త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం

Talasani Srinivas Yadav | రాష్ట్రాన్ని దోపిడీ దొంగల మాదిరిగా దోపిడీ చేస్తూ ప్రజా పాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

P

Telangana | Published On Sep 4, 2026, 4.17 pm IST

Talasani Srinivas Yadav | కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం
Advertisement
  • దోపిడీ దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు
  • ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా పాలన అంటారా?
  • జీఓ 97ను రద్దు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
  • బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

Talasani Srinivas Yadav | రాష్ట్రాన్ని దోపిడీ దొంగల మాదిరిగా దోపిడీ చేస్తూ ప్రజా పాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా పాలన అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కేసీఆర్‌ తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టారు..

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక కేసీఆర్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తలసాని గుర్తు చేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ముందు నీళ్లు, విద్యుత్‌ కోసం ప్రజలు అల్లాడిపోయారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్‌ సరఫరా, చెరువుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి దేశానికే అన్నపూర్ణగా మారిందని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌, నీటి సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతు, పేదల కోసం ఎన్నో పథకాలు

పంట పెట్టుబడి కోసం రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించామని, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలిచామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద రూ.1,00,116 ఆర్థిక సాయం అందించామని తెలిపారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని, విద్యార్థినులకు స్కూటీలు, వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించలేదా? అని నిలదీశారు.

వెయ్యి రోజుల పాలనపై ప్రజలకు వివరిస్తాం..

వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించి దోషులుగా నిలబెడతామని తలసాని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల్లో బ్రహ్మాండమైన పాలన అందించామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో వేడుకలు చేయకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలి ఢిల్లీలో తమ పార్టీ పెద్దలకు ఊడిగం చేయడానికి వెళ్లారని విమర్శించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, విమర్శలు చేసుకుంటూ తెలంగాణ పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూములను 22ఏ పరిధిలోకి తెచ్చే అధికారం ఎవరిచ్చారు?

వారసత్వంగా వచ్చిన పేదల ఇళ్లు, భూములను 22ఏ పరిధిలోకి తీసుకొచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని తలసాని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల ఆస్తులను కాజేసేందుకు పాలిటెక్నిక్‌ కాలేజీలను స్కిల్‌ యూనివర్సిటీలకు అనుసంధానం చేసేందుకు జీఓ 97 తీసుకొచ్చారని ఆరోపించారు.

జీఓ 97 రద్దు చేయకుంటే అసెంబ్లీ ముట్టడి

ఈ నెల 7వ తేదీలోగా జీఓ 97ను రద్దు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని తలసాని హెచ్చరించారు. పాలిటెక్నిక్‌ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్‌ పాలనతో విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ‘‘ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుంది’’ అని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement