త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్‌..

SIAM Sales Report | దేశంలో వాహన విక్రయాల్లో రాష్ట్రాల మధ్య విభిన్న ధోరణి కనిపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ) మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

P

Business | Published On Sep 4, 2026, 3.07 pm IST

SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్‌..
Advertisement

SIAM Sales Report | దేశంలో వాహన విక్రయాల్లో రాష్ట్రాల మధ్య విభిన్న ధోరణి కనిపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ) మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (SIAM) రాష్ట్రాల వారీగా విడుదల చేసిన విక్రయ గణాంకాల్లో వెల్లడైంది.

కార్ల విక్రయాల్లో మహారాష్ట్ర టాప్‌

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 12.74 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు విక్రయమయ్యాయి. ప్రాంతాల వారీగా పశ్చిమ ప్రాంతం 3.90 లక్షల యూనిట్ల విక్రయాలతో ముందంజలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 1,47,440 ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలతో తొలి స్థానంలో నిలిచింది. యూపీ 1,35,329 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 98,825, కర్ణాటక 98,315, తమిళనాడు 96,327 యూనిట్ల విక్రయాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో కార్లు సహా ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో మహారాష్ట్ర అగ్రస్థానాన్ని సాధించింది.

ద్విచక్ర వాహనాల్లో యూపీ దూకుడు

ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 56.29 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రాంతాల వారీగా పశ్చిమ ప్రాంతం 16.61 లక్షల యూనిట్లతో ముందంజలో నిలిచింది. రాష్ట్రాల వారీగా ఉత్తర్‌ప్రదేశ్‌ 8,82,047 ద్విచక్ర వాహనాల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 5,61,738 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా.. తమిళనాడు 4,80,653, కర్ణాటక 3,74,221, బిహార్‌ 3,69,302 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

త్రీవీల‌ర్‌లోనూ యూపీదే పైచేయి

త్రీవ‌ల‌ర్ వాహనాల విక్రయాల్లోనూ ఉత్తర్‌ప్రదేశ్‌ ఆధిపత్యం కొనసాగింది. ఏప్రిల్‌–జూన్‌ మధ్య దేశవ్యాప్తంగా 2.14 లక్షల త్రీవీల‌ర్ వాహనాలు విక్రయమయ్యాయి. ప్రాంతాల వారీగా సౌత్ రీజియ‌న్ 71 వేల యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో అత్యధికంగా 25,669 త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గుజరాత్‌ 20,534, కర్ణాటక 19,192, బిహార్‌ 15,653, అసోం 15,223 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రెండు విభాగాల్లోనూ యూపీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

కమర్షియల్‌ వాహనాల్లో మహారాష్ట్ర

కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 2.65 లక్షల కమర్షియల్‌ వాహనాలు విక్రయమయ్యాయి. ప్రాంతాల వారీగా పశ్చిమ ప్రాంతం 91 వేల యూనిట్ల విక్రయాలతో ముందుంది. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర 36,433 కమర్షియల్‌ వాహనాల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు 24,743, కర్ణాటక 21,830, గుజరాత్‌ 21,778, యూపీ 21,161 యూనిట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
Advertisement