త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World water day 2026 | నీరున్న చోటే సమానత్వం: ప్రపంచ జల దినోత్సవం 2026 సదస్సులో తెలంగాణ నీటి విప్లవంపై కేఆర్ సురేష్ రెడ్డి ప్రశంసలు

ప్రపంచ జల దినోత్సవం 2026 (మార్చి 22) సందర్భంగా న్యూఢిల్లీలో "వాటర్, జెండర్ అండ్ క్లైమేట్" అనే థీమ్‌తో జరిగిన జాతీయ సదస్సులో తెలంగాణ సాధించిన నీటి విజయాలను బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఎలా నిలిచిందో ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు.

J

Telangana | Published On Mar 17, 2026, 8.05 pm IST

World water day 2026 | నీరున్న చోటే సమానత్వం: ప్రపంచ జల దినోత్సవం 2026 సదస్సులో తెలంగాణ నీటి విప్లవంపై కేఆర్ సురేష్ రెడ్డి ప్రశంసలు
Advertisement

World water day 2026 | త్రినేత్ర.న్యూస్ :  ప్రపంచ జల దినోత్సవం (మార్చి 22) సందర్భంగా న్యూఢిల్లీలోని ఫారిన్ కారస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా (FCC) వేదికగా మంగళవారం ఒక ప్రతిష్టాత్మక జాతీయ సదస్సు జరిగింది. "Water, Gender and Climate" (నీరు, లింగ సమానత్వం అండ్ వాతావరణం) అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, విదేశీ రాయబారులు, మేధావులు పాల్గొన్నారు. "Where Water Flows, Equality Grows" (నీరు ప్రవహించే చోట.. సమానత్వం పెరుగుతుంది) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సదస్సును నిర్వహించారు. ఈ వేదికపై బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నీటి రంగంలో సాధించిన అద్భుత విజయాలను దేశం ముందు ఉంచారు.

రాజకీయ సంకల్పంతోనే తెలంగాణ ప్రగతి: కేఆర్ సురేష్ రెడ్డి

ఈ సదస్సులో పాల్గొన్న ఎంపీ సురేష్ రెడ్డి.. తన మిత్రుడు, మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అయిన సంతోష్ కుమార్ స్థానంలో ఈ సదస్సుకు హాజరైనట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సంతోష్ కుమార్ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆయన ప్రశంసించారు.

"గత పదేళ్లుగా నేను ప్రపంచ జల దినోత్సవం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే, ఒక బలమైన రాజకీయ నాయకత్వం.. ఒక వెనుకబడిన ప్రాంతాన్ని నీటి వనరులతో ఎలా సస్యశ్యామలం చేయగలదో నేను కళ్లారా చూశాను. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం," అని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ దార్శనికత.. మారిన తెలంగాణ ముఖచిత్రం

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రధానంగా 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే మూడు అంశాలనే లేవనెత్తారని సురేష్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 3-4 ఏళ్లలోనే నీటి సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు.

మిషన్ కాకతీయ: కరువు ప్రాంతాల్లోని చెరువులను పునరుద్ధరించి, వాటిని జలకళతో ఉట్టిపడేలా చేశారు. 27,665 పైగా జలాశయాలను బాగు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు: ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయిన కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. దీని ఫలితంగా 2014లో 60 లక్షల టన్నులు ఉన్న వరి దిగుబడి, ఏడెనిమిదేళ్లలో ఏకంగా 3 కోట్ల టన్నులకు చేరింది.

మిషన్ భగీరథ: మారుమూల ప్రాంతాలకు కూడా పైపుల ద్వారా 100 శాతం సురక్షితమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో 100 శాతం కుళాయి నీటిని అందిస్తున్న 50 జిల్లాల్లో, 33 జిల్లాలు తెలంగాణలోనివే కావడం గమనార్హం (55 లక్షల ఇళ్లకు తాగునీరు).

దీంతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్ఫూర్తితో తెలంగాణలో పచ్చదనం (Green Cover) అద్భుతంగా పెరిగిందని సురేష్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. నీటి వనరుల అభివృద్ధితో వెనుకబడిన రాష్ట్రం నుంచి, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు.

దేశంలో నీటి కొరత.. మహిళలపై తీవ్ర ప్రభావం

ఈ సదస్సులో పలు ఆందోళనకరమైన గణాంకాలను నిపుణులు వెల్లడించారు. భారతదేశంలో ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణం 1,486 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. సుమారు 600 మిలియన్ల మంది నీటి కొరతతో అల్లాడుతున్నారు. 2030 నాటికి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ నీరు తెచ్చుకోవడానికే మహిళలు 250 మిలియన్ గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. కలుషిత నీటి వల్ల రోజూ వేలాది మంది పిల్లలు మరణిస్తున్నారు.

న్యూ ఢిల్లీ డిక్లరేషన్ - ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి డా.రాజ్ భూషణ్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరుకాగా, నీతి ఆయోగ్ సభ్యుడు డా.వి.కె. సరస్వత్ ప్రధాన ప్రసంగం చేశారు. డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, 'వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' రాజేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈజిప్ట్, బెల్జియం, నెదర్లాండ్స్ రాయబారులు కూడా హాజరయ్యారు.

"నీటి భద్రత, లింగ సమానత్వం వేర్వేరు కావు. ఇంటికి కుళాయి ద్వారా మంచి నీళ్లు రావడం ద్వారా మహిళలకు సమయం ఆదా అవుతుంది, అదే వారి నిజమైన స్వేచ్ఛ" అని కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌధరి పేర్కొన్నారు.

చివరగా సదస్సులో "వాటర్ అండ్ జెండర్" డిక్లరేషన్‌ను ఆమోదించారు. గ్రామ స్థాయిలో నీటి నిర్వహణలో మహిళలను నాయకులుగా గుర్తించాలని, సంప్రదాయ నీటి వనరులను కాపాడుకోవాలని, 2031 నాటికి నీటిపారుదల సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచాలని తీర్మానించారు. ఈ సందర్భంగా 'వాటర్ అండ్ జెండర్' స్మారక గ్రంథాన్ని విడుదల చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement