త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ishtakameshwari Temple Srisailam | ఇష్టకామేశ్వరి ఆలయం ఎందుకు మూసేశారు.. నల్లమల ఫారెస్ట్‌లో ఉన్న ఆ గుడికి ఎలా వెళ్లాలి?

శ్రీశైలం నుంచి 20 కిమీల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మూసేశారు? భక్తులను దర్శనానికి రానివ్వడం లేదు? కారణం ఏంటి? దట్టమైన నల్లమల అడవుల్లో ఉన్న ఈ దేవాలయం విశిష్టత ఏంటి? ఎందుకు ఆలయంలో దర్శనాలు నిలిపేశారు? అసలు ఈ గుడికి ఎలా వెళ్లాలి? తెలుసుకుందాం రండి.

J

Tourism | Published On May 3, 2026, 10.16 am IST

Ishtakameshwari Temple Srisailam | ఇష్టకామేశ్వరి ఆలయం ఎందుకు మూసేశారు.. నల్లమల ఫారెస్ట్‌లో ఉన్న ఆ గుడికి ఎలా వెళ్లాలి?
Advertisement

త్రినేత్ర.న్యూస్ : నల్లమల అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సహజ సౌందర్యానికి, వైవిధ్యమైన వన్యప్రాణులకు, ఆధ్యాత్మికతకు ఈ అడవులు పెట్టింది పేరు. నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవి కూడా. అలాంటి క్షేత్రాల్లో ఒకటి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. ఇది శ్రీశైలానికి 20 కిమీల దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది. పార్వతీ దేవి అవతారమైన ఇష్టకామేశ్వరి అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. మరో విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం నుదిటి భాగం అత్యంత మృదువుగా ఉంటుంది. అచ్చం మనిషి చర్మాన్ని పోలినట్టుగా ఉండటం విశేషం.

అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్లాలి?

శ్రీశైలం నుంచి దట్టమైన అడవి లోపల 20 కిమీల దూరంలో ఈ గుడి ఉంటుంది. కానీ శ్రీశైలం నుంచి డైరెక్ట్‌గా ఆలయానికి చేరుకోవడం వీలు పడదు. దోర్నాల వైపు వెళ్లే ఎస్‌హెచ్8 రోడ్డుపై సుమారు 12 కిమీలు ప్రయాణించిన తర్వాత అక్కడి నుంచి జీపుల ద్వారా మరో 8 కిమీలు ఉన్న గుంతల మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆలయం చుట్టుపక్కన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం, ఆలయం గుహ లోపల ఉండటం వల్ల ఈ ఆలయానికి వెళ్లే భక్తులు ఆ ప్రదేశాన్ని చూసి మైమరిచిపోతారు.

why ishtakameswari temple closed how to reach this temple from srisailam

అమ్మవారి నుదటిపై కుంకుమ పెట్టాలి?

ఆలయానికి చేరుకోగానే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని పూజలు చేసిన అనంతరం అమ్మవారి నుదిటిపై కుంకుమ పెట్టాలని భక్తులకు చెబుతారు. అమ్మవారి నుదురు మృదువుగా ఉండటం వల్ల అమ్మవారి నుదుట కుంకుమ పెట్టగానే భక్తులు పరవశించిపోతారు. మనసులో కోరిక కోరుకొని అమ్మవారి నుదుట బొట్టు పెడితే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన ఎందుకు నిలిపేశారు?

నల్లమల అటవీ శాఖ అధికారులు, చెంచు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనను నిలిపివేశారు. నిజానికి దట్టమైన అడవిలో గుహల మధ్య ఉన్న ఆ ఆలయానికి వెళ్లాలంటే దారి సరిగ్గా ఉండదు. రాళ్లతో, మట్టితో ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే అటవీ మార్గంలో జీపుల ద్వారానే సాధ్యం అవుతుంది. ఆ జీపులను అడవిలో నివసించే చెంచులు నడుపుతుంటారు. ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎవరైనా సరే జీపుల్లోనే వెళ్లాలి. కానీ.. నిబంధనలకు విరుద్దంగా ఓ వ్యక్తి బైక్‌పై ఆలయానికి వెళ్లడాన్ని అటవీ శాఖ అధికారులు అనుమతించారని చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో అటవీ అధికారులు, చెంచు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తడంతో ఆలయాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఇప్పటికే జారీ చేసిన టికెట్లను వెనక్కి ఇచ్చేసి.. భక్తులు ఎవ్వరూ ఆలయ సందర్శనకు రాకూడదని అటవీ అధికారులు తెలిపారు. వివాదం సద్దుమణిగిన తర్వాతే యాత్రను పున:ప్రారంభిస్తామని అటవీ శాఖ వెల్లడించింది.

ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్‌గా నల్లమల

శివమహాపురాణం ప్రకారం మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో రెండోది శ్రీశైలం క్షేత్రం ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, దాదాపు 500 శివలింగాలు నల్లమల అడవుల్లో ఉన్నాయంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నల్లమల అడవుల్లో కొన్ని ఆలయాలకు చేరుకోవడం అత్యంత సాహసమైన విషయం. అందుకే ఇక్కడి అతి ప్రాచీన శివలింగాల గురించి బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు స్థానికుల సహాయంతో కొందరు సాహసికులు కొన్నింటిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలయమే నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం.

why ishtakameswari temple closed how to reach this temple from srisailam

ఒకప్పుడు సిద్ధులే పూజలు చేసేవారు

చాలా ఏళ్ల క్రితం వరకు కూడా ఇష్టకామేశ్వరి ఆలయం గురించి ఎవ్వరికీ తెలియదు. అందులో అడవుల్లో ఉండే సిద్ధులే అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఇప్పుడు కొంచెం దారి ఉండటం, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల సామాన్య భక్తులు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు. తమ కోరికలు అమ్మవారికి చెప్పుకొని అమ్మ వారి అనుగ్రహం పొందుతున్నారు.

రెండు చేతుల్లో తామర మొగ్గలు, మరో రెండు చేతుల్లో శివలింగం

అమ్మవారి రూపం కూడా భక్తులను మైమరిపిస్తుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారు చతుర్బుజాలతో దర్శనమిస్తారు. రెండు చేతుల్లో తామర మొగ్గలు, మరో రెండు చేతుల్లో శివలింగం, రుద్రాక్ష మాల ఉంటుంది. తపస్సు చేస్తున్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తారు. దీపం వెలుగుల మధ్య గుహలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని ఒక అనుభూతి అని చెప్పుకోవచ్చు.

why ishtakameswari temple closed how to reach this temple from srisailam

అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆలయానికి వెళ్లగలం

ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభం కాదు. సరైన రోడ్డు లేకపోవడమే కాదు.. కొండలు, గుట్టల మీదుగా బండరాళ్లు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. జీపులు ఒక్కోసారి స్కిడ్ అయి పల్టీలు కొడతాయా? అన్నట్టుగా భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. జీపులు నడిపై డ్రైవర్లు కూడా చాలా అనుభవం కలిగి ఉంటారు. అందుకే వాళ్లు భక్తులను సురక్షితంగా అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ ఆలయానికి వెళ్లగలం. అది కూడా ఎంతో సాహసం చేసి మరీ అమ్మవారి ఆలయానికి చేరుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకుంటే భక్తులు కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే.. ఎక్కడో దట్టమైన అడవిలో ఉన్నా.. సరైన రోడ్డు లేకున్నా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివెళ్తుంటారు.

Advertisement
Advertisement