Travel In November | ఫ్యామిలీ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? చలికాలంలో సందర్శించాల్సిన 8 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలివే..!
Travel In November | కుటుంబంతో కలిసి ఓ చక్కటి విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? రోజువారీ ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి ప్రకృతి అందాల మధ్య సేదతీరాలని భావిస్తున్నారా? అయితే నవంబర్ నెల మీ ప్రయాణానికి అనువైన సమయం. వర్షాకాలం ముగిసి.. చలికాలం మొదలయ్యే ఈ సమయంలో దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకుంటాయి.
Travel In November | కుటుంబంతో కలిసి ఓ చక్కటి విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? రోజువారీ ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చి ప్రకృతి అందాల మధ్య సేదతీరాలని భావిస్తున్నారా? అయితే నవంబర్ నెల మీ ప్రయాణానికి అనువైన సమయం. వర్షాకాలం ముగిసి.. చలికాలం మొదలయ్యే ఈ సమయంలో దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. మరెక్కడో చల్లని గాలుల పలకరింపు.. ఇంకొన్ని చోట్ల ఎడారి చల్లదనం.. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేవారికి నవంబర్ నెలలో సందర్శించదగిన ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పచ్చని కొండలు, అందమైన జలమార్గాలు, తెల్లని ఉప్పు ఎడారులు.. ఇలా వైవిధ్యమైన అనుభవాలను అందించే ఎనిమిది ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
అమృత్‌సర్.. ఆధ్యాత్మికతకు, దేశభక్తికి చిరునామా

పంజాబ్‌లోని అమృత్‌సర్ అంటే ముందుగా గుర్తొచ్చేది స్వర్ణ దేవాలయం. సిక్కుల పవిత్ర ప్రార్థనా మందిరమైన ఈ గురుద్వారా ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన నిర్మాణశైలితో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నవంబర్‌లో గురునానక్ జయంతి సందర్భంగా నగరమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. గురుద్వారాలను విద్యుత్ దీపాలతో అలంకరించడం, ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. స్వర్ణ దేవాలయం చుట్టూ ఉన్న పవిత్ర సరస్సులో ప్రతిబింబించే ఆలయ సౌందర్యం పర్యాటకులకు మరపురాని అనుభూతినిస్తుంది. అనంతరం జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించి దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను తెలుసుకోవచ్చు. అలాగే వాఘా-అట్టారి సరిహద్దులో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకను వీక్షించడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ నవంబర్ నుంచి చలి క్రమంగా పెరుగుతూ వస్తుంది. పగటిపూట వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వీస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున మంచు, పొగమంచు కారణంగా చల్లదనం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు వెంట తీసుకెళ్లడం మంచిది. గురునానక్ జయంతి సమయంలో భక్తులు, పర్యాటకుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.
హంపి.. విజయనగర వైభవం

చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి కర్ణాటకలోని హంపి ఓ అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన ఈ ప్రాంతం నేటికీ తన ప్రాచీన వైభవాన్ని కళ్లకు కడుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపిలో అడుగడుగునా చరిత్ర కనిపిస్తుంది. ఎత్తైన రాతి కొండలు, అద్భుతమైన దేవాలయాలు, పురాతన రాజభవనాల శిథిలాలు, రాతి మండపాలు పర్యాటకులను మరో కాలంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి విఠల ఆలయంలోని ప్రసిద్ధ రాతి రథం ప్రత్యేక ఆకర్షణ. అలాగే విరూపాక్ష ఆలయం, హజార రామాలయం, లోటస్ మహల్, ఏనుగుల శాల వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. విస్తారంగా విస్తరించిన ఈ ప్రాంతాన్ని కాలినడకన లేదా సైకిల్‌పై చుట్టిరావడం మంచి అనుభవం. ప్రకృతి, చరిత్ర, ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి హంపి ప్రయాణం ప్రత్యేకంగా నిలుస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పెట్టే హంపి.. నవంబర్‌లో మాత్రం సందర్శకులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. వర్షాకాలం ముగియడంతో వాతావరణం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ ఎక్కువగా వేడి ఉండదు. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వీయడంతో చారిత్రక కట్టడాలను సందర్శించడానికి అనువుగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టోపీ, సన్‌స్క్రీన్, తగినంత మంచినీరు వెంట తీసుకెళ్లడం మంచిది.
కూర్గ్.. కాఫీ తోటల మధ్య చల్లని సేదతీరుతూ..

ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) బెస్ట్ ఆప్షన్. పచ్చని కొండలు, కాఫీ తోటలు, దట్టమైన అడవులు, జలపాతాలతో ఈ ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నగరాల రణగొణధ్వనులకు దూరంగా కుటుంబంతో కలిసి ప్రశాంతమైన సమయాన్ని గడపాలనుకునేవారికి కూర్గ్ మంచి అనుభూతిని అందిస్తుంది. ఇక్కడి అబ్బే జలపాతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే నీటి ధారలు, చుట్టూ పచ్చని వాతావరణం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. కాఫీ తోటల్లో విహరిస్తూ కాఫీ సాగు విధానాన్ని తెలుసుకోవచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడేవారు కొండ ప్రాంతాల్లో సాహసయాత్ర చేయవచ్చు. రాజాస్ సీట్ వంటి ప్రాంతాల నుంచి కనిపించే కొండల అందాలను ఆస్వాదించవచ్చు. నవంబర్‌లో కూర్గ్ పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలు కావడంతో కొన్ని చోట్ల పలుచని పొగమంచు కనిపిస్తుంది. కాఫీ తోటల మధ్య వీచే చల్లని గాలులు ప్రయాణానికి మరింత అందాన్ని తెస్తాయి. పగటిపూట ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అనువుగా ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో స్వెటర్, జాకెట్స్ ధరించాల్సిందే. వర్షాలు తగ్గినప్పటికీ అప్పుడప్పుడు చిరుజల్లులు పడే అవకాశం ఉంటుంది.
అలప్పుజా.. బ్యాక్‌వాటర్స్‌లో బోట్ హౌస్ ప్రయాణం..

కేరళలోని అలప్పుజా (అలెప్పీ) ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన పర్యాటక అనుభూతిని అందిస్తుంది. అందమైన సరస్సులు, కాలువలు, మడుగులు, కొబ్బరి చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని ‘తూర్పు వెనిస్’గా పిలుస్తారు. ఇక్కడి బ్యాక్‌వాటర్స్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. నీటిపై తేలియాడే హౌస్‌బోట్‌లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం జీవితంలో మరచిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది. హౌస్‌బోట్ ప్రయాణంలో ఇరువైపులా కనిపించే పచ్చని కొబ్బరి తోటలు, నీటి కాలువలు, చిన్న చిన్న గ్రామాలు, సంప్రదాయ ఇళ్లు కేరళ గ్రామీణ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తాయి. స్థానికుల జీవన విధానం, చేపల వేట, వ్యవసాయం ఎలా చేస్తారో చూడొచ్చు. . కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రాంతం. కేరళలో వర్షాకాలం తగ్గుముఖం పట్టే సమయం కావడంతో నవంబర్‌లో అలప్పుజాలో వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెద్దగా పడిపోకపోయినా, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. పగటిపూట కొంత వేడిగా అనిపించినా, ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు వీస్తాయి. అప్పుడప్పుడు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షంలో బ్యాక్‌వాటర్స్ అందాలు మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
జైసల్మేర్.. ఇసుక దిబ్బల మధ్య నక్షత్రాల రేయి..

రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎడారి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి బెస్ట్ డెస్టినేషన్. బంగారు రంగులో మెరిసే ఇసుక దిబ్బలు, పురాతన కోటలు, అందమైన హవేలీలు ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ‘గోల్డెన్ సిటీ’గా పేరొందిన జైసల్మేర్‌లోని సోనార్ కోట ప్రధాన పర్యాటక ఆకర్షణ. పసుపు ఇసుకరాయితో నిర్మించిన ఈ కోట సూర్యకాంతిలో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. పట్వాన్ కీ హవేలీ వంటి పురాతన భవనాలను సందర్శిస్తూ రాజస్థానీ నిర్మాణ కళను ఆస్వాదించవచ్చు. ఇక సమ్ శాండ్ డ్యూన్స్‌లో ఒంటెపై సవారీ చేస్తూ ఎడారి అందాలను చూడొచ్చు. రాత్రివేళ ఎడారిలో క్యాంపింగ్ చేస్తూ జానపద సంగీతం, నృత్య కార్యక్రమాలను ఆస్వాదించడం మరో ప్రత్యేక అనుభూతి. నిర్మలమైన ఆకాశంలో మెరిసే నక్షత్రాల మధ్య గడిపే సమయం ఈ ప్రయాణాన్ని మరింత మధురంగా మారుస్తుంది. వేసవిలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసే జైసల్మేర్ నవంబర్‌లో పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో పగటిపూట వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, ఎడారిలో విహరించడానికి అనువుగా ఉంటుంది. ఎడారి ప్రాంతం కావడంతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత చలి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తాయి.
షిల్లాంగ్.. పూలతో మెరిసే కొండల నగరం..

ఈశాన్య భారతదేశ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ మంచి ఎంపిక. పచ్చని కొండలు, లోయలు, అందమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ హిల్‌స్టేషన్ ప్రత్యేకత. ప్రకృతి సౌందర్యంతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలనుకునేవారికి కూడా ఈ ప్రాంతం అనువుగా ఉంటుంది. నవంబర్‌లో జరిగే చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ షిల్లాంగ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఈ సమయంలో చెర్రీ పూలు గులాబీ రంగులో విరబూస్తూ కొండ ప్రాంతాలకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. పూల అందాల మధ్య ఫొటోలు దిగడం, స్థానిక సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించడం పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. అయితే పూలు పూర్తిగా వికసించే సమయం వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత షిల్లాంగ్‌లో వాతావరణం క్రమంగా చల్లబడుతుంది. నవంబర్‌లో పగటిపూట ఆహ్లాదకరమైన చల్లదనం ఉండగా, ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. కొండ ప్రాంతాల్లో పొగమంచు కనిపించడంతో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. చల్లని గాలుల నుంచి రక్షణ కోసం వెచ్చని దుస్తులు, జాకెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఈ నెల 20, 21 తేదీల్లో వెళితే చెర్రీ బ్లాసమ్ అందాలను చూడొచ్చు. ఎందుకంటే ఈ రెండురోజుల్లో చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగనుంది.
వారణాసి.. దీపాల వెలుగుల్లో గంగమ్మ ఒడిలో..

ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల కలయికను ఆస్వాదించాలనుకునేవారికి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మంచి గమ్యస్థానం. గంగా నది తీరాన వెలసిన ఈ పురాతన నగరం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి ఘాట్లు, పురాతన ఆలయాలు, ఆధ్యాత్మిక వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. తెల్లవారుజామున గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ ఘాట్ల అందాలను వీక్షించడం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడంతో పాటు సాయంత్రం జరిగే గంగా హారతిని వీక్షించవచ్చు. దీపాల వెలుగులు, మంత్రోచ్ఛారణలు, గంటల శబ్దాల మధ్య జరిగే హారతి వేడుక భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తుతుంది. ఇక నవంబర్‌లో నిర్వహించే దేవ్ దీపావళి ఈ నగరానికి మరింత ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా గంగానది తీరంలోని ఘాట్లన్నీ వేలాది మట్టి ప్రమిదల వెలుగులతో మెరిసిపోతాయి. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడటం ఓ అద్భుత అనుభవం. నవంబర్ నుంచి వారణాసిలో చలికాలం మొదలవుతుంది. పగటిపూట వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. తెల్లవారుజామున, రాత్రివేళల్లో చలిబాగానే ఉంటుంది. గంగానది పరిసరాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో పడవ ప్రయాణం మరింత అందంగా కనిపించినప్పటికీ, చలి ఎక్కువగా అనిపిస్తుంది. వారణాసి వెళ్లే ముందు తప్పనిసరిగా పండుగల తేదీలను చూసుకొని వెళ్లాలి. ఎందుకంటే రద్దీ అధికంగా ఉంటుంది. ముందస్తుగానే హోటల్‌లో రూమ్‌లు బుక్ చేసుకోవడం మంచిది.
రణ్ ఆఫ్ కచ్.. వెన్నెల్లో మెరిసే తెల్లని ఉప్పు ఎడారి..
గుజరాత్‌లోని కచ్ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, భిన్నమైన అనుభూతులను కోరుకునేవారికి ప్రత్యేకమైన పర్యాటక గమ్యస్థానం. విశాలంగా విస్తరించిన తెల్లని ఉప్పు మైదానాలు, ఎడారిని తలపించే ప్రకృతి దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా రణ్ ఆఫ్ కచ్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పగటిపూట తెల్లని ఉప్పు మైదానాలు సూర్యకాంతిలో మెరుస్తుంటే.. పౌర్ణమి వెన్నెల్లో ఆ ప్రాంతం వెండి వర్ణంలో మెరిసిపోతుంది. ఇక్కడ నిర్వహించే రణ్ ఉత్సవ్ పర్యాటకులకు మరో ప్రత్యేక ఆకర్షణ. గుజరాతీ జానపద సంగీతం, సంప్రదాయ నృత్యాలు, స్థానిక హస్తకళలు, ఆహార ప్రత్యేకతలు ఈ ఉత్సవంలో ప్రధాన భాగం. సంప్రదాయ దుస్తులు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు కచ్ సంస్కృతిని పరిచయం చేస్తాయి. తెల్లని ఎడారి మధ్య ఏర్పాటు చేసే టెంట్లలో బస చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా వెన్నెల రాత్రుల్లో రణ్ అందాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ చలికాలంలో కచ్ ప్రాంతంలో వాతావరణం పొడిగా మారుతుంది. నవంబర్‌లో పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉంటాయి. సాయంత్రం నుంచి చలి పెరుగుతుంది. ఎడారి స్వభావం కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశాలుంటాయి. తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తాయి. కాబట్టి రణ్ ఉత్సవ్ సందర్భంగా టెంట్ వసతుల్లో బస చేయాలనుకునేవారు వెచ్చని దుస్తులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పౌర్ణమి రోజుల్లో తెల్లని ఉప్పు మైదానాల అందాలను వీక్షించాలనుకునేవారు ముందుగానే ప్రయాణ ప్రణాళిక రూపొందించువడం మంచిది. రన్ ఉత్సవ్ ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది మార్చి 7 వరకు కొనసాగనుంది.
ఈ జాగ్రత్తలు పాటించండి..
నవంబర్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్, వారణాసి ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్, గుజరాత్‌లోని కచ్ ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడాలు ఎక్కువగా ఉంటాయి. ఇక షిల్లాంగ్, కూర్గ్ వంటి కొండ ప్రాంతాల్లో చల్లని గాలులు, పొగమంచు పర్యాటకులను పలకరిస్తాయి. కేరళలోని అలప్పుజాలో తేమతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబంతో ప్రయాణించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉంటే వారికి అవసరమైన వెచ్చని దుస్తులు, మందులు, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లాలి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగలు, సెలవు రోజుల్లో వెళ్తే మాత్రం హోటల్స్, ప్రయాణానికి టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకోవడం మంచిది. నవంబర్ నెలలో చేసే విహారయాత్ర మీకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ఎక్కడో మంచు గాలుల మధ్య కొండల అందాలు.. మరెక్కడో ఎడారి ఇసుక దిబ్బలపై నక్షత్రాల వెలుగు.. ఇంకొక్కడో వేలాది దీపాల కాంతుల్లో మెరిసే ఘాట్లు.. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. మరి మీరు ఈ శీతాకాలపు విహారయాత్రను జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకోండి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా
- ●Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?
- ●Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ
- ●CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్

Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?

Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం






