త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | యువ‌త‌కు అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు.. టిక్కీ లాంటి సంస్థ‌లు ప్రెజ‌ర‌ర్ గ్రూప్‌గా కూడా ప‌ని చేయాలి

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో టిక్కీ (TICCI) లాంటి సంస్థలు సహకారం అందించడమే కాకుండా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెజర్ గ్రూప్‌గా కూడా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు సూచించారు. నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన రమేష్ నాయక్ అనే గిరిజన బిడ్డ లండన్‌లో 16 హోటళ్లు స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడని కొనియాడారు.

S

Telangana | Published On Aug 12, 2026, 1.13 pm IST

Harish Rao | యువ‌త‌కు అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు.. టిక్కీ లాంటి సంస్థ‌లు ప్రెజ‌ర‌ర్ గ్రూప్‌గా కూడా ప‌ని చేయాలి
Advertisement
  • గిరిజ‌న బిడ్డ‌లు ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్త‌లుగా ఎదిగేందుకు టిక్కీ స‌హ‌కారం అభినంద‌నీయం
  • గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ గిరిజ‌న బిడ్డ లండ‌న్‌లో 16 హోట‌ళ్లు పెట్టిండు
  • సురేశ్‌నాయ‌క్ హైద‌రాబాద్‌లో హార్ల‌క్స్ త‌యారు చేస్తూ పెద్ద కంపెనీల‌తో పోటీ ప‌డుతున్న‌డు
  • గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: యువతకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో టిక్కీ (TICCI) లాంటి సంస్థలు సహకారం అందించడమే కాకుండా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెజర్ గ్రూప్‌గా కూడా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు సూచించారు. నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన రమేష్ నాయక్ అనే గిరిజన బిడ్డ లండన్‌లో 16 హోటళ్లు స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడని కొనియాడారు. గిరిజన యువత వ్యాపార రంగంలో ఎదగడానికి ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ ముఖ్యమ‌న్నారు. సిద్దిపేటలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో బుధ‌వారం జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీ ప్రైడ్ ద్వారా సహకారం అందుకున్న సురేష్ నాయక్ అనే మరో గిరిజన బిడ్డ హైదరాబాద్‌లో హార్లిక్స్, బర్త్ డే కేకులు తయారు చేస్తూ పెద్ద కంపెనీలతో పోటీపడుతున్నాడు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథల నుంచి యువత నేర్చుకోవాలి. ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి.. పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా గిరిజన యువతను మార్చాలనే గొప్ప లక్ష్యంతో 'టిక్కీ' పని చేస్తోంది. గిరిజన బిడ్డలు సబ్సిడీలను ఎలా అందుకోవాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఎలా వినియోగించుకోవాలో టిక్కీ ప్రతినిధులు ఒక మార్గదర్శిగా ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.

కేసీఆర్ నాయకత్వంలో గిరిజన అభివృద్ధి కోసం వందల కోట్ల సబ్సిడీలు ఇస్తూ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఎన్నో గురుకులాలు నిర్మించి నాణ్యమైన విద్యను అందించాం. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచాం. దీనివల్ల ఎంతో మంది గిరిజన బిడ్డలు నేడు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు.

రాష్ట్రంలోని 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజన బిడ్డలను సర్పంచులుగా చేసి వాళ్లకు రాజ్యాధికారాన్ని అందించాం. జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులు ఆ సంవత్సరం ఖర్చు కాకపోతే, అవి ల్యాప్స్ కాకుండా మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తెచ్చి పక్కాగా అమలు చేశాం. 6 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను రైతులుగా మార్చాం.

ఎస్టీ కార్పొరేష‌న్‌కు కేవ‌లం 70 కోట్లే ఖ‌ర్చు చేశారు..

కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర ద్రోహం చేస్తోంది. మేనిఫెస్టోలో ఎన్నో చెప్పారు.. పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు, పీజీ చేస్తే రూ.2 లక్షలు అన్నారు.. కానీ ఏ ఒక్కటి అమలు కాలేదు. మొన్న అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే.. ఎస్టీ కార్పొరేషన్ కు రూ.2,730 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఖర్చు పెట్టింది కేవలం రూ.70 కోట్లు మాత్రమే. ఆ డబ్బులు కరెంట్ బిల్లులకు, ఫ్యాన్లకు, కార్లకు సరిపోయాయి. ఒక్క గిరిజన బిడ్డకు కూడా ఉపాధి కల్పించలేదు.

ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇవాళ లక్ష ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకుని పేదలను రోడ్డున పడేశారు. లగచర్లలో భూములు ఇవ్వబోమని అడిగిన పాపానికి లంబాడీ బిడ్డలను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. గిరిజనుల భూములను లాక్కుని ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డికి, అల్లుడు సత్యకు కట్టబెట్టుకుంటున్నారు. ఎస్టీ, ఎస్డీఎఫ్ నిధులు బడ్జెట్‌లో పెడుతున్నారు.. కానీ, ఖర్చు మాత్రం సగం కూడా కావడం లేదు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. కానీ ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

యువతకు అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో టిక్కీ (TICCI) లాంటి సంస్థలు కేవలం సహకారం అందించడమే కాకుండా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఒక ప్రెజర్ గ్రూప్ గా కూడా పనిచేయాలి. పెండింగ్ లో ఉన్న సబ్సిడీలను రాబట్టడానికి కృషి చేయాలి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మేం గిరిజనుల పక్షాన పోరాడుతాం. సిద్దిపేట జిల్లాలోని ఎస్టీ యువతీయువకులు టిక్కీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో సభ్యులుగా చేరి, నైపుణ్యాలు పెంచుకుని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని హ‌రీశ్ రావు సూచించారు.

Advertisement
Advertisement