకు అధిపతి.. కారులో వచ్చి భిక్షాటన
Advertisement

Crorepati Beggar | బిచ్చగాడిని చూడగానే మనం చీదరించుకుంటాం. బాబ్బాబు అని వాళ్లు అనకముందే చిల్లర లేదు.. పక్కకెళ్లమంటాం. వాళ్లను చూసి అసహ్యించుకుంటాం. వీళ్లకు ఏం పని ఉండదు.. పాట ఉండదు. ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. ఊరికే జనాలను డబ్బులు అడుగుతుంటారు అంటూ బిచ్చగాళ్లను చూసి చిరాకు పడని వాళ్లు ఉండరు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిచ్చగాడి గురించి చెబితే మీకు బిచ్చగాళ్ల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ బిచ్చగాడు మామూలు బిచ్చగాడు కాదు.. కోట్లకు అధిపతి. మనోడికి మూడు ఇండ్లు, మూడు ఆటోలు, ఒక స్విఫ్ట్ కారుతో పాటు ప్రభుత్వం ఇచ్చిన ఇంకో ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి.. ఈయన నిజంగానే బిచ్చగాడా? నిజానికి ఆయన ఆస్తులను బట్టి చూస్తే కోటీశ్వరుడే కానీ.. తన వృత్తి అయిన భిక్షాటన మాత్రం మానలేదు. ఇప్పటికీ అదే వృత్తిని నమ్ముకొని కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నాడు ఈ రిచ్ బిచ్చగాడు.

ఈయన పేరు మంగీలాల్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటాడు. అక్కడి సరఫా బజార్‌లోనే మంగీలాల్ రోజూ భిక్షాటన చేస్తుంటాడు. తన సొంత కారులో వచ్చి భిక్షాటన చేస్తారు. తన కారుకు డ్రైవర్ కూడా ఉన్నాడు. భిక్షాటనతో వచ్చిన డబ్బులను పొదుపుగా వాడుకొని, వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి కోట్లు గడించాడు. లెప్రసీ పేషెంట్ అయిన మంగీలాల్ లేచి నిలబడలేడు. నడవలేడు. గిరకలా ఉండే పరికరం మీద కూర్చొని భిక్షాటన చేస్తుంటాడు. 2021 నుంచి భిక్షాటన మీదనే ఆధారపడి జీవించేవాడు. అప్పటి నుంచి భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను సరఫా బజార్‌లో ఉండే లోకల్ ట్రేడర్స్‌కి ఫైనాన్స్ ఇచ్చేవాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కోటీశ్వరుడిగా మారాడు.

యాంటీ బెగ్గింగ్ డ్రైవ్‌లో తెలిసిన అసలు నిజం

ఇండోర్ దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే కదా. అందులో భాగంగానే ఇండోర్‌ని బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు యాంటీ బెగ్గింగ్ డ్రైవ్‌ను ప్రభుత్వం చేపట్టింది. అప్పుడే మంగీలాల్‌ని కూడా రెస్క్యూ టీమ్ అదుపులోకి తీసుకొని ఆశ్రమానికి తరలిద్దామనుకున్నా.. అతడి గురించి తెలుసుకొని టీమ్ షాక్ అయింది. మంగీలాల్ పేరుకు భిక్షం ఎత్తుకుంటున్నా కోటీశ్వరుడని తెలుసుకొని అతడి బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేసి షాక్ అయ్యారు. భిక్షాటన ద్వారా రోజుకు రూ.500 వరకు ఆదాయం, ఫైనాన్స్ ద్వారా రోజుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు మంగీలాల్‌కి ఆదాయం వస్తుందని, తనకు ఉన్న ప్రాపర్టీస్ ద్వారా కూడా ఇంకొంత ఆదాయం వస్తుందని.. వాటినే పక్కా ప్రణాళికతో పెట్టుబడి పెడుతూ కోటీశ్వరుడిగా మారాడని అధికారులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అందుకే.. అతడిని ఉజ్జయిన్‌లోని సేవాధామ్ ఆశ్రమ్‌కి తరలించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement