త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHRC | క్షుద్ర రాజ‌కీయాల‌కు ఎన్‌హెచ్ఆర్సీ బ్రేక్.. చ‌ర్య‌ల‌కు డీజీపీకి క‌మిష‌న్ ఆదేశం

NHRC | మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావుపై బహిరంగంగా "బ్లాక్ మేజిక్", "క్షుద్ర పూజలు" ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) లో న్యాయవాది, సామాజిక వేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Sep 9, 2026, 10.38 pm IST

NHRC | క్షుద్ర రాజ‌కీయాల‌కు ఎన్‌హెచ్ఆర్సీ బ్రేక్.. చ‌ర్య‌ల‌కు డీజీపీకి క‌మిష‌న్ ఆదేశం
Advertisement

NHRC | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్‌రావుపై బహిరంగంగా "బ్లాక్ మేజిక్", "క్షుద్ర పూజలు" ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) లో న్యాయవాది, సామాజిక వేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్‌హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లోగా "యాక్షన్ టేకెన్ రిపోర్ట్" సమర్పించాలని తెలంగాణ డీజీపీని కమిషన్ బుధ‌వారం ఆదేశించింది.

హరీశ్‌రావు తరఫున ఆయన అనుమతితో, హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12(a) కింద 22.08.2026న ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 2026 జూలై 31 నుంచి ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ సహా ఉన్నత పదవుల్లో ఉన్నవారు.. వర్షాలు ఆగిపోయేందుకు, కరువు రావడానికి హరీశ్‌రావు ఆలయాల్లో తాంత్రిక పూజలు జరిపించారంటూ పదేపదే బహిరంగ ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ ఒక్క ఆలయ రికార్డు, పూజారి, రసీదు లేదా సాక్షి ఇప్పటివరకు బహిర్గతం కాలేదని తెలిపారు.

ఆగ‌స్టు 4న ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందజేసినా, ఆగ‌స్టు 17న డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సీలుతో స్వీకరించినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, కారణాలు కూడా తెలియజేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. లలితా కుమారి vs. యూపీ ప్రభుత్వం, (2014) 2 SCC 1 తీర్పు ప్రకారం ఇది తప్పనిసరి అని గుర్తు చేశారు.

క్షుద్ర పూజల వల్ల వర్షాలు ఆగుతాయని అత్యున్నత పదవుల్లో ఉన్నవారే ప్రకటించడం వల్ల ప్రజల్లో మూఢనమ్మకాలు బలపడతాయని, గ్రామాల్లో "చేతబడి" ఆరోపణలతో మహిళలు, వితంతువులు, వృద్ధులు, ఎస్సీ/ఎస్టీ వర్గాలపై దాడులు, హత్యలు జరిగే ప్రమాదం పెరుగుతుందని ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు."సాధారణ పౌరుడు ఇటువంటి ప్రకటన చేస్తే వెంటనే కేసు నమోదు అవుతుంది. అధికారంలో ఉన్నవారు చేస్తే ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడమే ఈ ఫిర్యాదుకు మూలం," అని కారుపోతుల రేవంత్ తెలిపారు

 

Advertisement
Advertisement