త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!

CBSE కొత్త త్రిభాషా విధానంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొత్తగా ఒక భాష నేర్చుకోవడం ఎప్పటికీ వృథా కాదని సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

J

National | Published On Jul 14, 2026, 5.52 pm IST

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
Advertisement
  • 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE అమలు చేస్తున్న త్రిభాషా విధానంపై స్టే ఇవ్వడానికి నిరాకరణ
  • తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • కొత్త భాషలు నేర్చుకోవడానికి పుస్తకాలు, టీచర్ల కొరత ఉందని వాదించిన పిటిషనర్ల తరఫు లాయర్లు
  • "భాష నేర్చుకోవడం ఎప్పటికీ వృథా కాదు" అని సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

CBSE Three Language Policy | త్రినేత్ర.న్యూస్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన 'త్రిభాషా విధానం' (3 Language Policy) పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్రం, NCERT, CBSE లకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

భాష నేర్చుకుంటే వృథా కాదు

ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలు విన్న సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"విద్యార్థులు కొత్తగా ఏదైనా భాష నేర్చుకుంటే అది ఎప్పటికీ వృథా కాదు (Learning a language never goes waste)" అని సీజేఐ పేర్కొన్నారు.

పిటిషనర్ల వాదనలు ఇవీ

కొత్త పాలసీ ప్రకారం, 9వ తరగతి (Class 9) నుంచి విద్యార్థులు తప్పనిసరిగా రెండు భారతీయ భాషలను చదవాలి. అంటే, 5వ తరగతి నుంచి వారు చదువుతూ వస్తున్న భాషలను వదిలేయాల్సి వస్తుందని పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్లు ఆనంద్ గ్రోవర్, గోపాల్ శంకర్ నారాయణన్, ముకుల్ రోహత్గీ వాదించారు. విద్యాపరమైన ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం NCERTకి మాత్రమే ఉందని, CBSEకి లేదని ఆనంద్ గ్రోవర్ స్పష్టం చేశారు.

"ఒక విద్యార్థి 9వ తరగతి వరకు ఫ్రెంచ్ చదివి, ఇప్పుడు అకస్మాత్తుగా మూడో భాషగా తమిళం లేదా పంజాబీ చదవమంటే ఎలా? వాళ్లకు పాఠాలు చెప్పేందుకు తగిన టీచర్లు, పుస్తకాలు ఎక్కడున్నాయి?" అని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం 2030 నాటికి అమలు చేయాల్సిన విధానాన్ని, CBSE ముందే అమలు చేస్తోందని అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు.

ఇంగ్లీష్‌పై వివక్ష ఉందా?

ఈ విధానంలో ఇంగ్లీష్‌ను (English) ఒక "నాన్-నేటివ్" (స్థానికేతర) భాషగా పరిగణిస్తున్నారని గోపాల్ శంకర్ నారాయణన్ ఆక్షేపించారు. 22 స్థానిక భాషలను నేర్పించేందుకు NCERT వెబ్‌సైట్‌లో కేవలం మూడు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం అమలు చేస్తే చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన సీజేఐ.. "ఒకవేళ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే, తిరిగి నియమించేలా మేము ఆదేశాలిస్తాం" అని బదులిచ్చారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) ఐశ్వర్య భాటి.. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కోరారు. కోర్టు అందుకు అంగీకరిస్తూ పది రోజుల సమయం మంజూరు చేసింది. పేద విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఈ పాలసీ తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ మంత్రి ఫౌజియా ఖాన్ తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు విన్నవించారు.

Advertisement
Advertisement