త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్‌’ అనడం హాస్యాస్పదం

Minister Seethakka | ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకున్న బీఆర్‌ఎస్‌ నానాజాతి సమితిగా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్‌’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన నాయకులతో బీఆర్‌ఎస్‌ నిండిపోయినప్పుడు ఆ పార్టీని కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా? అని ప్రశ్నించారు.

P

Telangana | Published On Sep 4, 2026, 3.22 pm IST

Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్‌’ అనడం హాస్యాస్పదం
Advertisement
  • నానాజాతి స‌మితిగా బీఆర్ఎస్‌
  • కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొద‌లైందో కేటీఆర్ గుర్తు చేసుకోవాలి
  • ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు
  • దూషణలు, కించపరిచే పోస్టర్లను సహించేది లేదు
  • మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకున్న బీఆర్‌ఎస్‌ నానాజాతి సమితిగా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్‌’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన నాయకులతో బీఆర్‌ఎస్‌ నిండిపోయినప్పుడు ఆ పార్టీని కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా? అని ప్రశ్నించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్‌ తన పార్టీ చరిత్రను ఒక్కసారి చూసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరా? అని ప్రశ్నించారు. ‘‘మీ పార్టీలోకి వస్తే పవిత్రులు.. పక్క పార్టీలోకి వెళితే అనైతికులా? ఇదేనా మీ రాజకీయ సంస్కారం?’’ అని నిలదీశారు. టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. ‘‘మీ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నప్పుడు మీ పార్టీని పచ్చ పార్టీ అనాలా?’’ అని ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీ నుంచి ప్రారంభమైందో గుర్తు చేసుకోవాలని సూచించారు.

సంక్షేమం చూస్తే ఓర్వలేకపోతున్నారు..

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేక రోడ్లపైకి వచ్చి నిరసనల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీతక్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల కడుపు నింపే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పేదలకు లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని, ప్రజా ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రతి అర్హుడైన పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఆలోచన కూడా బీఆర్‌ఎస్‌ పాలనలో లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు సన్నవడ్లకు బోనస్‌ ఇచ్చి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, అదే సన్నబియ్యాన్ని పేద కుటుంబాలకు పంపిణీ చేస్తోందన్నారు. ‘‘పేదవాడు కడుపునిండా అన్నం తింటుంటే మీకు ఓర్వలేకపోతున్నారు. పేదల సంక్షేమం చూస్తే మీకు ఎందుకు ఈ అసహనం?’’ అని ప్రశ్నించారు. సామాన్య కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కరెంట్‌ బిల్లు చెల్లించకపోతే పేదల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు.

హామీలపై నిలదీత

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, చేయకపోతే మెడ నరుక్కుంటానని చెప్పిన మాట ఏమైందని సీతక్క ప్రశ్నించారు. దళితులకు ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని, ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గ్రామాలకు వెళ్లి, పల్లెల్లో తిరిగి చూస్తే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏం జరిగిందో, ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎంత లబ్ధి జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా, ఏ మండలంలో లబ్ధిదారుల వివరాలు చూసినా ప్రభుత్వ పథకాల అమలుపై లెక్కలతో సహా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘మేం రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు బోనస్‌ ఇచ్చాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చేసిన ప్రతి పనికి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పదేళ్లలో ఏం చేశారో మాత్రం లెక్కలతో చెప్పండి’’ అని సవాల్‌ విసిరారు. మండలాల వారీగా లబ్ధిదారుల జాబితాలతో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రైతు రుణమాఫీ, పంట బోనస్‌, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన.. ఏ అంశంపైనైనా చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ నాయకులకు సవాల్‌ చేశారు.

కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో కూడా చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎందుకు సహకరించడం లేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. ప్రజా ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

దూషణలు, పోస్టర్లను సహించం

అనవసరంగా చిల్లర రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులను సీతక్క హెచ్చరించారు. వ్యక్తిగతంగా అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. తమ నాయకులను, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరిచేలా పోస్టర్లు వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని అన్నారు. ‘‘మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మేము సహనంతో ఉన్నామని చేతకానితనంగా భావించవద్దు. మా కార్యకర్తల సహనం కోల్పోతే నష్టం మీకే జరుగుతుంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టిగా సమాధానం చెబుతాం’’ అని మంత్రి సీతక్క హెచ్చరించారు.

Advertisement
Advertisement