త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే

స్పీకర్ పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు, కేసీఆర్ వైఖరిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

J

Telangana | Published On Sep 14, 2026, 2.51 pm IST

Mahesh Kumar Goud | కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి అసలు కారణం అదే

సంక్షిప్త సారాంశం

స్పీకర్ ను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దళితులకు చేసిన మోసంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ ను గౌరవించలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ 2003 నాటి హామీలు, దళిత బంధు అమలుపై పలు ప్రశ్నలు సంధించారు.

Advertisement
  • మహేష్ కుమార్ గౌడ్ సంచలన విమర్శలు

Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్... అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజకీయ పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పండగ రోజు రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు ప్రజల ముందుంచాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Why KCR is Avoiding the Assembly? TPCC Chief Mahesh Kumar Goud's Sensational Comments

దళితులు, స్పీకర్ పై బీఆర్ఎస్ వైఖరి ఇదేనా?

శాసనసభాపతిని కులం పేరుతో దూషించిన దుస్థితి రావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని, దీనిని బట్టి దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిజమైన వైఖరి ఏంటో స్పష్టమవుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత కార్డును కేసీఆర్ ఏ విధంగా రాజకీయ లబ్ది కోసం వాడారో ప్రజలందరూ చూశారన్నారు. గద్దర్, అందేశ్రీ వంటి మహా మనుషులను సైతం ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసని గుర్తుచేశారు.

కేసీఆర్ పై శ్వేతపత్రం డిమాండ్

2003లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని తెచ్చారని, అర్హులైన ఎంతమందికి ఆ సాయం అందించారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదని, ఆ మహానేత ఆశయాలను, విలువలను ఆచరణలో పెట్టాలని హితవు పలికారు.

అసెంబ్లీ బహిష్కరణ వెనుక అసలు మర్మం

దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఒక దళిత నేత స్పీకర్ స్థానంలో ఉండి, ఆయనను 'అధ్యక్షా' అని పిలవాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. రీల్ మాక్ అసెంబ్లీలు పెట్టడం కాదు, దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రతిపక్ష నాయకుడిగా చేయాలని సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ, దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement